విశ్లేషణ
మన దేశం స్వాతంత్య్రం సంపాదించు కున్న కొత్తలో ముఖ్యమైన విధానపరమైన డాక్యుమెంట్లు ఏవైనా ఉన్నాయీ అంటే అవి ప్రణాళికా సంఘం ప్రచురించిన పంచవర్ష ప్రణాళికలే! ప్రణాళికా సంఘం ప్రాధాన్యం కోల్పోయి, ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రాభవం పెరిగిన తర్వాత, బడ్జెట్‌కు ముందు ఆర్థిక శాఖ సమర్పించే ఆర్థిక సర్వే క్రమేపీ ఎక్కువ మందిని ఆకర్షించడం మొదలైంది. ఈ సర్వే కొన్నేళ్ళుగా పెక్కు ఉపయోగకరమైన విధానపరమైన ఐడియాలను, ఆలోచనలను రేకెత్తించే అంశాలను మన ముందు ఉంచుతూ వస్తోంది.
ఉదాహరణకు, చైనాపై వాణిజ్య, పెట్టుబడులపరమైన ఆంక్షలను విధించడంలోని ఔచిత్యాన్ని 2023–24 ఆర్థిక సర్వే ప్రశ్నించింది. అప్పటికి భారత్–చైనా సంబంధాలు కదలని స్థితిలోనే ఉన్నాయి. చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకునే బదులు భారత దేశంలో వస్తూత్పత్తి చేసేందుకు చైనా సంస్థలకు అనుమతించడం మెరుగైన ఆలోచన అనిపించుకోవచ్చని సర్వే వాదించింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ మొదట్లో ఆ ఆలోచనను తోసిపుచ్చినా, అది పునః పరిశీలించదగ్గ ప్రతిపాదనేనని ఆ తర్వాత అంగీకరించింది.
సంక్షేమ పథకాల ఫలాలు అందవలసిన వారికి అందడం లేదనీ, వాటిలో లొసుగులు ఉన్నాయనీ గతంలో ఆర్థిక సర్వేలు ఎత్తి చూపాయి. లబ్ధిదారులకు నేరుగా నగదు బదలీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పాయి. ఈ ప్రతిపాదన 2009–10, 2010–11 సంవత్సరాల సర్వేలలో మొదట చోటుచేసుకుంది. దానిపై అప్పట్లో మొదట్లో పెద్ద దుమారమే రేగింది. కానీ, అప్పటి నుంచి రైతులు, మహిళలు, ఇతర ఉద్దేశిత లబ్ధిదారుల ఖాతాలలోకి నేరుగా నగదు బదలీ చేయడం సంప్రదాయసిద్ధమైన విధాన సాధనాలలో అంత ర్భాగంగా మారింది.
మరింత ఉపయోగపడేలా...
ఆర్థిక సర్వే కొత్త ఆలోచనలను అందించి, ఎక్కడెక్కడ దిద్దు బాటు చర్యలు అవసరమో సూచించగలదు. కానీ, సర్వేలో పది సూచనలు ఉంటే, ఏదో ఒక దానిపై చర్చించి, అమలులోకి తెస్తు న్నారు. మిగిలిన తొమ్మిదింటిని గాలికి వదిలేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే, సర్వేలో చూపే టేబుల్స్, ఛార్టులలో గాఢత లోపిస్తోంది. మరి పౌరులు, సంస్థలు, ఇన్వెస్టర్లు, ప్రజా సేవకులకు మరింత ఉప యోగకరమైనవిగా ఆర్థిక సర్వేలు ఉండేటట్లు చేయడం ఎలా?
మొదట... వాటిని ప్రాధాన్యం కలిగినవిగా మార్చాలి. తదుపరి ఆర్థిక సంవత్సరంలో ప్రపంచంలో రూపుదిద్దుకోగలిగిన వివిధ సందర్భాలను సర్వే స్థూలంగా వివరించగలగాలి. ఆ యా సందర్భా లలో వివిధ మంత్రిత్వ శాఖలు, రెగ్యులేటరీ ఏజన్సీలు విధాన పరంగా ఏ రకంగా స్పందిస్తే బాగుంటుందో కూడా సూచించాలి. అటువంటి పరిణామాల విశ్లేషణ చిన్న వ్యాపార సంస్థలు రానున్న నెలలకు సంబంధించి అత్యవసర ప్రణాళికలు తయారు చేసుకునేందుకు సహాయపడుతుంది.
బాహ్య వాతావరణం మార గానే, దానికి తగ్గట్లుగా విధానపరంగా చకచకా మార్పులతో స్పందించేందుకు ప్రభుత్వానికి వీలుంటుంది. రకరకాల ప్రత్యామ్నా యాలను లెక్కలోకి తీసుకుంటూ స్వల్ప, మధ్యకాలిక అంచనాలకు రావడంలో నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్‌తో కలసి ఆర్థిక మంత్రిత్వ శాఖ పనిచేయవచ్చు. ఈ అంచనాలను బట్టి ఎటువంటి పరిస్థితులు తలెత్తగలవో ప్రణాళిక వేసుకోవచ్చు. ఆర్థిక మంత్రిత్వ శాఖ వెబ్ సైట్‌లో ప్రతి 3 నెలలకోసారి ఈ అంచనాలను అప్డేట్ చేయవచ్చు.
ఏం చేయాలి?
ఒకటి – చాలా భాగం భారతీయ వ్యాపార సంస్థలు సొంత ఆర్థిక, భౌగోళిక రాజకీయ సలహాదారులను నియమించుకోగలిగిన స్థోమత ఉన్నవి కావు. కీలక ఆర్థిక ప్రశ్నలపై మార్గదర్శనం చేయడం ద్వారా సర్వే బృందం ఆ లోటును భర్తీ చేయవచ్చు. రెండు – సర్వే చాట భారతంలా కాకుండా వీలైనంత సంక్షిప్తంగా ఉండాలి. అది భారతీయ ఆర్థిక వ్యవస్థపై ఇయర్ బుక్‌లా కాకుండా ముఖ్యమైన ఆర్థిక సవాళ్ళపై దృష్టి కేంద్రీకరించిన సంగ్రహ డాక్యుమెంట్‌గా ఉండాలి. అప్పుడే అది నిజంగా ఉపయోగ పడుతుంది. నిర్ణయాలు తీసుకునేవారిలో చాలా మందికి సుదీర్ఘ పాఠాలను చదివేంత తీరిక ఉండదు.
మూడు– ఆర్థిక సర్వే అందరి భాగస్వామ్యంతో రూపొంది నదిగా ఉండటం సముచితం. వివిధ ఆర్థిక మంత్రిత్వ శాఖలు,రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న అత్యంత ముఖ్యమైన సమస్య లపై సర్వే బృందం ఇన్‌పుట్స్ సేకరించాలి. ఆ యా అంశాలపై ఆలోచించదగ్గ విధాన ప్రతిపాదనలు చేసిన వారికి విధాన నోట్సును తయారు చేసేందుకు స్వల్పకాలిక గ్రాంటులు మంజూరు చేయవచ్చు. ఆ సమావేశాల్లో పాల్గొనేవారు అకడమిక్ పరిశోధకులు, పాలసీ ప్రాక్టీషనర్లు ఇద్దరి మాటలను వినేవారుగా ఉండాలి. ఎటొచ్చీ వయసు విషయంలో కొన్ని పరిమితులు పెట్టుకోవడం వాంఛ నీయం. విధాన నిర్ణయ ప్రక్రియలో యువత పాలుపంచుకోవడాన్ని ప్రోత్సహించినట్లు అవుతుంది. బహిరంగ పోటీ వల్ల తుది ఎంపిక లను సీరియస్‌గా తీసుకోగల అవకాశం ఉంటుంది.
హ్యాకథాన్ అవసరం
ఎవరో తెలివైన కొద్దిమంది పురుషులు, మహిళలతో భారత దేశ ఆర్థిక వ్యవస్థ లాంటి సంక్లిష్టమైన ఆర్థిక వ్యవస్థను నిర్వహించడం కష్టం. చాలామంది విధాన నిర్ణేతలు తాత్కాలిక ప్రాతి పదికపై బయటవారి సలహాలు తీసుకునేందుకు మొగ్గు చూపుతూంటారు. కానీ, దీనికి ఒక విధానపరమైన బృందం అవసరం. ఆబృందాన్ని నేటి కంప్యూటర్ పరిభాషలో హ్యాకథాన్ అందాం. విద్యా వేత్తలు, విధానపరమైన పరిశోధకుల నుంచి సమాచారాన్ని సేకరించి క్రోడీకరించే సంస్థాగత వేదికగా అది పని చేస్తుంది.
నూతన విధాన పరిష్కారాలను ప్రతిపాదించేవారు సంకుచిత ప్రయోజనాల నిమిత్తం ఆ పని చేయడం లేదనీ, వారు పోటీతో కూడిన ప్రక్రియ ద్వారా ఎంపికై వచ్చినవారనీ విధాన నిర్ణేతలకు తెలిస్తే, వారు ఆ పరిష్కారాలను సానుకూలంగా పరిశీలించే అవ కాశం ఎక్కువ. హ్యాకథాన్ సూచించిన కొన్ని పరిష్కారాలు నేడు పూర్తిగా ఆచరణ సాధ్యమైనవి కాకపోయినప్పటికీ, అవి రేపటికైనా ఉపయోగపడేవిగా ఉంటాయి. నేటి యువ హ్యాకథాన్ విజేత రేపటి సీనియర్ విధానపరమైన నిర్ణేతగా పరిణమించనూ వచ్చు.
ప్రమిత్ భట్టాచార్య
వ్యాసకర్త ‘డేటా ఫర్ ఇండియా’ రిసెర్చ్ హెడ్; ‘న్యూ
ఇండియా ఫౌండేషన్’ ఫెలో (‘ద హిందూస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)


