కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2026న ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే 2026-27 కేంద్ర బడ్జెట్ (Union Budget 2026-27) గురించి చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను సమర్పిస్తూ ఆమె సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు. ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల మధ్య భారత ఆర్థిక వ్యవస్థను ఐదు ట్రిలియన్ డాలర్ల దిశగా నడిపించేందుకు ఈ బడ్జెట్ ఒక దిక్సూచిలా నిలవనుంది.
ఈ నేపథ్యంలో నిపుణుల అంచనా ప్రకారం.. ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్న ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
పన్ను చెల్లింపుదారులకు ఊరట
మధ్యతరగతి ప్రజలు, వేతన జీవులు ఎప్పుడూ ఆశించేది ఆదాయపు పన్ను రాయితీలు. ఈసారి కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు పన్ను స్లాబుల్లో స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఉన్న రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని మరింత పెంచే అవకాశం ఉంది.
వివాహిత జంటలకు కలిపి ఒకే పన్ను రిటర్నులు దాఖలు చేసే వెసులుబాటు కల్పించడం ద్వారా పన్ను భారాన్ని తగ్గించే దిశగా కొత్త ప్రతిపాదన రావొచ్చు.
మౌలిక సదుపాయాల కల్పన
గత కొన్ని బడ్జెట్‌ల మాదిరిగానే ఈసారి కూడా మూలధన వ్యయంపై ప్రభుత్వం భారీగా దృష్టి పెట్టనుంది.
వందే భారత్ స్లీపర్ రైళ్ల విస్తరణ, అమృత్ భారత్ స్టేషన్ల ఆధునీకరణ, కొత్త జాతీయ రహదారుల నిర్మాణానికి భారీ కేటాయింపులు ఉండవచ్చు.
వస్తు రవాణా ఖర్చులను తగ్గించడానికి మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుకు ప్రాధాన్యత లభించనుంది.
ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి
దేశంలో నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యేక్ష ఉపాధి ప్రోత్సాహక పథకాలను ప్రకటించే అవకాశం ఉంది.
తయారీ రంగాన్ని ప్రోత్సహించి ఉద్యోగాలను సృష్టించేందుకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) పథకాన్ని మరిన్ని రంగాలకు విస్తరించవచ్చు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతల్లో యువతకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక నిధులు కేటాయించే ఛాన్స్ ఉంది.
వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం బడ్జెట్‌లో కీలక అంశం కానుంది.
చిన్న, సన్నకారు రైతులకు రుణ పరిమితి పెంపు, మహిళా రైతులకు ప్రత్యేక రాయితీలు ఆశించవచ్చు.
వ్యవసాయ రంగంలో సాంకేతికతను జోడించి ఉత్పాదకతను పెంచేందుకు ‘అగ్రి-టెక్’ స్టార్టప్‌లకు ప్రోత్సాహం ఉండవచ్చు.
గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు
పర్యావరణ హిత ఇంధనాల వైపు మళ్లడం ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటి.
ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గించేలా బ్యాటరీ తయారీపై పన్ను రాయితీలు, చార్జింగ్ స్టేషన్ల విస్తరణపై ప్రకటనలు వెలువడవచ్చు.
నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌కు మరిన్ని నిధుల కేటాయింపు జరిగే అవకాశం ఉంది.
ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి?
ఈ ఏడాది పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి ఆయా రాష్ట్రాల్లో కొత్త రైల్వే ప్రాజెక్టులు, పారిశ్రామిక కారిడార్లు లేదా ప్రత్యేక ప్యాకేజీల ప్రకటనలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.
ఇదీ చదవండి: Budget 2026: కేంద్ర బడ్జెట్‌కు వేళాయె..


