పోలవరానికి రూ.3,320.39 కోట్లే.. | Chandrababu Naidu government has failed to raise funds for the Polavaram project | Sakshi
Sakshi News home page

పోలవరానికి రూ.3,320.39 కోట్లే..

Feb 2 2026 4:06 AM | Updated on Feb 2 2026 4:06 AM

Chandrababu Naidu government has failed to raise funds for the Polavaram project

పీపీఏకు రూ.20 కోట్లు.. 2026–27 బడ్జెట్‌లో కేంద్రం కేటాయింపు  

41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా నిధులు ఇస్తామని పునరుద్ఘాటన 

నీటి నిల్వ సామర్థ్యం 194.6 నుంచి 119.4 టీఎంసీలకు తగ్గింపు 

సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 2026–27 బడ్జెట్‌లో రూ.3,320.39 కోట్లు కేటాయించింది. పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)కు రూ.20 కోట్లు కేటాయించింది. ప్రాజెక్టులో 41.15 మీటర్ల (కనీస నీటిమట్టం) ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పూర్తి చేయడానికి మాత్రమే నిధులు ఇస్తామని పునరుద్ఘాటించింది. అంటే.. పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యాన్ని 194.6 టీఎంసీల నుంచి 119.4 టీఎంసీలకు తగ్గించడాన్ని బడ్జెట్‌ సాక్షిగా మరోసారి స్పష్టం చేసింది. 

పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నిర్మాణానికి కేటాయించిన నిధులు రాబట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోర వైఫల్యానికి ఇదే పక్కా నిదర్శనం. గత 2025–26 బడ్జెట్‌లో పోలవరానికి కేంద్రం రూ.5,936 కోట్లు కేటాయించింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రీయింబర్స్‌మెంట్‌ రూపంలో రూ.459.69 కోట్లను విడుదల చేసింది. అడ్వాన్సుగా రెండు విడతల్లో రూ.5,052.71 కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసింది. 

వాటిని ఎస్‌ఎన్‌ఏ (సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ) ఖాతాలో జమ చేసి.. పోలవరం ప్రాజెక్టు పనులు, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి మాత్రమే వ్యయం చేసి.. 75 శాతం ఖర్చు చేశాక యూసీలు(వినియోగ ధ్రువీకరణపత్రాలు) పంపితే మళ్లీ అడ్వాన్సుగా నిధులు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం ఆ నిధులను ఎస్‌ఎన్‌ఏ ఖాతాలో జమ చేయకుండా, ఇతర అవసరాలకు మళ్లించింది. 

ఇదే అంశంపై పీపీఏ, కేంద్ర జల్‌ శక్తి శాఖ అనేకమార్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో విడతల వారీగా రూ.4,352 కోట్లను ఎస్‌ఎన్‌ఏ ఖాతాలో జమ చేసి.. ప్రాజెక్టు పనులకు, నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు ఖర్చు చేసింది. అంటే 2024–25లో అడ్వాన్సుగా ఇచ్చిన నిధుల్లో ఇప్పటికీ రూ.700 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయలేదు. దాంతో కేంద్రం 2025–26 బడ్జెట్‌లో కేటాయించిన రూ.5,936 కోట్లలో ఒక్క పైసా కూడా ఇప్పటి దాకా విడుదల చేయలేదు. 

2026–27 బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. 2025–26 బడ్జెట్‌ అంచనాలను సవరించిన కేంద్ర ప్రభుత్వం పోలవరానికి కేటాయింపులను రూ.3,017.20 కోట్లకు పరిమితం చేసింది. అంటే.. గతంలో కేటాయించిన నిధుల్లో రూ.2,918.80 కోట్లు కోత వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో 58 రోజుల్లో ముగుస్తుంది. దీన్ని బట్టి చూస్తే... సవరించిన బడ్జెట్‌లో కేటాయించిన రూ.3,017.20 కోట్లను కూడా వినియోగించుకోవడం సాధ్యం కాదని సాగు నీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.  

తాజా బడ్జెట్‌లో పునరుద్ఘాటన
పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేస్తూ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సవరించిన అంచనా వ్యయాన్ని రూ.30,436.95 కోట్లుగా 2024 ఆగస్టు 28న కేంద్ర కేబినెట్‌ ఆమోదించింది. 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.12,157.53 కోట్లు మాత్రమే ఇవ్వాలని కేంద్ర కేబినెట్‌ తీర్మానించింది. తద్వారా పోలవరం రిజర్వాయర్‌ను బ్యారేజీగా మార్చేస్తూ కేంద్ర కేబినెట్‌ తీర్మానం ఆమోదించినా, ఆ సమావేశంలో ఉన్న టీడీపీకి చెందిన మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు అభ్యంతరం చెప్పలేదు. దాన్ని చంద్రబాబు సర్కార్‌ కూడా వ్యతిరేకించలేదు.

41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామంటూ 2024–25, 2025–26 బడ్జెట్‌లోనూ కేంద్రం స్పష్టం చేసింది. తాజా బడ్జెట్‌లోనూ అదే అంశాన్ని పునరుద్ఘాటించింది. వాస్తవానికి 2017–18 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వేను పూర్తి చేసింది. ఆ మేరకు ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయాలంటే నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి, భూ సేకరణకు అదనంగా రూ.22 వేల కోట్లకుపైగా అవసరమని సాగు నీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.  

నాడు.. నేడు.. అదేతీరు...
పోలవరంలో 41.15 మీటర్ల వరకే నీటిని నిల్వ చేస్తే.. వరద ప్రవాహం ఉన్నప్పుడు మాత్రమే కుడి, ఎడమ కాలువల కింద 2.98 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లందించే అవకాశం ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అంటే.. పోలవరం ప్రాజెక్టు కింద మిగతా 4.22 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. ఇక కృష్ణా డెల్టా స్థిరీకరణ, గోదావరి డెల్టాలో రబీ పంటకు నీళ్లందించడం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు నీళ్లందించడం సాధ్యం కాదని తేల్చి చెబుతున్నారు. 

పోలవరంలో 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేస్తేనే ఆ ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడిగా మారుతుందని స్పష్టం చేస్తున్నారు. 1995లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచి్చన చంద్రబాబు.. 1996లో కేంద్రంలో యునైటెడ్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో, నాటి కర్ణాటక సీఎం దేవేగౌడను ప్రధానిని చేయడంలో ప్రధాన భూమిక పోషించి, కేంద్రంలో చక్రం తిప్పానంటూ అనేక మార్లు చెప్పుకున్నారు. 

అప్పట్లో కర్ణాటక సర్కార్‌ ఆల్మట్టి ఆనకట్ట ఎత్తును 506 మీటర్ల నుంచి 519.6 మీటర్లకు పెంచేసి రిజర్వాయర్‌గా మార్చేసి, ఏపీ నోట్లో మట్టి కొట్టినా అప్పట్లో చంద్రబాబు నోర మెదపలేదు. ఇప్పుడు పోలవరం రిజర్వాయర్‌ను బ్యారేజ్‌గా మార్చేసి రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన ఘనత కూడా చంద్రబాబే దక్కించుకున్నారంటూ సాగు నీటి రంగ నిపుణులు మండిపడుతున్నారు.  

సందిగ్ధత... అస్పష్టత
సాక్షి, అమరావతి: కేంద్ర రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులపై స్పష్టత కొరవడింది. కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఏపీలోని రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులను ప్రత్యేకంగా ప్రస్తావించ లేదు. ప్రధానంగా 7 కొత్త హై స్పీడ్‌ రైల్వే కారిడార్‌ల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు చెప్పారు. వాటిలో హైదరాబాద్‌–చెన్నై, హైదరాబాద్‌–బెంగళూరు కారిడార్లు ఏపీ మీదుగా వెళతాయి. 

చెన్నై–బెంగళూరు హైస్పీడ్‌ కారిడార్‌ పరిధిలోకి రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోని పలమనేరు ప్రాంతంలో కొంత ప్రాంతం వస్తుంది. రాష్ట్రంలోని అమరావతి రైల్వే లైన్, కడప – బెంగళూరు రైల్వే లైన్, కోటిపల్లి–నర్సాపురం, నడికుడి–శ్రీకాళహస్తి, డోన్‌–అంకోలా తదితర రైల్వే లైన్లకు కేటాయింపులపై స్పష్టత లేదు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు నిధుల కేటాయింపుపై సందిగ్ధత నెలకొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement