బడ్జెట్: బ్రీఫ్‌కేస్‌ నుంచి టాబ్లెట్ వరకు ఇలా.. | Briefcase To Tablet Know The Budget Evolution | Sakshi
Sakshi News home page

బడ్జెట్: బ్రీఫ్‌కేస్‌ నుంచి టాబ్లెట్ వరకు ఇలా..

Jan 30 2026 9:03 PM | Updated on Jan 30 2026 9:09 PM

Briefcase To Tablet Know The Budget Evolution

యూనియన్ బడ్జెట్ అనేది భారతదేశంలో కేవలం ఆదాయ-వ్యయాల లెక్కలు మాత్రమే కాదు. అది దేశ ఆర్థిక దిశను సూచించే ముఖ్యమైన పత్రం. అయితే స్వాతంత్య్రం రాకముందు ప్రారంభమైండ్ ఈ బడ్జెట్‌లో.. పార్లమెంటులో సమర్పించే విధానంలో కూడా కాలక్రమేణా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు బ్రీఫ్‌కేస్‌లో బడ్జెట్ పత్రాలను తీసుకెళ్లిన ఆర్థిక మంత్రులు, నేడు టాబ్లెట్ ద్వారా పూర్తిగా కాగిత రహితంగా బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ మార్పు వెనుక ఉన్న చరిత్ర, ఆలోచన, ఆధునికత మొదలైన విషయాలను ఈ కథనంలో చూసేద్దాం.

తొలినాళ్లలో.. భారతదేశపు తొలి ఆర్థిక మంత్రి ఆర్.కె. షణ్ముఖం చెట్టి బడ్జెట్ పత్రాలను బ్రీఫ్‌కేస్‌లో పార్లమెంటుకు తీసుకెళ్లారు. ఈ బ్రీఫ్‌కేస్ బ్రిటిష్ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచింది. బ్రిటన్‌లో అప్పటి ఆర్థిక మంత్రి విలియం ఎవార్ట్ గ్లాడ్‌స్టోన్ ఉపయోగించిన “గ్లాడ్‌స్టోన్ బాక్స్”కు అనుకరణగా ఇది ఉండేది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఈ సంప్రదాయం అలాగే కొనసాగింది. దశాబ్దాల పాటు చాలామంది ఆర్థిక మంత్రులు తమ బడ్జెట్ ప్రసంగానికి బ్రీఫ్‌కేస్‌తోనే వెళ్లడం ఆనవాయితీగా మారింది.

ఇదీ చదవండి: 2019 నుంచి 2025 వరకు: 8 బడ్జెట్లు.. 13 గంటలు!

కాలం మారింది.. ఆలోచనలు మారాయి. 2019లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బ్రీఫ్‌కేస్ సంప్రదాయానికి ముగింపు పలికారు. బ్రీఫ్‌కేస్ స్థానంలో భారతీయ సంప్రదాయానికి ప్రతీక అయిన 'బహి ఖాతా'ను ప్రవేశపెట్టారు. ఆ తరువాత 2021లో సీతారామన్ పూర్తిగా కాగిత రహిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 'మేడ్ ఇన్ ఇండియా' టాబ్లెట్‌ను ఉపయోగించి బడ్జెట్ పత్రాలను డిజిటల్ రూపంలో పార్లమెంటుకు సమర్పించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఆ టాబ్లెట్‌ను కూడా బహి ఖాతా ఆకృతిని తలపించే ఎరుపు రంగు కవర్లో తీసుకెళ్లడం విశేషం. ఇది సంప్రదాయం & ఆధునికత కలయికకు ప్రతీకగా నిలిచింది.

బడ్జెట్ మార్పుకు కారణం!
బడ్జెట్ సమర్పించడంలో మార్పు రావడానికి ప్రధాన కారణం.. కాగిత వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటం, డిజిటలైజేషన్ ద్వారా బడ్జెట్ పత్రాలను వేగంగా, సులభంగా అందరికీ అందుబాటులోకి తీసుకురావడం. అంతే కాకుండా.. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు అనుగుణంగా ప్రభుత్వ పనితీరును ఆధునీకరించడం అని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement