‘గోల్డ్ రిజర్వ్ ఫండ్’ను భారీగా పెంచనున్న ప్రభుత్వం
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుతుండటంతో కేంద్ర ప్రభుత్వంపై సార్వభౌమ గోల్డ్ బాండ్ (సావరిన్ గోల్డ్ బాండ్స్-SGB) రిడెంప్షన్ల భారం ఊహించని విధంగా పెరుగుతోంది. ఈ వ్యయాన్ని తట్టుకునేందుకు రానున్న బడ్జెట్‌లో ‘గోల్డ్ రిజర్వ్ ఫండ్’ కేటాయింపులను కేంద్రం భారీగా పెంచే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాల సమాచారం.
నిధుల కేటాయింపులో భారీ వ్యత్యాసం
గత కొన్నేళ్లుగా బడ్జెట్ అంచనాలకు, సవరించిన అంచనాలకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. గతేడాది బడ్జెట్ అంచనాల్లో కేవలం రూ.8,550 కోట్లు కేటాయించగా, రిడెంప్షన్ల ఒత్తిడి వల్ల సవరించిన అంచనాల్లో అది ఏకంగా రూ.28,000 కోట్లకు పైగా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025-26) కేవలం రూ.700 కోట్లే ప్రాథమికంగా కేటాయించినప్పటికీ వాస్తవ రిడెంప్షన్ల దృష్ట్యా దీన్ని భారీగా పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో 2026-27 బడ్జెట్ అంచనాల్లోనూ ఈ నిధికి సింహభాగం కేటాయించే దిశగా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది.
పెరుగుతున్న భారం
ఎస్‌జీబీ పెట్టుబడిదారులకు చెల్లింపులు చేసేందుకు ఈ నిధిని ఉపయోగిస్తారు. బాండ్లు జారీ చేసినప్పటి ధరతో పోలిస్తే ప్రస్తుత మార్కెట్ ధరలు 4 నుంచి 5 రెట్లు పెరగడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణం.
సార్వభౌమ గోల్డ్ బాండ్ (SGB) పథకంలో భాగంగా 2017-18 సిరీస్ కింద జారీ చేసిన బాండ్ల ధరలను పరిశీలిస్తే అప్పట్లో ఒక గ్రాము బంగారం ధర సుమారు రూ.2,881 నుంచి రూ.2,951 మధ్య ఉంది. అయితే, ఈ బాండ్లు మెచ్యూరిటీ సమయానికి బంగారం ధరలు గణనీయంగా పెరగడంతో పెట్టుబడిదారులు ఒక్కో గ్రాముపై రూ.9,486 నుంచి రూ.13,486 వరకు రిడెంప్షన్ ధరను పొందగలిగారు. అంటే జారీ చేసిన ధరతో పోలిస్తే సుమారు నాలుగు రెట్లు అధిక లాభం చేకూరింది.
ఇక 2018-19 సిరీస్ విషయానికి వస్తే ఇందులో ఐదో ట్రాంచ్ (5th Tranche) బాండ్లు ముందస్తు రిడెంప్షన్‌కు (Premature Redemption) అవకాశం లభించింది. ఈ క్రమంలో వీటిని ఒక్కో యూనిట్‌కు రూ.14,853 గరిష్ట ధర వద్ద రిడీమ్ చేయడం గమనార్హం. ఇది అప్పట్లో బాండ్లు కొనుగోలు చేసిన వారికి భారీ లాభాలను తెచ్చిపెట్టింది.
ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను గమనిస్తే బంగారం ధరలు మునుపెన్నడూ లేని విధంగా ప్రస్తుత ట్రెండ్ ప్రకారం గ్రాముకు రూ.16,000 మార్కును దాటి కొనసాగుతున్నాయి. ఈ అసాధారణ పెరుగుదల వల్ల రాబోయే కాలంలో రిడెంప్షన్ కావాల్సిన బాండ్ల కోసం ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులను వెచ్చించాల్సి ఉంటుందని స్పష్టమవుతోంది.
2026-27లో 2018-19 సిరీస్‌కు చెందిన 6 ట్రాంచ్‌లు తుది రిడెంప్షన్‌కు రానున్నాయి. అలాగే 2021-22 సిరీస్‌కు చెందిన 10 ట్రాంచ్‌లు ముందస్తు రిడెంప్షన్‌కు అర్హత సాధించనున్నాయి. ఇవన్నీ ప్రభుత్వ ఖజానాపై అదనపు భారాన్ని మోపనున్నాయి.
కొత్త బాండ్ల జారీకి బ్రేక్
భౌతిక బంగారం దిగుమతులను తగ్గించే లక్ష్యంతో 2015లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 146 టన్నులకు పైగా బంగారానికి సమానమైన పెట్టుబడులు వచ్చాయి. అయితే, ధరల పెరుగుదల వల్ల ప్రభుత్వానికి ఇది భారంగా మారింది. 2016 ఆర్థిక సంవత్సరం నుంచి 2024 వరకు మొత్తం 67 ట్రాంచ్‌లు జారీ అయ్యాయి. పెరుగుతున్న ఆర్థిక భారంతో 2024 తర్వాత ప్రభుత్వం కొత్త ట్రాంచ్‌లను జారీ చేయలేదు. భవిష్యత్తులోనూ కొత్త బాండ్లు వచ్చే అవకాశం లేదని స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి.
ధర నిర్ణయం ఇలా..
ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రచురించే 999 స్వచ్ఛత గల బంగారం ధరలను పరిగణనలోకి తీసుకుంటారు. రిడెంప్షన్ తేదీకి ముందున్న చివరి మూడు వ్యాపార దినాల సగటు ధర ఆధారంగా పెట్టుబడిదారులకు చెల్లింపులు చేస్తారు.
ఇదీ చదవండి: నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..


