దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నకేంద్ర బడ్జెట్ 2026ను మరికొద్ది రోజుల్లోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం వ్యయం, పన్నులు, అభివృద్ధి ప్రణాళికలపై తన దిశానిర్దేశాన్ని వెల్లడిస్తుంది. అందుకే నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వినిపించే పదాలు దేశ ఆర్థిక వ్యవస్థపై కీలక ప్రభావం చూపుతాయి. అలాంటి కొన్ని పదాలు.. వాటి అర్థాల గురించి తెలుసుకుంటే, రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ ఆదాయం–వ్యయాలపై స్పష్టమైన అవగాహన వస్తుంది.
యూనియన్ బడ్జెట్: ప్రభుత్వ ఆర్థిక స్థితిని సమగ్రంగా వివరించే నివేదిక. ఆదాయ వనరులు, వ్యయాలు, రాబోయే ఆర్థిక సంవత్సరానికి అంచనాలు ఇందులో ఉంటాయి.
ఫిస్కల్ పాలసీ (విత్త విధానం): వ్యయం, పన్నుల ద్వారా ఆర్థిక వ్యవస్థను నియంత్రించేందుకు ప్రభుత్వం అనుసరించే విధానం. ఇది బడ్జెట్ ద్వారా అమలవుతుంది.
ఇన్‌ఫ్లేషన్ (ద్రవ్యోల్బణం): వస్తువులు, సేవల ధరలు కాలక్రమేణా పెరగడాన్ని ద్రవ్యోల్బణం అంటారు. దీని వల్ల కొనుగోలు శక్తి తగ్గుతుంది.
మానిటరీ పాలసీ (Monetary Policy): డబ్బు సరఫరా, వడ్డీ రేట్లు, రుణ పరిస్థితులను నియంత్రించేందుకు కేంద్ర బ్యాంకు (ఆర్‌బీఐ) తీసుకునే చర్యలు.
బడ్జెట్ ఎస్టిమేట్స్ (Budget Estimates): రాబోయే ఆర్థిక సంవత్సరానికి మంత్రిత్వ శాఖలు, పథకాలకు కేటాయించిన నిధుల అంచనాలు.
రివైజ్డ్ ఎస్టిమేట్స్ (Revised Estimates): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మధ్యలో వాస్తవ పరిస్థితులను బట్టి సవరించిన ఆదాయం–వ్యయాల అంచనాలు.
రెవెన్యూ బడ్జెట్: ప్రభుత్వ రెవెన్యూ వసూళ్లు (పన్ను, పన్నుయేతర ఆదాయం), రెవెన్యూ వ్యయాలను చూపుతుంది.
క్యాపిటల్ బడ్జెట్: మూలధన వసూళ్లు, మూలధన వ్యయాలకు సంబంధించిన వివరాలు ఇందులో ఉంటాయి.
ఫినాన్స్ బిల్ (ఆర్థిక బిల్లు): బడ్జెట్‌లో ప్రతిపాదించిన పన్నుల మార్పులను అమలు చేయడానికి రూపొందించే చట్టప్రతిపాదన.
క్యాపిటల్ ఎక్స్‌పెండీచర్ (మూలధన వ్యయం): ఆస్తుల కొనుగోలు, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడులు వంటి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం చేసే ఖర్చు.
రెవెన్యూ ఎక్స్‌పెండీచర్ (రెవెన్యూ వ్యయం): జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు వంటి తక్షణ వినియోగ ఖర్చులు.
ఫిస్కల్ డెఫిసిట్ (ద్రవ్యలోటు): ప్రభుత్వ మొత్తం వ్యయం, రుణం కాని వసూళ్ల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఏర్పడే లోటు.
ప్రైమరీ డెఫిసిట్ (ప్రాథమిక లోటు): ద్రవ్యలోటు నుంచి వడ్డీ చెల్లింపులను మినహాయించిన మొత్తం.
రెవెన్యూ డెఫిసిట్ (రెవెన్యూ లోటు): రెవెన్యూ వ్యయం, రెవెన్యూ వసూళ్ల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఏర్పడుతుంది.
గ్రాస్ ఫిస్కల్ డెఫిసిట్ (స్థూల ద్రవ్యలోటు): ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి అవసరమైన మొత్తం రుణ పరిమాణం.
నెట్ ఫిస్కల్ డెఫిసిట్ (నికర ద్రవ్యలోటు): ప్రభుత్వం ఇచ్చే నికర రుణాలను మినహాయించిన ద్రవ్యలోటు.
క్యాపిటల్ రిసీట్స్ (మూలధన వసూళ్లు): రుణాలు, పెట్టుబడుల ఉపసంహరణ, రుణ రికవరీలు మొదలైనవి.
రెవెన్యూ రిసీట్స్ (రెవెన్యూ వసూళ్లు): పన్నులు, పన్నుయేతర వనరుల ద్వారా వచ్చే ఆదాయం.
డైరెక్ట్ ట్యాక్స్ (ప్రత్యక్ష పన్నులు): ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను వంటి నేరుగా ప్రభుత్వానికి చెల్లించే పన్నులు.
ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్ (పరోక్ష పన్నులు): జీఎస్టీ వంటి వస్తువులు, సేవలపై విధించే పన్నులు.


