ఎన్‌డీఏలో కీలకంగా ఉన్నామని చెప్పే చంద్రబాబు సాధించిందేమిటి?
పోలవరానికి నిధులు సాధించడంలో విఫలం
రైల్వే కారిడార్లు తెచ్చుకోవడంలో ఫెయిల్
పోలవరంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శ్రద్ధ లేదు
కేంద్రం చంద్రబాబుకు అప్పులు చేసుకునే స్వేచ్ఛ ఇచ్చింది
ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: తాజా బడ్జెట్‌లోనూ ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయమే జరిగిందని వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే కారిడార్లు తెచ్చుకోవడంలో కూడా చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. గతేడాది కంటే ఈ ఏడాది పోలవరం ప్రాజెక్టుకు నిధులు తగ్గడంపై మండిపడ్డారు.
ఢిల్లీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడ రఘునాథరెడ్డి, ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, గొల్ల బాబూరావు, వైఎస్ అవినాశ్‌రెడ్డి, డాక్టర్ మద్దిల గురుమూర్తి, డాక్టర్ గుమ్మా తనూజారాణి మాట్లాడారు. ఎన్‌డీఏలో కీలకంగా ఉన్నామని చెప్పుకొనే చంద్రబాబు సాధించిందేమిటని ప్రశ్నించారు.
వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు 41.5 మీటర్లకే ఉంచుతూ నిధులు కేటాయించినట్లు తెలిపారు. 2026–27 బడ్జెట్‌లో పోలవరానికి రూ.3,320 కోట్లు కేటాయించడం దారుణమన్నారు. దేశంలో మిగతా రాష్ట్రాల నుంచి రైల్వే కారిడార్లు ఏర్పాటు చేసిన కేంద్రం.. కొత్తగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌కు హైస్పీడ్ రైల్వే కారిడార్ ఏర్పాటు చేయలేదని విమర్శించారు.
విశాఖ–చెన్నై, విశాఖ–బెంగళూరుకు రైల్వే కారిడార్లు ఏర్పాటు చేసుకుంటే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదన్నారు. ఈ విషయాల్లో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ రెండు అంశాలపై తాము కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. బడ్జెట్‌లో టూరిజానికి పెద్దపీట వేయడం, ఇందులో అరకు వ్యాలీ అభివృద్ధికి కేంద్రం చేయూతనివ్వడం అభినందనీయమని పేర్కొన్నారు.
అప్పులు చేసుకునే స్వేచ్ఛ ఇచ్చినందునే చంద్రబాబు తలొగ్గుతున్నారు
ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రం పూర్తిగా నిరాశపరిచిందని చెప్పారు. పోలవరం, జలజీవన్, పీఎంజేఎస్‌వై పథకాలకు పూర్తిగా నిధులు తగ్గించారని మండిపడ్డారు. జీరాంజీ పథకానికి రూ.58 వేల కోట్లు కోత వేశారని చెప్పారు. ఈ స్కీంను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కంకణం కట్టుకుందని విమర్శించారు. రాష్ట్రాలు 40 శాతం భరించే పరిస్థితులు లేవని, కేంద్రం వాటా కుదిస్తే ఇది నిర్వీర్యం అవుతుందని ఆ రోజు బిల్లు పాస్ చేసినప్పుడు పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ తరఫున తాను చెప్పినట్లు గుర్తు చేశారు.
ఏపీ పునరి్వభజన చట్టంలో... పోలవరాన్ని తాము నిర్మిస్తామని, ఇందుకు రూ.57 వేలకోట్లు గ్రాంటు ఇస్తున్నామని కేంద్రం పొందుపరిచిందని చెప్పారు. గత బడ్జెట్‌లో ఎత్తు తగ్గించి, నిధులు తగ్గించారన్నారు. దాదాపు రూ.27 వేల కోట్లు తగ్గించినా, ఎత్తు తగ్గించినా చంద్రబాబు ప్రభుత్వం నోరు మెదపడం లేదని విమర్శించారు. పోలవరానికి ఏటా ఇలా నిధులు తగ్గించుకుంటూపోతే ఆ స్వప్నం ఎప్పుడు సాకారమవుతుందని ప్రశ్నించారు. రూ.30 వేల కోట్లలో రూ.3,320 కోట్లే కేటాయించారన్నారు.
కేంద్రం చంద్రబాబుకు అప్పులు చేసుకునే స్వేచ్ఛను ఇవ్వబట్టే.. పోలవరం విషయంలో తలొగ్గుతున్నారని దుయ్యబట్టారు. అమరావతి పేరుతో రూ.15 వేల కోట్లు అప్పు చేయడమేగాక.. మళ్లీ కొత్త అప్పులు తెచ్చారని తెలిపారు. చంద్రబాబు 21 నెలల్లో రూ.3.5 లక్షల కోట్ల అప్పు చేశారని విమర్శించారు. గత పాలనలో వైఎస్ జగన్ ఐదేళ్లలో రూ.3.32 లక్షల కోట్ల అప్పుచేస్తే రాష్ట్రం శ్రీలంక, సోమాలియా అవుతుందని వ్యాఖ్యలు చేసిన వారంతా ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు.
తాను అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబుకు ఇంత అప్పు చేయడానికి సిగ్గులేదా అని నిలదీశారు. కొత్తగా ఏపీఎండీసీ పేరుతో రూ.5 వేలకోట్లు, బెవరేజెస్ కార్పొరేషన్ పేరుతో రూ.11 వేలకోట్ల అప్పునకు పూనుకున్నారని చెప్పారు. ప్రైవేటు సంస్థ ఏదైనా ప్రభుత్వానికి అప్పు ఇస్తే.. ప్రభుత్వం కట్టని పరిస్థితుల్లో ఆ అప్పును డైరెక్ట్‌గా డ్రా చేసుకోవచ్చనే షరతును ప్రభుత్వం పెట్టడం దుర్మార్గమని చెప్పారు. ఇబ్బడిముబ్బడిగా అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వాన్ని అత్యంత బలహీనమైన ప్రభుత్వంగా చూడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
పోలవరం పూర్తికి మరో పదేళ్లు?
ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శ్రద్ధలేదని ఈ బడ్జెట్ ద్వారా మరోసారి తేటతెల్లమైందని విమర్శించారు. ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు మాటలు వింటుంటే అక్కడ నీరు ఏరులై పారుతున్నట్లు అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. పోలవరం ఎత్తు తగ్గింపులో కూడా చంద్రబాబు, ఆయన టీం నోరు మెదపలేదని విమర్శించారు.
గతేడాది కంటే ఇప్పుడు మరింతగా నిధులు తగ్గించడం చూస్తుంటే ప్రాజెక్టు పూర్తి చేయడాన్ని మరో పదేళ్ల వరకు తీసుకెళ్లేలా ఉన్నట్లు కనిపిస్తోందని చెప్పారు. ఎంపీ మేడ రఘునాథరెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా ఏపీకి ఏటా అన్యాయం జరుగుతోందని విమర్శించారు. రాష్ట్రాన్ని చంద్రబాబు ప్రభుత్వం అప్పులాంధ్రప్రదేశ్‌గా చేసిందన్నారు. రాష్ట్రాన్ని కార్పొరేట్ల చేతుల్లో ఎలా పెట్టాలి, సొంత లాభాలు ఎలా గడించాలి అనేవే చంద్రబాలు ఆలోచనలని ఆయన విమర్శించారు.


