ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ దేశాభివృద్ధికి సంబంధించి కీలకమైన రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించారు. కర్తవ్య భవన్‌లో రూపొందించిన తొలి బడ్జెట్‌గా దీన్ని అభివర్ణిస్తూ యువతను కీలకంగా చేసుకొని భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ‘మూడు కర్తవ్యాలు’, ‘ఆరు దశల ప్రక్రియ’ను ఆమె ప్రకటించారు.
మూడు ప్రధాన కర్తవ్యాలు
ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చడానికి మూడు ముఖ్యమైన విధులను (కర్తవ్యాలను) ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.
1. ఆర్థిక వృద్ధి: అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాలకు అనుగుణంగా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం. ఉత్పాదకతను, పోటీతత్వాన్ని పెంచడం ద్వారా ప్రపంచ సవాళ్లను తట్టుకోగల సామర్థ్యాన్ని నిర్మించడం.
2. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం. వారిని కేవలం లబ్ధిదారులుగా కాకుండా భారతదేశ శ్రేయస్సులో బలమైన భాగస్వాములుగా మార్చేలా వారి నైపుణ్యాలను పెంపొందించడం.
3. సమ్మిళిత వనరుల పంపిణీ: ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ విజన్‌తో ప్రతి కుటుంబం, సమాజం, ప్రాంతానికి వనరులు అందేలా చూడటం.
‘నీరు, ఎనర్జీ, క్లిష్టమైన ఖనిజాల అవసరం పెరుగుతోంది. కొత్త సాంకేతికతలు ఉత్పత్తి వ్యవస్థలను మారుస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోనూ ఆశయాన్ని, సమ్మిళిత వృద్ధిని సమతుల్యం చేస్తూ భారతదేశం వికసిత్ భారత్ వైపు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తుంది’ అని నిర్మలా సీతారామన్ అన్నారు.
ఆరు దశల ప్రక్రియ
భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు బడ్జెట్‌లో ఆరు కీలక అంశాలపై దృష్టి సారించినట్లు కేంద్రమంత్రి చెప్పారు.
వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి: ఉత్పాదకత పెంపుదల.
యువశక్తి, ఉపాధి: యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పన.
మౌలిక సదుపాయాల కల్పన: ఆధునిక రవాణా, డిజిటల్ మౌలిక వసతులు.
సుస్థిర ఇంధనం: ఇంధన భద్రత, క్లీన్ ఎనర్జీ.
ఇన్నోవేషన్, పరిశోధన: టెక్నాలజీ రంగంలో స్వయం సమృద్ధి.
సమ్మిళిత అభివృద్ధి: అణగారిన వర్గాలు, పేదల సాధికారత.
ఇదీ చదవండి: Budget 2026: కేంద్ర బడ్జెట్‌కు వేళాయె..



