కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపట్లో పార్లమెంట్‌లో తన తొమ్మిదో బడ్జెట్‌ను (2026-27) ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆమె ధరించిన ‘కాంజీవరం చీర’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒకవైపు ఆర్థిక లెక్కలు, మరోవైపు రాజకీయ సమీకరణాల నడుమ ఈ చీర ప్రత్యేక చర్చకు దారితీసింది. తమిళనాడుకు చెందిన కాంజీవరం పట్టు చీరను ధరించడం ద్వారా ఆ రాష్ట్ర సంస్కృతిని చాటిచెప్పిటన్లవుతుందని కొందరు భావిస్తున్నారు. ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి ప్రజలను ఆకట్టుకోవడానికి, ఆ రాష్ట్రంపై కేంద్రానికి ఉన్న గౌరవాన్ని చాటడానికి ఇదొక సంకేతంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాంజీవరం చీర ప్రత్యేకతలు..
కాంజీవరం చీరలను దక్షిణ భారతదేశం నుంచి సేకరించిన స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో తయారు చేస్తారు. ఇందులో వాడే జరిలో వెండి తీగపై బంగారు పూత ఉంటుంది. దీనివల్ల చీర చాలా కాలం పాటు మెరుస్తూ ఉంటుంది. ఇందులో చీర, అంచు విడివిడిగా నేస్తారు. తర్వాత చాలా బలంగా వాటిని ‘కోర్వాయ్’ పద్ధతిలో జత చేస్తారు. ఒకవేళ చీర చిరిగినా అంచు మాత్రం చీర నుంచి విడిపోకుండా జాగ్రత్తపడుతారు.
మూడు దారాల కలయిక
సాధారణ పట్టు చీరల కంటే ఇవి కొంచెం బరువుగా ఉంటాయి. ఎందుకంటే ఇందులో మూడు పట్టు దారాలను కలిపి నేస్తారు. దీనివల్ల చీర చాలా మన్నికగా, దృఢంగా ఉంటుంది.
ఇదీ చదవండి: Budget 2026: కేంద్ర బడ్జెట్‌కు వేళాయె..


