నట్టింట నలుగురి ప్రాణాలు బలిగొన్న బైక్‌ | 4 dead in bike incident in Punganur Annamaiya District | Sakshi
Sakshi News home page

నట్టింట నలుగురి ప్రాణాలు బలిగొన్న బైక్‌

Mar 16 2026 5:18 AM | Updated on Mar 16 2026 5:18 AM

4 dead in bike incident in Punganur Annamaiya District

మరమ్మతు అనంతరం రాత్రంతా ఆన్‌లో ఉంచిన యజమాని 

బయట పెడితే దొంగలు ఎత్తుకెళతారని ఇంటి హాల్‌లో పెట్టిన వైనం 

అర్ధరాత్రి వెలువడిన కార్బన్‌ మోనాక్సైడ్‌ పీల్చి వృద్ధుడు సహా ముగ్గురు పిల్లలు నిద్రలోనే మృతి 

అన్నమయ్య జిల్లా పుంగనూరులో విషాదం

పుంగనూరు : ద్విచక్ర వాహనం నుంచి వెలువడిన కార్బన్‌ మోనాక్సైడ్‌ వాయువులు పీల్చి, నిద్రలోనే నలుగురు మృతి చెందిన ఘటన అన్నమయ్య జిల్లా పుంగనూరులో కలకలం రేపింది. పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉంటున్న మురళి, రేవతి దంపతులకు కార్తీక్‌ (15), సుమబిందు (14), చందన (7), చరిత (7) అనే నలుగురు పిల్లలున్నారు. మురళి తండ్రి రామచంద్ర కూడా వీరితో కలిసే ఉంటారు. ఈ క్రమంలో మురళికి చెందిన బజాజ్‌ సీటీ–100 ద్విచక్ర వాహనం మరమ్మతుకు గురైంది. మెకానిక్‌ వద్ద ఇంజిన్‌ బోరు చేయించాడు. 

మెకానిక్‌ సూచన మేరకు శనివారం రాత్రంతా బండిని స్టార్ట్‌ చేసి పెట్టాడు. అయితే బండి ఆన్‌లో ఉన్నందున ఎవరైనా తీసుకెళ్తారనే భయంతో ఏకంగా ఇంటి హాలులో ఉంచాడు. రాత్రి భోజనం చేశాక మురళి దంపతులు మిద్దెపైన రూములో నిద్రకు ఉపక్రమించారు. సుమబిందు బంధువుల ఇంటికి వెళ్లగా.. కింద ఇంట్లో తండ్రి రామచంద్ర (75), కుమారుడు కార్తీక్, కవల పిల్లలు చరిత, చందన తలుపులు వేసుకుని పడుకున్నారు. రాత్రి వారు ఆ బైక్‌ నుంచి వెలువడిన విష వాయువు (కార్బన్‌ మోనాక్సైడ్‌)ను పీల్చి నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు.

ఉదయం మురళి, రేవతి కిందకు వచ్చి చూస్తే నలుగురూ అచేతనంగా పడి ఉన్నారు. తొలుత ఏం జరిగిందో తెలియక గట్టిగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి పరిశీలించి, నలుగురు మృతి చెందినట్లు గుర్తించారు. బైక్‌కు బోర్‌ చేసిన తర్వాత ఇంజిన్‌ స్మూత్‌గా మారే సమయంలో విష వాయువులు వెలువడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడో అర్ధరాత్రి విష వాయువు వెలువడి ఉంటుందని, వారు నిద్రలో ఉన్నందున దాన్ని గుర్తించేలోపే అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెంది ఉంటారని వైద్యులు చెబుతున్నారు. 

సీఐ సుబ్బరాయుడు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. మాజీ మంత్రి, సీనియర్‌ నేత డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి.. మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషాకు ఫోన్‌ చేసి ఘటనా స్థలానికి పంపారు. మృతుల కుటుంబాలను పరామర్శించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 

తాతవద్దే పడుకుంటామంటూ తనువు చాలించారు 
‘అమ్మా.. నాయనా.. మేము తాత కాడే పడుకుంటాం.. మీరు మిద్దెపైన పడుకోండి..’ అని శనివారం రాత్రి కన్నబిడ్డలు మాట్లాడిన మాటలను తలుచుకుంటూ ఆ తల్లిదండ్రులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. తాత కూలి పనులు చేస్తూ, తండ్రి కులవృత్తి (సెలూన్‌ షాపు) చేస్తూ   సంతోషంగా ఉండేవారు. అందరూ కలిసి మెలసి ఉంటున్న తమలో నలుగురిని తమ సొంత ద్విచక్ర వాహనమే కబళించేస్తుందని మురళి, రేవతి దంపతులు ఊహించలేకపోయారు. 

వాహనాన్ని ఆన్‌ చేసి ఇంటి ముందు పెడితే దొంగల బెడదతో పాటు ఇరుగు పొరుగు వారు శబ్దానికి ఇబ్బందులు పడతారని భావించి ఇంటి లోపల హాల్‌లో ఉంచడమే తన కొంప ముంచిందని మురళి గుండెలవిసేలా విలపించాడు. హాలులో కిటికీ లేకపోవడంతో బైక్‌ నుంచి వెలువడిన విష వాయువు త్వరగా బయటకు వెళ్లే మార్గం లేకే ఈ దారుణం చోటు చేసుకుందని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement