బెంగళూరు: రాష్ట్రంలో ప్రైవేటు బస్సులు ఏ క్షణంలో ప్రమాదానికి గురవుతాయోనని జనం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోంది. తాజాగా కర్ణాటక శివమొగ్గ సమీపంలో ఓ ప్రైవేటు బస్సు అగ్నికి ఆహుతి అయ్యింది.
హోసనగర నుంచి బెంగళూరుకు వెళుతున్న ప్రైవేటు బస్సు అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన హోసనగర తాలూకా రిప్పన్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో అరసాళు–సూడురు గ్రామాల మధ్య జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. పది మందికి గాయాలు కావడంతో శివమొగ్గ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పొగ.. మంటలు
అన్నపూర్ణేశ్వరి ప్రైవేటు స్లీపర్ బస్సు హోసనగర నుంచి బెంగళూరుకు బయలుదేరింది. ఈ క్రమంలో బస్సులో హఠాత్తుగా పొగలు వచ్చి మంటలు రేగాయి. దీంతో ఆందోళన చెందిన ప్రయాణికులు హాహాకారాలు చేశారు. బస్సు డ్రైవర్ రోడ్డు పక్కన చెట్టును ఢీ కొట్టించి బస్సును నిలిపాడు. బస్సు అత్యవసర తలుపు, కిటికీల ద్వారా ప్రయాణికులు బయటకు దూకారు. క్షణాల్లోనే మంటలు వేగంగా వ్యాపించాయి.

ఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. బస్సులోని ఇద్దరు డ్రైవర్లకు కూడా స్వల్ప గాయాలు తగిలాయి, పోలీసులు వారిని ఘటనపై విచారిస్తున్నారు. రవాణా, ఫైర్ అధికారులు ఘటనాస్థలిని పరిశీలించారు.


