కేంద్ర తాజా బడ్జెట్‌లో ఆయనేమీ సాధించలేకపోయారంటున్న విశ్లేషకులు
బుల్లెట్ ట్రైన్ అన్నారు.. కనీసం రైలు కారిడారూ దక్కలేదు
రూ.2,066.32 కోట్ల అప్పులకు మాత్రం అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్డీఏలో కీలకంగా ఉన్నానని, తనవల్లే కేంద్రంలో మోదీ ప్రభుత్వం నడుస్తోందని చెప్పుకునే చంద్రబాబు మాటలన్నీ ఉత్తుత్తివేనని తేలిపోయింది. పైకి ఆయనెన్ని కబుర్లు చెప్పినా కేంద్రం మాత్రం చంద్రబాబును లెక్కలోకి తీసుకుంటున్నట్లు కనిపించడం లేదు. అందుకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్టే ఉదాహరణగా నిలుస్తోంది.
2024లో అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 27 సార్లు ఢిల్లీకొచ్చి కేంద్రానికి తాను చెప్పిందే వేదమన్నట్లుగా ప్రగల్భాలు పలికారు. తీరా ఈ బడ్జెట్ చూస్తే ఆయన మాటలన్నీ తుస్సే అన్నట్లుగా ఉంది. దీంతో ఎన్‌డీఏలో కీలకంగా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏమీ సాధించుకోలేకపోయారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
బుల్లెట్ ట్రైన్ ఎక్కడ చంద్రబాబూ?
2024లో అధికారం చేపట్టిన తర్వాత ప్రధానమంత్రిని కలిసి వచ్చిన తర్వాత చంద్రబాబు ఎల్లో మీడియాకు లీకులు ఇచ్చారు. 2026 కల్లా ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి నగరాలను అనుసంధానిస్తూ బుల్లెట్ ట్రైన్ పనులు పూర్తవుతాయన్నారు. తీరా 2026–27 బడ్జెట్‌లో ఏపీకి స్పీడ్ రైలు లేదా బుల్లెట్ రైలు వంటి వాటిల్లో దేనికీ ప్రాధాన్యత ఇవ్వలేదు. కనీసం విశాఖపట్నం–చెన్నై, విశాఖపట్నం–బెంగళూరు వంటి నగరాలకు స్పీడ్ రైలు కారిడార్‌ను సాధించడంలోనూ చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అప్పుల కేటాయింపులు రూ.2,066.32 కోట్లు
ఇక చంద్రబాబు ఢిల్లీకి వచి్చన ప్రతిసారీ అమరావతి రాజధాని నిర్మాణానికి చేయూతనివ్వాలంటూ కోరుతున్నారు. కేంద్రం మాత్రం బడ్జెట్‌లో నిధులు కాకుండా అప్పులు తెచ్చుకునేందుకు అనుమతులిచి్చంది. తాజా బడ్జెట్‌లో వివిధ అంతర్జాతీయ బ్యాంకుల అప్పుల ద్వారా కేటాయింపులు చేసింది.
వీటిలో అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు వరల్డ్ బ్యాంకు నుంచి రూ.432.09 కోట్ల అప్పు.. ఏపీ జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ప్రాజెక్టుకు జర్మనీ బ్యాంకు నుంచి రూ.155.32 కోట్లు.. ఏపీ రోడ్ అండ్ బ్రిడ్జెస్ రీ–కనస్ట్రక్షన్స్ ప్రాజెక్టుకు ఎన్‌బీడీ నుంచి రూ.350 కోట్లు.. ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టుకు ఏఐఐబీ నుంచి రూ.1,128.91 కోట్ల అప్పులకు కేంద్రం కేటాయింపులు చేసింది.
అంటే.. 2026–27 బడ్జెట్‌లో కేంద్రం చంద్రబాబుకు రూ.2,066.32 కోట్ల అప్పులకు అనుమతించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ బడ్జెట్‌లో చంద్రబాబును కేంద్రం పట్టించుకోలేదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
కూటమి ఎంపీలు మాత్రం ఆహా.. ఓహో..
ఇక కేంద్ర బడ్జెట్‌లో తాము సాధించింది ఏమీ లేకపోయినప్పటికీ టీడీపీ కూటమి ఎంపీలు మాత్రం ఆహా.. ఓహో అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. రాష్ట్రం మీదుగా పక్క రాష్ట్రాలకు రైల్వే కారిడార్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపితే.. ఇదేదో తాము సాధించిన గొప్పగా బిల్డప్ ఇస్తున్నారు.


