నేడు పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే 2025-26 విడుదల | Economic Survey 2026 tabled in Parliament today | Sakshi
Sakshi News home page

నేడు పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే 2025-26 విడుదల

Jan 29 2026 10:58 AM | Updated on Jan 29 2026 11:09 AM

Economic Survey 2026 tabled in Parliament today

దేశ ఆర్థిక వ్యవస్థ గమనానికి దిక్సూచిగా భావించే ఆర్థిక సర్వే (Economic Survey) 2025-26ను కేంద్ర ప్రభుత్వం నేడు (గురువారం, జనవరి 29, 2026) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. కేంద్ర బడ్జెట్ కంటే ముందు వెలువడే ఈ కీలక పత్రం గత ఆర్థిక సంవత్సరంలో దేశం సాధించిన ప్రగతిని, రాబోయే సవాళ్లను విశ్లేషిస్తుంది.

ప్రధాన అంశాలు..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ సర్వేను సమర్పించనున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA) వి.అనంత నాగేశ్వరన్ విలేకరుల సమావేశంలో పాల్గొని దేశ ఆర్థిక పోకడలపై సమగ్ర వివరణ ఇవ్వనున్నారు.

జనవరి 28న ప్రారంభమైన ఈ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 2, 2026 వరకు కొనసాగుతాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి పార్లమెంట్‌లో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

ఆర్థిక వృద్ధి అంచనాలు

భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి దూసుకుపోతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను దేశం 7.4 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని అంచనా. ఇది గతంలో ఊహించిన 6.3 - 6.8 శాతం కంటే మెరుగ్గా ఉండటం విశేషం. పటిష్టమైన దేశీయ వినియోగం, తయారీ రంగంలో వృద్ధి దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

బడ్జెట్‌ ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలి?

ఆన్‌లైన్‌లో indiabudget.gov.in(https://www.indiabudget.gov.in) అధికారిక వెబ్‌సైట్‌, సాక్షి.కామ్‌లోని లైప్‌ అప్‌డేట్ల ద్వారా బడ్జెట్‌ వివరాలు తెలుసుకోవచ్చు. దీంతోపాటు సోషల్ మీడియాలో ఆర్థిక మంత్రిత్వ శాఖ, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) అధికారిక పేజీలతోపాటు ఫేస్‌బుక్‌లోకి ‘సాక్షి’ పేజీని ఫాలో అయి తెలుసుకోవచ్చు.

ఇదీ చదవండి: గోల్డ్‌ ధర.. గుండె దడ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement