క్రూడ్‌ బాంబ్‌.. మార్కెట్‌ క్రాష్‌ | Sensex falls 2497 pts as West Asia war drives oil surge | Sakshi
Sakshi News home page

క్రూడ్‌ బాంబ్‌.. మార్కెట్‌ క్రాష్‌

Mar 20 2026 5:40 AM | Updated on Mar 20 2026 5:40 AM

Sensex falls 2497 pts as West Asia war drives oil surge

దలాల్‌ స్ట్రీట్‌.. కకావికలం

మరోసారి భగ్గుమన్న చమురు ధరలు  

ప్రపంచ ఈక్విటీ మార్కెట్లపై బేర్‌ ఎటాక్‌

2,497 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్‌ 

776 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ   

2024 జూన్‌ 24 తర్వాత అతిపెద్ద పతనం  

ఒక్కరోజులో రూ.12.87 లక్షల కోట్ల సంపద హుష్‌

ముంబై: అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు భగ్గుమనడంతో దలాల్‌ స్ట్రీట్‌లో అన్ని రంగాల షేర్లు దగ్ధమయ్యాయి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు, గ్యాస్‌ క్షేత్రాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ గురువారం పేకమేడలా కూలిపోయింది. క్రూడాయిల్‌ ధరలు మళ్లీ తారస్థాయికి చేరుకోవడం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తాత్కాలిక చైర్మన్‌ అతాను చక్రవర్తి రాజీనామా, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగడం తదితర అంశాలతో అమ్మకాలు వెల్లువెత్తాయి. 

ఫలితంగా సెన్సెక్స్‌ ఏకంగా 2,497 పాయింట్లు(3.26%) క్షీణించి 74,207 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 776 పాయింట్లు కుప్పకూలి 23,002 వద్ద నిలిచింది. 2024 జూన్‌ 24 తర్వాత ఇరు సూచీలకిదే అత్యంత భారీ పతనం కావడం గమనార్హం. స్టాక్‌ మార్కెట్‌ మూడు శాతానికిపైగా పతనంతో ఒక్కరోజే రూ.12.87 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. బీఎస్‌ఈలో లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.426 లక్షల కోట్లకు దిగివచ్చింది.  ఆసియా మార్కెట్లు 3%, యూరప్‌ మార్కెట్లు 2.50% పతనమయ్యాయి. అమెరికా స్టాక్‌ సూచీలు ఒకశాతం నష్టంతో ట్రేడవుతున్నాయి.  
  
అమ్మకాల సునామీ: అంతర్జాతీయ మార్కెట్ల  ప్రతికూలతలతో సూచీలు ఉదయమే భారీ నష్టాలతో మొదలయ్యాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో  ఒక దశలో సెన్సెక్స్‌ 2,753 పాయింట్లు క్షీణించి 73 వేల స్థాయి దిగువన 73,951 వద్ద, నిఫ్టీ 848 పాయింట్లు పతనమై 22,930 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి.  

→ బీఎస్‌ఈ ఇండెక్సుల్లో ఆటో 4.07%, రియల్టీ 3.79%, ఫైనాన్సియల్‌ సరీ్వసెస్‌ 3.66%  పతనయమ్యాయి. మిడ్, స్మాల్‌ క్యాప్‌లు వరుసగా 3.34%, 2.77% పడ్డాయి. సెన్సెక్స్‌లో 30 షేర్లూ నష్టాలతో ముగిశాయి. ఎటర్నల్‌(5.6%), బజాజ్‌ ఫైనాన్స్‌(5.4%), ఎంఅండ్‌ఎం(5.2%), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(5.1%), ఎల్‌అండ్‌టీ (4.7%) అత్యధికంగా నష్టపోయాయి.

పతనానికి ‘పంచ’ కారణాలు 
→ భగ్గుమన్న చమురు ధరలు: ఇరాన్‌ దాడులు తీవ్రం చేయడంతో గల్ఫ్‌ దేశాల్లో చమురు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థ పూర్తి గా స్తంభించిపోయింది. దీంతో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర మళ్లీ 119 డాలర్ల స్థాయికి తాకింది. ఇది భారతీయ ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుందనే ఆందోళనలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. 
→ విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు: యుద్ధ భయాలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడంతో విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. ఈ వారంలో కేవలం నాలుగు ట్రేడింగ్‌ సెషన్లలో మొత్తం రూ.24 వేల కోట్ల విలువైన దేశీయ ఈక్విటీలు విక్రయించారు. గురువారం ఒక్క రోజే రూ.7,558 కోట్లు అమ్మకాలకు పాల్పడ్డారు. గడిచిన 14 రోజులుగా ఎఫ్‌ఐఐలు నికర అమ్మకందారులుగా నిలుస్తున్నారు. 
→ ఫెడ్‌ వడ్డీరేట్లు యథాతథం: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్న ద్రవ్యోల్బణం అంశాలను కారణాలుగా చూపుతూ అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగా కొనసాగించింది. రానున్న కాలంలో వడ్డీ రేట్ల పెంపు సంకేతాలతో ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడ్డారు.
→  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్ల అమ్మకాలు:  ప్రైవేటు బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తాత్కాలిక ఛైర్మన్‌ అతాను చక్రవర్తి రాజీనామాతో బ్యాంకు షేరు ఇంట్రాడేలో బ్యాంక్‌ షేర్లు 8.7 శాతం మేర పతనమయ్యాయి. అధిక వెయిటేజీ కలిగిన స్టాక్‌ కావడంతో సూచీలపై ఆ ప్రభావం కనిపించింది.
→  లాభాల స్వీకరణ: పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్నా... దేశీ  సూచీలు గత మూడు ట్రేడింగ్‌ సెషన్లలో ర్యాలీ చేశాయి. సెన్సెక్స్‌ మొత్తం 2,140 పాయింట్లు(2.87%) ఎగసింది. క్రూడాయిల్‌ ధరలు మళ్లీ పెరగడం, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో ప్రతికూల సంకేతాల ప్రభావంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement