‘విజన్‌’కు వీరతాడు వేస్తారా? | Telangana Congress Hopes on Union Budget 2026 | Sakshi
Sakshi News home page

‘విజన్‌’కు వీరతాడు వేస్తారా?

Feb 1 2026 5:44 AM | Updated on Feb 1 2026 5:44 AM

Telangana Congress Hopes on Union Budget 2026

కేంద్ర బడ్జెట్‌పై గంపెడాశలు పెట్టుకున్న తెలంగాణ 

ఆర్‌ఆర్‌ఆర్, మూసీ, మెట్రో, ఫ్యూచర్‌ సిటీ నిర్మాణం కోసం కేంద్ర సాయం ఆశిస్తున్న రాష్ట్రం 

ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితి 3 నుంచి 4 శాతానికి పెంచాలని విజ్ఞప్తి 

కేంద్ర పన్నుల్లో వాటా పెంచాలని ఇప్పటికే పలుమార్లు కోరిన ఆర్థిక మంత్రి భట్టి 

ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో రుణాల సేకరణ విషయంలో వెసులుబాటు ఆశిస్తున్న రాష్ట్రం

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర వార్షిక బడ్జెట్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గంపెడాశలు పెట్టుకుంది. తెలుగింటి కోడలైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో రాష్ట్రాభివృద్ధికి నిధుల కేటాయింపులు ఉంటాయని ఆశిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పలు ఆర్థిక ప్రతిపాదనలకు ఈ బడ్జెట్‌లోనైనా మోక్షం కలుగుతుందని.. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న విజన్‌–2047 లక్ష్యాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామికాభివృద్ధికి ఈ బడ్జెట్‌ దోహదపడుతుందని అంచనా వేస్తోంది. 

గతానికి గ్లోబల్‌ సమ్మిట్‌ అదనం 
వాస్తవానికి 2025–26 వార్షిక బడ్జెట్‌ సమయంలోనే పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సమరి్పంచింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలతోపాటు పలువురు మంత్రులు, రాష్ట్రానికి చెందిన ఎంపీలు కేంద్ర ప్రభుత్వ పెద్దలను పలుమార్లు కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించారు. గత బడ్జెట్‌ సందర్భంగా అడిగిన విధంగానే ట్రిపుల్‌ ఆర్, రేడియల్‌ రోడ్లు, బందర్‌ పోర్టు–డ్రైపోర్టు గ్రీన్‌ఫీల్డ్‌ హైవే లాంటి మౌలిక సదుపాయాలు, హైదరాబాద్‌ అభివృద్ధిలో భాగంగా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, మెట్రో విస్తరణ, సీవరేజ్‌ మాస్టర్‌ప్లాన్, ఇండస్ట్రియల్‌ హబ్‌లు, లాజిస్టిక్‌ పార్కుల ఏర్పాటు, సెమీ కండక్టర్‌ పరిశ్రమలకు సహకారం లాంటి ప్రతిపాదనలపై ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది.

 ఇక రాష్ట్రంలో పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు, వరంగల్‌లో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీకి నిధులు, జిల్లాల్లో లెదర్‌ పార్కులు, కేంద్రీయ విద్యాలయాలు, జిల్లాకో నవోదయ పాఠశాల, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాతోపాటు ఐఐఎం మంజూరు విషయంలోనూ కేంద్రం దయ చూపుతుందనే ఆశాభావంతో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్‌ సమ్మిట్‌ స్ఫూర్తిని కేంద్రం అర్థం చేసుకొని ఫ్యూచర్‌ సిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు తోడ్పాటు అందిస్తుందని.. 2047 నాటికి మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్య సాధనకు ఊతమిచ్చే ప్రతిపాదనలను ప్రవేశపెడుతుందని ఆశిస్తోంది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం జీడీపీలో 3 శాతం వాటా మేరకే రుణాలు తీసుకునే వెసులుబాటు ఉండగా ఈ మొత్తాన్ని కనీసం 4 శాతానికి పెంచాలని రాష్ట్రం కోరింది. అలాగే కేంద్ర పన్నుల్లో వాటాను 41 శాతం నుంచి పెంచాలని విజ్ఞప్తి చేస్తూ వచ్చింది.  

రూ.1.63 లక్షల కోట్ల నిధులపై ఆశలు: మొత్తం రూ. 1.63 లక్షల కోట్లకుపైగా నిధుల కోసం కేంద్ర బడ్జెట్‌ వైపు తెలంగాణ ఆశగా చూస్తోంది. అందులో ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం రూ. 34,367 కోట్లు, రేడియల్‌ రోడ్ల అభివృద్ధికి రూ. 45,000 కోట్లు, మెట్రో రెండోదశకు రూ. 24,269 కోట్లు, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు రూ. 14,100 కోట్లు, గోదావరి–మూసీ అనుసంధానం కోసం రూ. 7,440 కోట్లు, హైదరాబాద్‌ సీవరేజ్‌ మాస్టర్‌ప్లాన్‌ కోసం రూ. 17,212 కోట్లు, వరంగల్‌ అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిమిత్తం రూ. 4,170, బందర్‌–హైదరాబాద్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే కోసం రూ. 17,000 కోట్లు కలిపి మొత్తం రూ. 1,63,558 కోట్ల మేర కేంద్ర సాయం అందుతుందని ఆశిస్తోంది. దీనికితోడు మెట్రో రైలు నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సి వస్తే అవసరమయ్యే రూ. 15 వేల కోట్లకుపైగా నిధుల్లోనూ కేంద్ర సాయాన్ని ఆశిస్తోంది.

వెలుగునిస్తారో... చీకట్లోనే ఉంచుతారో? 
గత 11 కేంద్ర బడ్జెట్‌లలో తెలంగా ణకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈసారైనా రాష్ట్రానికి ఎక్కువ నిధు లు కేటాయించాలి. రాష్ట్ర ప్రభుత్వ అవసరాలేంటో కేంద్రానికి ఎప్పటికప్పుడు తెలియజేశాం. ఈసారి పౌర్ణమి రోజున కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ పెడుతోంది. ఈ బడ్జెట్‌ తెలంగాణకు వెలుగునిస్తుందా? చీకట్లోనే ఉంచుతుందా అనేది చూస్తాం. లేదంటే తెలంగాణ నుంచి గెలిచిన 8 మంది ఎంపీలే బాధ్యత వహించాలి. – గాంధీభవన్‌లో మీడియాతో మంత్రి పొన్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement