ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువమంది మాట్లాడుకుంటున్న అంశం యూనియన్ బడ్జెట్ 2026. కేంద్ర బడ్జెట్ 2026–27ను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న (ఆదివారం) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే చాలామందికి ఈ బడ్జెట్ ఎప్పుడు ప్రారంభమైంది? దాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? అనే విషయాలు తెలిసి ఉండవు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.
1860లో మొదటి బడ్జెట్
1860లో భారత్ బ్రిటిష్ పాలనలో ఉండేది. అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న 'జేమ్స్ విల్సన్' ఏప్రిల్ 7న తొలి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంటే మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెట్టింది బ్రిటీష్ వాళ్లే అన్నమాట. అయితే ఈ బడ్జెట్ వలస పాలకుల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇప్పుడు ప్రవేశపెడుతున్న బడ్జెట్‌లకు అప్పటి బడ్జెట్ పూర్తిగా భిన్నంగా ఉండేది.

స్వాతంత్య్రం వచ్చిన తరువాత
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత.. 1947 నవంబర్ 26న తొలి బడ్జెట్‌ను అప్పటి ఆర్థిక మంత్రి సర్ ఆర్.కే. షణ్ముఖం చెట్టి పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇది పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ కాదు. 1948 ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావాల్సి ఉండటంతో, ఈ బడ్జెట్‌ను ఒక మధ్యంతర బడ్జెట్‌గా ప్రవేశపెట్టారు.
వీటికే ప్రాధాన్యత
తొలి బడ్జెట్‌లో అభివృద్ధి కంటే పరిపాలన, భద్రత, పునరావాసం వంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇది అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయం
తొలి బడ్జెట్‌లో ఒక విశేష అంశం ఉంది. అదేమిటంటే.. భారత్, పాకిస్తాన్ రెండూ 1948 సెప్టెంబర్ వరకు ఒకే కరెన్సీని ఉపయోగిస్తాయి అని ఈ బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఇండియా, పాక్ విభజన జరిగినప్పటికీ.. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా విడిపోలేదు. అయితే ఆర్థికంగా విడిపోవడం ఒక దశలవారీ ప్రక్రియగా కొనసాగిందన్నమాట.

నిర్మలా సీతారామన్ తొమ్మిదో బడ్జెట్
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇది స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 88వ బడ్జెట్ అవుతుంది. అంతే కాకుండా.. 2017 నుంచి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టడం ప్రారంభించింది. ఇదే సమయాన్ని ఇప్పుడు కూడా అనుసరిస్తారు. వరుసగా తొమ్మిది కేంద్ర బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు, భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన ఆర్థిక మంత్రులలో ఆమె స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోబోతున్నారు.
ఇదీ చదవండి: ఇప్పుడు 150 టన్నుల బంగారం.. ఏడాది చివరికి నాటికి..


