కేంద్ర బడ్జెట్ 2026–27ను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ఆదివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం అరుదైన ఘటన, అంతే కాకుండా ఈ రోజు స్టాక్ మార్కెట్ కూడా పెట్టుబడిదారుల కోసం తెరిచి ఉంటుందని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) & నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) వెల్లడించాయి.
సాధారణంగా స్టాక్ మార్కెట్లకు శనివారం, ఆదివారం సెలవు రోజులు. అయితే యూనియన్ బడ్జెట్ 2026ను ఆదివారం (ఫిబ్రవరి 1) ప్రవేశపెడుతున్నారు, కాబట్టి ఆ రోజు స్టాక్ మార్కెట్ యధావిధిగా తెరిచే ఉంటుంది (స్టాక్ మార్కెట్‌కు ఆదివారం సెలవు లేదన్నమాట).
బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి గుర్తుగా.. జనవరి 28న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. కాగా జనవరి 29న ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెడతారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి సెషన్ జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 తేదీలలో జరుగుతుందని, రెండవ భాగం మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 మధ్య రెండో సెషన్ జరుగుతాయి.
సీతారామన్ తొమ్మిదో బడ్జెట్
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇది స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 88వ బడ్జెట్ అవుతుంది. అంతే కాకుండా.. 2017 నుంచి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టడం ప్రారంభించింది. ఇదే సమయాన్ని ఇప్పుడు కూడా అనుసరిస్తారు. వరుసగా తొమ్మిది కేంద్ర బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు, భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన ఆర్థిక మంత్రులలో ఆమె స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోబోతున్నారు.


