రేపటి బడ్జెట్‌ లీకైందా? సోషల్‌ మీడియాలో వైరల్‌ | PIB Fact Check On Union Budget 2026-27 Leaked Claims, Says Viral Social Media Are Fake, Check Post Inside | Sakshi
Sakshi News home page

రేపటి బడ్జెట్‌ లీకైందా? సోషల్‌ మీడియాలో వైరల్‌

Jan 31 2026 12:18 PM | Updated on Jan 31 2026 1:11 PM

Has Union Budget 2026 Leaked PIB Fact Checks Social Media Viral Images

కేంద్ర బడ్జెట్ 2026-27 (Union Budget 2026-27) మరికొన్ని గంటల్లోనే పార్లమెంట్‌ ముందుకు రానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. సంప్రదాయం ప్రకారం..  ఢిల్లీలోని పార్లమెంట్‌ భవనం నార్త్ బ్లాక్‌ బేస్‌మెంట్‌లో బడ్జెట్ ప్రింటింగ్ కోసం లాక్-ఇన్ పీరియడ్ ప్రారంభమైన తర్వాత హల్వా వేడుక కూడా జరిగింది.

ఇదిలా ఉండగా కేంద్ర బడ్జెట్ 2026-27 లీకైందని, కొత్త బడ్జెట్‌ స్కాన్‌ కాపీ మెసెంజర్‌ యాప్‌లో ప్రత్యక్షమైనట్లుగా అంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ న్యూస్‌ చక్కర్లు కొడుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పష్టతనిచ్చింది. లీక్ అయినట్టు చెబుతున్న కేంద్ర బడ్జెట్ 2026-27 వైరల్ చిత్రాలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ చేసి సోషల్ మీడియాలో షేర్ అవుతున్న చిత్రాలు నకిలీవని పేర్కొంది.

చలామణి అవుతున్న చిత్రాలలో ఒకటి కేంద్ర బడ్జెట్ 2026-27కు చెందినది కాదని, 2025-26 కేంద్ర బడ్జెట్ కు సంబంధించినదని తేల్చింది. దీనినే మొదటి పేజీని ఎడిట్‌ చేసి సంవత్సరం మార్చారని తెలిపింది. ఇక సర్క్యులేట్ అవుతున్న మరో చిత్రం పూర్తిగా డిజిటల్‌గా సృష్టించినదని, ఇది ఏ కేంద్ర బడ్జెట్ పత్రానికి చెందినది కాదని స్పష్టం చేసింది.  

‘కేంద్ర బడ్జెట్ కు సంబంధించిన ధ్రువీకరించని చిత్రాలు, వాదనలను నమ్మవద్దు. వాటిని ఫార్వార్డ్ చేయవద్దు. ఇటువంటి తప్పుడు సమాచారం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది. అనవసరమైన భయాందోళనలను వ్యాప్తి చేస్తుంది’ అని పేర్కొంది.

అప్పట్లో  నిజంగానే బడ్జెట్ లీక్
1950లో కేంద్ర బడ్జెట్‌ విషయంలో ఊహించని సంఘటన జరిగింది. అప్పట్లో మింటో రోడ్‌లో ఉన్న రాష్ట్రపతి భవన్ ప్రెస్ నుండి కేంద్ర బడ్జెట్ లీక్ అయింది. అప్పటి వరకూ బడ్జెట్‌ పత్రాలను ఇదే ప్రెస్‌లో ముద్రించేవారు. ఎప్పుడూ ఇలాంటి సంఘటన జరగలేదు. కానీ 1950లో బడ్జెట్‌ పేపర్లు లీక్ అయ్యాయి. దీంతో దేశంలోని అత్యంత ముఖ్యమైన ఆర్థిక పత్రాన్ని ముద్రించే స్థలాన్ని మరింత సురక్షితమైన ప్రదేశానికి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.

బడ్జెట్‌ పత్రాలు లీక్ అయిన సమయంలో జాన్ మథాయ్ దేశ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. కొంత మంది శక్తివంతమైన వ్యక్తుల ప్రయోజనాల కోసమే బడ్జెట్‌ను లీక్ చేశారన్న ఆరోపణలు ఆయనపై వచ్చాయి. కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత, ప్రణాళికా సంఘానికి నిరసనగా అప్పటి ఆర్థిక మంత్రి రాజీనామా చేశారు. ఆ తర్వాత చాలా ఏళ్లకు 1980లో బడ్జెట్‌ను ముద్రించే స్థలం మరోసారి మారింది. నార్త్ బ్లాక్‌లోని ప్రస్తుత స్థానానికి మార్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement