ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి తన ప్లాట్‌ఫాంలలో కొత్త చెల్లింపు సబ్‌స్క్రిప్షన్లను ప్రవేశపెట్టేందుకు మెటా సిద్ధమవుతోంది. యాప్‌ల ప్రాథమిక వెర్షన్లు ఉచితంగానే కొనసాగుతాయి. అయితే ఉత్పాదకత, సృజనాత్మకత, ఆధునిక ఏఐ (AI) టూల్స్‌తో వచ్చే అదనపు ఫీచర్ల కోసం ప్రీమియం ప్లాన్‌లను పరీక్షించనున్నట్లు మెటా టెక్‌క్రంచ్‌కు ధ్రువీకరించింది.
మెటా ప్రకారం.. ప్రతి యాప్‌కు దాని ప్రత్యేక ప్రయోజనాలకు అనుగుణంగా వేర్వేరు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు ఉంటాయి. ఒకే స్థిరమైన ప్లాన్‌కు బదులుగా, వివిధ ఫీచర్ బండిల్స్‌ను ప్రయోగాత్మకంగా అందించి, వినియోగదారులకు ఏవి ఉపయోగకరంగా ఉంటాయో తెలుసుకోవాలని కంపెనీ భావిస్తోంది.
ఈ సబ్‌స్క్రిప్షన్‌లలో ప్రధానంగా ఏఐ ఫీచర్లు ఉండనున్నాయి. మెటా ఇటీవల సుమారు 2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన ‘మానస్’ ఏఐ ఏజెంట్‌ను విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావాలని యోచిస్తోంది. మానస్‌ను మెటా యాప్‌లలోనే భాగంగా చేర్చడమే కాకుండా, వ్యాపారాల కోసం ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్‌గా కూడా అందించనుంది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో మానస్ ఏఐ షార్ట్‌కట్‌ను జోడించే పనిలో మెటా ఉంది.
అలాగే, అధునాతన ఏఐ ఫీచర్లకు ఛార్జీలు వసూలు చేయాలని కూడా మెటా భావిస్తోంది. ఉదాహరణకు, ‘వైబ్స్’ అనే ఏఐ ఆధారిత షార్ట్-ఫార్మ్ వీడియో టూల్. దీంట్లో ఏఐని ఉపయోగించి వీడియోలను సృష్టించడం, రీమిక్స్ చేయడం వంటివి చేయొచ్చు. ఇప్పటివరకు ఉచితంగా ఉన్న ఈ ఫీచర్‌ను ఫ్రీమియం మోడల్‌కు మార్చే యోచనలో మెటా ఉంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్‌స్క్రిప్షన్ తీసుకునే వినియోగదారులకు అపరిమిత ఆడియన్స్ లిస్టులు సృష్టించే అవకాశం, ఎవరు తిరిగి ఫాలో చేయడం లేదో తెలుసుకునే ఫీచర్, స్టోరీలను అనామకంగా వీక్షించే సౌకర్యం (పోస్టర్‌కు తెలియకుండా) వంటి అదనపు ఫీచర్లు అందుబాటులోకి రావొచ్చు.
కాగా ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్‌లు, మెటా వెరిఫైడ్ వేరువేరు. మెటా వెరిఫైడ్ ప్రధానంగా క్రియేటర్లు, బిజినెస్ అకౌంట్ల కోసం రూపొందించినది. ఇందులో వెరిఫైడ్ బ్యాడ్జ్, డైరెక్ట్ సపోర్ట్, ఇంపర్సనేషన్ ప్రొటెక్షన్ వంటి ప్రయోజనాలు ఉంటాయి. రాబోయే కొత్త సబ్‌స్క్రిప్షన్‌లు మాత్రం సాధారణ రోజువారీ యాజర్ల కోసం తీసుకొస్తున్నవి.


