ఈయూ ఒప్పదంతో లక్ష్యాలు సాకారం: ప్రధాని మోదీ | FTA with EU is for ambitious India PM Modi | Sakshi
Sakshi News home page

ఈయూ ఒప్పదంతో లక్ష్యాలు సాకారం: ప్రధాని మోదీ

Jan 29 2026 10:58 AM | Updated on Jan 29 2026 11:42 AM

FTA with EU is for ambitious India PM Modi

న్యూఢిల్లీ: భారతదేశం ప్రపంచ వేదికపై తనదైన ముద్రను మరింత బలోపేతం చేసుకుంటోంది. ఐరోపా సమాఖ్య (ఈయూ)తో కుదుర్చుకోబోయే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎప్‌టీఏ)కేవలం ఒక ఒప్పందం మాత్రమే కాదని, ఇది నవ భారతపు ప్రతిష్టాత్మక లక్ష్యాలకు నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గురువారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా ప్రధాని.. కొత్తగా తెరుచుకుంటున్న అంతర్జాతీయ మార్కెట్లను అందిపుచ్చుకోవాలని దేశీయ తయారీదారులకు పిలుపునిచ్చారు. మంగళవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేసిన ప్రసంగంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. అది కేవలం అధికారిక ప్రసంగం మాత్రమే కాదని, 140 కోట్ల భారతీయుల నమ్మకానికి,  సామర్థ్యానికి ముఖ్యంగా యువత ఆకాంక్షలకు అద్దం పడుతోందని అన్నారు. దేశ భవిష్యత్తుపై రాష్ట్రపతి  గీసిన ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్  మాదిరిగా ఆ ప్రసంగం ఉందని మోదీ అభివర్ణించారు.

బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటు సభ్యులకు (ఎంపీలు) రాష్ట్రపతి చేసిన సూచనలను ప్రధాని గుర్తు చేశారు. 2026 కొత్త ఏడాది ఆరంభంలో పార్లమెంటు సభ్యులంతా అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులంతా రాష్ట్రపతి వెలిబుచ్చిన అంచనాలను దృష్టిలో ఉంచుకుని, సభా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ, అర్థవంతమైన చర్చల్లో పాల్గొంటారని తాను నమ్ముతున్నట్లు ప్రధాని పేర్కొన్నారు.

మారుతున్న ప్రపంచ ఆర్థిక పరిణామాల నేపథ్యంలో భారత తయారీదారులు అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో పోటీ పడాలని ప్రధాని సూచించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా లభించే అవకాశాలను వినియోగించుకుని, భారత్‌లో తయారైన ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లను ఏలాలని ఆయన ఆకాంక్షించారు. ఈ బడ్జెట్ సమావేశాల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేసే కీలక నిర్ణయాలు వెలువడనున్నాయని మోదీ తెలిపారు. 

రాష్ట్రపతి ప్రసంగం 140 కోట్ల భారతీయుల ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 21వ శతాబ్దం రెండో క్వార్టర్‌కు తొలి బడ్జెట్  ఇది ఒక చారిత్రక ఘట్టమని, అలాగే 2047 ‘వికసిత భారత్’ లక్ష్యానికి కీలకమైన 25 ఏళ్ల ప్రారంభమన్నారు. వరుసగా 9వసారి మహిళగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారని అన్నారు. భారత్ నేడు ప్రపంచానికి ఆశాకిరణంగా, ఆకర్షణ కేంద్రంగా ఉందని, భారత్–ఈయూ ఫ్రీ ట్రేడ్ ఒప్పందం యువతకు, పరిశ్రమలకు పెద్ద అవకాశమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

దేశీయ తయారీదారులు నాణ్యతపై దృష్టి పెట్టాలని, 27 ఈయూ దేశాల మార్కెట్లు భారత్‌కు పూర్తిగా తలుపులు తెరుచుకున్నాయని ప్రధాని తెలిపారు. రైతులు, మత్స్యకారులు, సేవారంగానికి ఫ్రీ ట్రేడ్‌తో లాభాలు ఉంటాయన్నారు. రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్’ మార్గంలో ప్రభుత్వం పయనిస్తోందని, పూర్తి వేగంతో ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ సాగుతోందన్నారు. దీర్ఘకాలిక సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారాల దిశగా భారత్ ముందుకు సాగుతోందని, హ్యూమన్ సెంట్రిక్ అభివృద్ధే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. లాస్ట్ మైల్ డెలివరీపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఇది అడ్డంకుల కాలం కాదని, పరిష్కారాల కాలమని ప్రధాని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement