Union Budget 2026
2019 నుంచి 2025 వరకు: 8 బడ్జెట్లు.. 13 గంటలు!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. భారతదేశ బడ్జెట్ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖిస్తున్నారు. ఆదివారం, ఫిబ్రవరి 1న ఆమె యూనియన్ బడ్జెట్ 2026ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమె వరుసగా ప్రవేశపెడుతున్న 9వ కేంద్ర బడ్జెట్ కావడం విశేషం. ఇప్పటికే ఎనిమిది బడ్జెట్లను విజయవంతంగా ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ అరుదైన రికార్డు సృష్టించారు. అయితే ప్రారంభం నుంచి ఏ బడ్జెట్ ప్రసంగం ఎంత సమయం?, సుదీర్ఘ ప్రసంగం ఎప్పుడు అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.2019లో కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసే కీలక బడ్జెట్లను నిర్మలా సీతారామన్ అందించారు. కరోనా వంటి అసాధారణ పరిస్థితుల్లో కూడా.. ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్లు చరిత్రలో నిలిచిపోయాయి. ముఖ్యంగా 2020లో ఆమె చేసిన బడ్జెట్ ప్రసంగం సుమారు 2 గంటలు 42 నిమిషాలు కొనసాగి, భారత పార్లమెంట్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగంగా గుర్తింపు పొందింది.కాలక్రమంలో నిర్మలా సీతారామన్ ప్రసంగ శైలిలో మార్పు కనిపించింది. ప్రారంభంలో సుధీర్ఘంగా సాగిన బడ్జెట్ ప్రసంగాలు, తరువాతి సంవత్సరాల్లో.. క్రమంగా సంక్షిప్తంగా మారాయి. 2024 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం 56 నిమిషాల్లో (గంట లోపు) పూర్తయింది. ఇది ఇప్పటివరకు ఆమె చేసిన అత్యంత చిన్న ప్రసంగంగా నిలిచింది. అలాగే 2025 బడ్జెట్ ప్రసంగం కూడా తక్కువ సమయం (74 నిమిషాలు)లోనే పూర్తి కావడం విశేషం.బడ్జెట్ - ప్రసంగ సమయం➤2019 బడ్జెట్: 140 నిమిషాలు (2 గంటల 20 నిమిషాలు)➤2020 బడ్జెట్: 160 నిమిషాలు (2 గంటల 40 నిమిషాలు - అతిపెద్ద బడ్జెట్ ప్రసంగం)➤2021 బడ్జెట్: 100 నిమిషాలు (1 గంట 40 నిమిషాలు)➤2022 బడ్జెట్: 91 నిమిషాలు (1 గంట 31 నిమిషాలు)➤2023 బడ్జెట్: 87 నిమిషాలు (1 గంట 27 నిమిషాలు)➤2024 ఫిబ్రవరి బడ్జెట్: 56 నిమిషాలు➤2024 జులై బడ్జెట్: 85 నిమిషాలు (1 గంట 25 నిమిషాలు)➤2025 బడ్జెట్: 74 నిమిషాలు (1 గంట 14 నిమిషాలు) మొత్తం 8 బడ్జెట్లు.. 793 నిమిషాలు / 13 గంటల 13 నిమిషాలుఇక 9వ బడ్జెట్‌తో ఆమె మరోసారి చరిత్ర సృష్టించబోతున్నారు. ఈ బడ్జెట్ ప్రసంగం ఎంత సమయం సాగుతుంది, ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు అనే ఆసక్తి దేశవ్యాప్తంగా నెలకొంది. 2026 బడ్జెట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.
సామాజిక, ఆర్థిక అవగాహనతోనే వృద్ధికి బూస్ట్!
ప్రపంచం మొత్తమ్మీద అతివేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి. అయితే దేశీ వార్షిక వృద్ధి రేటు ఏడు శాతం కంటే ఎక్కువగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ ద్రవ్యలోటును తగ్గించుకోవడంతోపాటు రుణ భారాన్ని కూడా తగ్గించుకోవాలి. దీని ద్వారా ద్రవ్యపరమైన స్థిరీకరణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.మరోవైపు రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలి కాలంలో చేపట్టిన చర్యలను పరిశీలిస్తే.. విధానపరమైన రేట్లను తగ్గించే దిశగా అడుగులేస్తున్నట్లు స్పష్టమవుతుంది. తద్వారా వృద్ధికి తోడ్పాటు అందించాలని వ్యాపారాలు, కుటుంబాలపై ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేస్తోంది. ఇదే సమయంలో రాజకీయ, ఆర్థికవేత్తల అభిప్రాయం కొంచెం భిన్నంగా కనిపిస్తోంది. కార్మిక, వ్యవసాయ చట్టాల సవరణ, రైల్వే, రహదారులపై భారీ పెట్టుబడులు, ఆర్థిక ప్రోత్సాహకాలు, తక్కువ పన్నుల రూపంలో ప్రభుత్వం ఇప్పటికే వృద్ధికి అవసరమైన వాతావరణం కల్పించిందని, ఇప్పుడు ప్రైవేట్ రంగం దేశీ అభివృద్ధిపై పెట్టుబడులు పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తోంది.అంతేకాదు.. యూరోపియన్ యూనియన్‌తో ఇటీవల కుదుర్చుకున్న ఫ్రీ ట్రేడ్ ఒప్పందం కూడా అమెరికా వాణిజ్య విధానాలు, అంతర్జాతీయ జియోపాలిటిక్స్ ద్వారా ఏర్పడుతున్న అనిశ్చితులను అధిగమించేందుకు ఉపయోగపడుతుందని అంచనా వేస్తోంది. ఇవన్నీ నాణేనికి ఒక వైపు అయితే.. వాస్తవం మరింత సంక్లిష్టంగా ఉంది.సామాజిక ఆర్థిక పరిస్థితులుభారత్ కచ్చితంగా చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థ కానీ.. తలసరి ఆదాయం మూడు వేల డాలర్ల కంటే తక్కువ. చైనాసహా ఇతర ధనిక దేశాల తలసరి ఆదాయాలు మనకు నాలుగు రెట్లు ఎక్కువ.దేశంలో యాభై శాతం జనాభాకు రేషన్ బియ్యం కావాలని ప్రభుత్వం విశ్వసిస్తోంది. అలాగే దిగువ, మధ్య తరగతి వర్గాల వారు మరిన్ని కొనుగోళ్లు చేసేలా చేసే లక్ష్యంతో ప్రభుత్వం జీఎస్టీ రేట్లను తగ్గించింది కూడా.నిరుద్యోగం, తగినన్ని అవకాశాలు లేకపోవడం ఇప్పటికీ దేశంలో అధికంగా ఉంది. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం చాలా తక్కువగా ఉంది.పోషకాహార లోపం సమస్యను ఇప్పటివరకూ పరిష్కరించలేకపోయారు. అలాగే ఆరోగ్య సంరక్షణకు తగిన మౌలిక సదుపాయాలు లేవు.మూలధన, శ్రామిక ఉత్పాదకత కూడా ఇతర దేశాలతో పోలిస్తే తక్కువగానే ఉంది. ఇది ఇటీవలి కాలంలో వేగంగా తగ్గిపోతోంది.రూపాయి బలహీనపడిపోవడం, విదేశీ పెట్టుబడిదారులు భారతీయ మార్కెట్ల నుంచి వేగంగా వైదొలగుతూండటం కూడా ఏమంత మంచి పరిణామాలు కావు. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు భారీగా ఉన్నప్పటికీ విదేశీ రుణభారం తగ్గకపోవడాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి.చాలాకాలంగా దేశీ ఎగుమతుల్లో పెరుగుదల లేకుండాపోయింది. పైగా చైనా ఉత్పత్తులపై ఆధారపడటం ఏటికేటా పెరిగిపోతోంది.బ్యాంకింగ్ వ్యవస్థలో రిస్క్ క్యాపిటల్ తగినంత ఉన్నప్పటికీ అందుకు తగ్గట్టుగా రుణాల కోసం డిమాండ్ పెరగడం లేదు. అయితే డిపాజిట్ల క్రెడిట్ల నిష్పత్తి మాత్రం గత కొన్ని నెలల్లో గణనీయంగా పెరిగిపోయింది. పొదుపు తగ్గడం లేదా పెట్టుబడి విషయంలో ప్రాథమ్యాలు మారిపోవడం దీనికి కారణం కావచ్చు. బంగారం, రియల్ ఎస్టేట్, క్రిప్టో తదితర ఇతర పెట్టుబడి మార్గాలను ఎంచుకుంటూ ఉండవచ్చు.పెద్ద పెద్ద వ్యాపారాలు, అధికాదాయ, ధనిక కుటుంబాలకు మినహా చిన్న, ప్రైవేట్ రంగ వ్యాపార వర్గాలు పెట్టుబడులు పెట్టేందుకు జంకుతున్నారు.ఎగుమతులు పెరగకపోవడం, అంతర్జాతీయ వాణిజ్య విపణిలో చైనా ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దిగుమతులపై ఉన్న నిబంధనలను కొన్నింటిని తొలగించింది.భారతీయ నగరాలు కొన్ని ప్రపంచంలోనే అత్యంత కాలుష్యభరిత నగరాల జాబితాలోకి చేరాయి. మహా నగరాల్లో ట్రాఫిక్ నిర్వహణ నత్తనడకన సాగుతోంది.రైతులకు గిట్టుబాటు ధర లభించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలపై రుణభారం పెరిగిపోతోంది.క్లుప్తంగా చెప్పాలంటే.. మనం భారీ ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు, తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న సమాజంగా పరిణమించేందుకు ఇంకా చాలా సమయం పడుతుందన్నమాట. కాబట్టి.. అభివృద్ధిని మరింత పెంచేందుకు ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు పెరగాలి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలతోపాటు చాలా కుటుంబాలు రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే భారీ పెట్టుబడులతో సామాజిక, ఆర్థిక పురోగతికి పునాదులు వేయాలి.ప్రజలందరికీ అవసరమైన మౌలిక సదుపాయాలను అందరికీ సమానంగా అందుబాటులోకి తేలేకపోతే మన ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది. ఇది కాస్తా దీర్ఘకాలంలో మధ్యాదాయ దేశంగానే మిగిలిపోయేలా చేస్తుంది. ఈ ట్రాప్ నుంచి తప్పించుకోవాలంటే...ద్రవ్య స్థిరీకరణను వాయిదా వేయాలి. ఎందుకంటే.. వడ్డీరేట్లు స్థిరంగా ఉన్నాయి.. తగినంత లిక్విడిటీ అందుబాటులో ఉంది.స్పెక్యులేషన్‌కు అవకాశమున్న రంగాల్లో పెట్టుబడులను నియంత్రించాలి. తద్వారా అందుబాటులో ఉన్న మొత్తం రిస్క్ క్యాపిటల్‌ను మెరుగ్గా వాడుకునేందుకు వీలు ఏర్పడుతుంది.నగర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వమే భారీగా పెట్టుబడులు పెట్టాలి. కాలుష్య నివారణకు, ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు, పారిశుద్ధ్యాన్ని పెంచేందుకు, గృహ వసతి కల్పనకు ప్రయత్నాలు ముమ్మరం కావాలి.చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగానికి ఈక్విటీ మద్దతు కల్పించాలి. రుణ సౌకర్యం కల్పించడం ఒక్కటే సరిపోదు.ప్రభుత్వ రంగ సంస్థల వద్ద వృథాగా పడిఉన్న మొత్తాలను పెట్టుబడుల రూపంలోకి మార్చేలా ప్రోత్సహించాలి. కొన్నేళ్లపాటు డివిడెండ్లను త్యాగం చేయాల్సి వచ్చిన వెనకాడరాదు.ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు లేకుండా చూడాలి. ఎనిమిదో పే కమిషన్ ద్వారా గ్రామీణ, నగర ప్రాంతాలు రెండింటిలోనూ తగిన వేతన పరిమితులు ఏర్పాటయ్యేలా చూడాలి.పరోక్ష పన్నుల భారాన్ని తగ్గించి, ద్రవ్యోల్బణ నియంత్రణకు చర్యలు తీసుకోవాలి.యూరప్‌తో కుదిరిన ఫ్రీట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా గరిష్టంగా లాభం పొందేందుకు చిన్న, మధ్య తరహా పరిశ్రమలతోపాటు పెద్ద కంపెనీలకు కూడా లక్ష్యాల ఆధారిత ప్రోత్సాహకాలు అందించాలి.ఇన్నోవేషన్ ద్వారా విలువను జోడించడంలో భారీ కార్పొరేషన్ల పాత్రను గుర్తించి తగు విధంగా ప్రోత్సహించాలి.మొత్తమ్మీద చూస్తే.. ఆర్థికాభివృద్ధి విషయంలో ప్రభుత్వ, ఆర్థికవేత్తల వ్యూహంపై పునరాలోచన జరగాలి. వివిధ దేశాలతో చేసుకున్న ఫ్రీట్రేడ్ అగ్రిమెంట్ ఇస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ప్రభుత్వ సేవల రంగంలో పెట్టుబడులు గణనీయంగా పెంచాలి. భారీ కార్పొరేషన్లకు కాకుండా చిన్న, మధ్యతరహా పరిశ్రమలతోపాటు ఆర్థికపరమైన మద్దతుకు ప్రాధాన్యత కల్పించాలి. అంతర్జాతీయ స్థాయిలో పోటీతత్వం ఉండేందుకు కార్మిక, పెట్టుబడి ఉత్పాదకతలను పెంచే విషయమై దృష్టి పెట్టాలి. యువతకు పబ్లిక్ సర్వీసుల్లో అవకాశాలను సృష్టించాలి.- అనిల్ కె.సూద్, అధ్యాపకులు, ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ కాంప్లెక్స్ ఛాయిసెస్, హైదరాబాద్.
బడ్జెట్ 2026: సీనియర్ సిటిజన్లకు తీపి కబురు?
త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2026 నేపథ్యంలో దేశంలోని కోట్లాది మంది సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వం శుభవార్త అందించే సూచనలు కనిపిస్తున్నాయి. కొవిడ్-19 సమయంలో నిలిపివేసిన రైల్వే ప్రయాణ రాయితీలను తిరిగి పునరుద్ధరించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిపై ఆర్థిక, రైల్వే మంత్రిత్వ శాఖల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి.ఆరేళ్ల నిరీక్షణకు తెర పడనుందా?రైల్వే రాయితీల పునరుద్ధరణపై గ్రీన్ సిగ్నల్ లభిస్తే దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత సీనియర్ సిటిజన్ ప్రయాణికులు తక్కువ ఛార్జీలతో రైలు ప్రయాణం చేసే అవకాశం లభిస్తుంది.గతంలో ఉన్న రాయితీ వివరాలు..పురుషులు (60 ఏళ్లు పైబడిన వారు): టికెట్ ధరలో 40 శాతం రాయితీ.మహిళలు (58 ఏళ్లు పైబడిన వారు): టికెట్ ధరలో 50 శాతం రాయితీ.వర్తించే తరగతులు: స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ వంటి దాదాపు అన్ని క్లాసుల్లో ఈ సదుపాయం ఉండేది.రాయితీ నిలిపివేతకు కారణాలేంటి?మార్చి 2020లో కరోనా సమయంలో దేశవ్యాప్తంగా రైలు సర్వీసులు నిలిచిపోయాయి. ఆ సమయంలో రైల్వే ఎదుర్కొన్న తీవ్ర ఆర్థిక లోటును అధిగమించేందుకు ఈ రాయితీలను రద్దు చేశారు. సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీల వల్ల భారతీయ రైల్వేపై ఏటా రూ.1,600 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకు అదనపు ఆర్థిక భారం పడుతుందని అంచనా. కరోనా తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుని, రైలు సర్వీసులు పూర్తిస్థాయిలో పునరుద్ధరించబడినప్పటికీ ఆర్థిక భారం దృష్ట్యా ప్రభుత్వం ఇప్పటివరకు ఈ రాయితీలను పునప్రారంభించలేదు.బడ్జెట్ 2026పై ఆశలుప్రస్తుతం పెరుగుతున్న ప్రయాణ ఖర్చులు, ఆరోగ్య సంరక్షణ వ్యయాలను దృష్టిలో ఉంచుకుని వృద్ధులకు ఉపశమనం కలిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2026లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపితే రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి సీనియర్ సిటిజన్లు మళ్లీ పాత పద్ధతిలోనే వయసు ధ్రువీకరణ ద్వారా ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా కౌంటర్లలో రాయితీ టికెట్లు పొందవచ్చు.ఇదీ చదవండి: అలసిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..
బడ్జెట్ 2026: వికసిత్ భారత్ దిశగా అడుగులు!
భారత జీడీపీ ఐదు ట్రిలియన్ డాలర్ల దిశగా దూసుకుపోతున్న వేళ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల విడుదలైన ఆర్థిక సర్వే 2025-26లోని వివరాల ప్రకారం.. ఈసారి బడ్జెట్ కేవలం అంకెలు మాత్రమే కాదు, సామాన్యుడి ఆశల ప్రతిరూపంగా ఉండనుందనే అంచనాలున్నాయి.వేతన జీవులకు..కేంద్ర బడ్జెట్లో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపు అనేది వేతన జీవులకు అత్యంత కీలకమైన అంశంగా ఉంది. స్టాండర్డ్ డిడక్షన్ అనేది జీతం పొందే ఉద్యోగులు, పెన్షనర్లకు లభించే తగ్గింపు. అంటే, మొత్తం వార్షిక ఆదాయం నుంచి ఎటువంటి ఖర్చులు చూపించాల్సిన అవసరం లేకుండానే ఈ మొత్తాన్ని నేరుగా మినహాయించుకోవచ్చు.పెంపు ఎందుకు అవసరం?గత కొన్ని ఏళ్లుగా నిత్యావసర వస్తువుల ధరలు, రవాణా ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం ఉన్న రూ.75,000 (గత సవరణల ప్రకారం) స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి ప్రస్తుత జీవన వ్యయానికి సరిపోవడం లేదని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిమితిని పెంచడం వల్ల ఉద్యోగుల చేతిలో ఖర్చు చేయడానికి మరింత నగదు మిగులుతుంది. ప్రజల చేతిలో డబ్బు ఎక్కువగా ఉంటే మార్కెట్లో వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను పెంచి జీడీపీ వృద్ధికి దోహదపడుతుంది.మౌలిక సదుపాయాలకు బూస్ట్దేశాభివృద్ధికి మౌలిక వసతులే కీలకమని నమ్ముతున్న కేంద్రం ఈసారి మూలధన వ్యయం (Capital Expenditure) కేటాయింపుల్లో రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే వడ్డీ లేని రుణాల గడువును పెంచడం ద్వారా స్థానికంగా రోడ్లు, బ్రిడ్జిల వంటివాటి నిర్మాణం వేగవంతం అవుతుంది. తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (PLI) మరింత విస్తరించనున్నారు.యువత - ఉపాధిరాబోయే రోజుల్లో లక్షల మంది పట్టభద్రులు ఉద్యోగ వేటలో పడనున్నారు. దీన్ని ఆర్థికంగా అందిపుచ్చుకోవడానికి బడ్జెట్ ప్రధానంగా దృష్టి సారించనుంది. ప్రధానంగా జౌళి (Textiles), పర్యాటకం, ఈ-కామర్స్ రంగాల్లో భారీగా ఉద్యోగాల కల్పనకు ప్రత్యేక ప్యాకేజీలు ఉండొచ్చు. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు వృత్తి విద్యా కోర్సులు, శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.ఎంఎస్ఎంఈచిన్న తరహా పరిశ్రమల ఆర్థిక ఇబ్బందులను తీర్చడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎంఎస్ఎంఈల కోసం క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని మరింత సరళతరం చేస్తూ కొలేటరల్(పూచీకత్తు) లేకుండా రుణాలు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. మేక్ ఇన్ ఇండియా వస్తువులను ప్రపంచ మార్కెట్లకు చేర్చడానికి ఎగుమతి సుంకాల్లో సడలింపులు ఉండవచ్చు.వ్యవసాయం, గ్రామీణ వికాసంవాతావరణ మార్పుల ధాటికి తట్టుకునేలా వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడం ప్రస్తుత తక్షణ అవసరం.రైతులకు నేరుగా నగదు బదిలీ చేసే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని(ప్రస్తుతం ఏటా రూ.6000) పెంచాలనే డిమాండ్‌ను ప్రభుత్వం పరిశీలిస్తోంది.భూ రికార్డుల డిజిటలైజేషన్, డ్రోన్ల వినియోగం, ఆధునిక గోదాముల నిర్మాణానికి భారీ నిధులు కేటాయించే అవకాశం ఉంది.గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ‘అందరికీ ఇల్లు’ లక్ష్యాన్ని చేరుకోవడానికి గృహ నిర్మాణ రంగానికి అదనపు కేటాయింపులు చేయనున్నారు.ఇదీ చదవండి: సవాళ్లున్నా ముందుకే

