2026–27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ సమీపిస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న తన తొమ్మిదవ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో, దేశ ఆర్థిక వృద్ధికి వెన్నెముకైన మౌలిక సదుపాయాల రంగం మరింత ప్రభుత్వ వ్యయం, విధాన మద్దతు, ప్రాజెక్టుల వేగవంతమైన అమలును ఆశిస్తోంది.
గత కొన్ని సంవత్సరాలుగా మూలధన వ్యయం గణనీయంగా పెరిగినప్పటికీ, భూసేకరణ, టెండరింగ్ విధానాలు, నియంత్రణ సంబంధిత సమస్యల కారణంగా అనేక పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆలస్యమవుతూ, ఖర్చులు పెరుగుతున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ సవాళ్లను అధిగమించేందుకు రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, పట్టణ మౌలిక సదుపాయాలు, ప్రధాన ప్రభుత్వ ఆస్తుల కోసం కేటాయింపులను కనీసం 10–15 శాతం వరకు పెంచాలని రంగం డిమాండ్ చేస్తోంది.
అదే విధంగా, కేవలం తక్కువ బిడ్ ఆధారిత టెండరింగ్ విధానాలపై ఆధారపడటాన్ని తగ్గించి, సాంకేతిక సామర్థ్యం, నాణ్యత ప్రమాణాలు, గత అమలు పనితీరుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని వాటాదారులు సూచిస్తున్నారు. ఇది ప్రాజెక్టులు సకాలంలో పూర్తవ్వడమే కాకుండా దీర్ఘకాలికంగా మెరుగైన ఆస్తి సృష్టికి దోహదపడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.
ప్రధాన మెట్రో నగరాలపై ఉన్న ఒత్తిడిని తగ్గించడంతో పాటు సమగ్ర ప్రాంతీయ అభివృద్ధికి ఊతమిచ్చేందుకు, టైర్-టూ, టైర్-త్రీ నగరాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టాలని పరిశ్రమ కోరుతోంది.
ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2026: ఆ పన్నులు తగ్గిస్తే మంచిది: ఎస్బీఐ
రాబోయే బడ్జెట్‌లో బలమైన ఆర్థిక మద్దతు, వేగవంతమైన అమలు విధానాలు మరియు సౌకర్యవంతమైన టెండరింగ్ నిబంధనలు మౌలిక సదుపాయాల ఆధారిత వృద్ధిని మరింత వేగవంతం చేసి, భారతదేశ దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలను బలోపేతం చేస్తాయని రంగ నిపుణులు విశ్వసిస్తున్నారు.
రూ.13 లక్షల కోట్లు కేటాయించాలి
మూలధన వ్యయానికి గత బడ్జెట్‌లో రూ.11.21 లక్షల కోట్లు కేటాయించారు. పట్టణాభివృద్ధికి తీసుకున్న చర్యలు ఈ రంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. హైదరాబాద్‌లో అమలవుతున్న మా రూ.215 కోట్ల మురుగునీటి ప్రాజెక్టులే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. రానున్న 2026 బడ్జెట్‌లోనూ నీటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి అవసరం. నమామి గంగే పథకం కింద 7,000 ఎంఎల్‌డీ మురుగునీటి శుద్ధి సామర్థ్యం కోసం పీపీపీ ప్రాజెక్టులకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, పట్టణ ప్రాంతాల్లో సర్క్యులర్ వాటర్ రీయూజ్ వంటి చర్యలు కీలకం. ఈ నేపథ్యంలో రూ.12–13 లక్షల కోట్ల స్థిరమైన మూలధన వ్యయాన్ని మౌలిక రంగం అంచనా వేస్తోంది.
– సునీల్ ఎస్. నాయర్, సీఈఓ, రామ్‌కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్


