న్యూఢిల్లీ: జనవరి 28వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఒక రోజు ముందుగా 27వ తేదీన అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సమావేశంలో ఎజెండాతోపాటు ఇతర అంశాలు చర్చకు రానున్నాయి. పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లోని కమిటీ మెయిన్ రూంలో 27వ తేదీ ఉదయం 11 గంటలకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరుగనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
యూపీయే హయాంలో తీసుకువచి్చన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థాయిలో కేంద్రం ఇటీవల తీసుకువచి్చన వీబీ– గ్రామీణ్ చట్టానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కాంగ్రెస్ ఒక వైపు దేశ వ్యాప్త ఆందోళనలు కొనసాగిస్తుండగా, మరో వైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్‌లతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుదేలైన వేళ పార్లమెంట్ సెషన్ మొదలవుతుండటం గమనార్హం. ఈ నెల 28వ తేదీన ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంతో సెషన్ ప్రారంభం కానుంది. పార్లమెంట్ చరిత్రలోనే అత్యంత అరుదుగా ఫిబ్రవరి ఒకటో తేదీ, ఆదివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండటం తెల్సిందే.


