సుదీర్ఘ నిరీక్షణ తరువాత భారత్ - యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ చర్యను ప్రశంసిస్తూ.. ఇది అన్ని ఒప్పందాలకూ తల్లి లాంటిదని (మదర్ ఆఫ్ ఆల్ డీల్స్)అన్నారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించినట్లు.. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
అబద్దాలకోరు ఉర్సులా & భారత బృందం 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్' అనే ఒప్పందంపై సంతకాలు చేస్తున్నారని నేను వింటున్నాను. ఇది చాలా బాగుంది. నేను దేశాన్ని పాలిస్తుంటే, వాళ్లు ఇంట్లో కూర్చుని ఆటలు ఆడుకుంటున్నారు. ఇక్కడ ఒక డాడీ ఉన్నాడని అందరికీ తెలుసు, అతను ఓవల్ ఆఫీస్‌లో కూర్చుని అమెరికాను మళ్లీ ధనిక దేశంగా మారుస్తున్నాడు అని పోస్టులో వెల్లడించారు.

అంతే కాకుండా.. యూరోపియన్ యూనియన్ దివాలా తీసింది కాబట్టే వాళ్లు ఒక తల్లి కోసం వేడుకోవాల్సి వచ్చింది. బహుశా వాళ్లు తమ సొంత బిల్లులు కూడా చెల్లించలేకపోతున్నారు కాబోలు!. నేను భారతదేశంతో చెప్పాను. మీకు ఒప్పందం కావాలా? అయితే ముందుగా 50 శాతం డాడీ ట్యాక్స్ (టారిఫ్‌లు!) చెల్లించండి. ఇది జరగబోయే ఒక పెద్ద విపత్తు. నా ఒప్పందాలు భారీగా ఉంటాయని, ఆ ఒప్పందం ఒక హైస్కూల్ సైన్స్ ప్రాజెక్ట్ మాదిరిగా ఉందని కూడా పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. కానీ ట్రంప్ ట్రూత్ సోషల్‌లో ఇలా పోస్ట్ చేసినట్లు ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.
భారత్ - ఈయూ డీల్ ప్రయోజనాలు
ఇండియా.. యూరోపియన్ యూనియన్ మధ్య జరిగిన ఒప్పందం కారణంగా.. మన దేశం నుంచి ఎగుమతులు, దిగుమతులు పెరుగుతాయి. ట్యాక్స్ తగ్గించడంతో.. వీటి ధరలు చాలా వరకు తగ్గుతాయి. తద్వారా.. మన దేశంలో ప్రీమియం కార్ల ధరలు, మెడిసిన్స్ ధరలు, మద్యం ధరలు చాలా వరకు తగ్గుతాయి. అంతే కాకుండా.. ఎలక్ట్రానిక్ & హై-టెక్ యంత్రాలపైన, ఉక్కు & రసాయన ఉత్పత్తులపైన ట్యాక్స్ రద్దు చేసే అవకాశం ఉందని సమాచారం.


