ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రభుత్వాలు రకరకాల పథకాలను ఆచరణలోకి తెస్తున్నాయి. పోను.. పోను.. వాటి కోసం ప్రజా ధనం కూడా విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఉచితాల విషయంలో విమర్శలు వినవస్తున్నా.. కోర్టులు అక్షింతలు వేస్తున్నా వెనక్కి మాత్రం తగ్గడం లేదు. రూ.46 వేలు జమ చేయడం కూడా ఇలాంటిదేమో అని అనుకునేవాళ్లు లేకపోలేదు.
ప్రస్తుతం మన దేశంలో అన్ని వయసులవారికి.. రకరకాల పథకాలు అమలు అవుతున్నాయి. వాటిల్లో చాలామందికి చాలావాటిపై అవగాహన ఉండడం లేదు. దీంతో.. ప్రభుత్వాలే అందుకు సంబంధించిన సమాచారాన్ని వివిధ మాధ్యమాల ద్వారా తెలియజేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇదే అదనుగా స్కామర్లు కూడా రెచ్చిపోతున్నారు.
సోషల్ మీడియా యూజర్లను, అమాయక ప్రజలను మోసం చేయడానికి ఎప్పటికప్పుడు కొత్త పన్నాగాలు పన్నుతున్నారు. ఇదే తరహా మోసం తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది ఎంతవరకు నిజం అనే విషయాన్ని.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వివరించింది. దీనికి సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లింక్‌పై క్లిక్ చేసి.. మీ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకుంటే ప్రభుత్వం నుంచి రూ. 46,715 పొందండి. ఇది నమ్మశక్యంగా అనిపించడం లేదా? మరోసారి ఆలోచించండి! అనే ఒక మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ పేదలకు రూ. 46,715 సహాయం అందిస్తోందట అని కొందరు మోసగాళ్లు ప్రచారం చేస్తున్నారు.
దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందిస్తూ.. ఆర్థిక మంత్రిత్వ శాఖ పేదలకు రూ. 46,715 సహాయం అందిస్తుందని వైరల్ అవుతున్న వార్తను ఎవరూ నమ్మకండి. ఇదంతా అబద్దం అని స్పష్టం చేసింది. ఇలాంటి ఒక పథకం గురించి ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించలేదని వెల్లడించింది.
ఫేక్ సందేశాల పట్ల జాగ్రత్త
సోషల్ మీడియాలో ఫేక్ సందేశాలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతో.. తప్పుడు లింక్స్ పంపించి.. డబ్బు దోచేస్తున్నారు. కాబట్టి తెలియని లింక్స్ లేదా తెలియని మొబైల్ నంబర్ల నుంచి వచ్చే ఎలాంటి లింక్స్ మీద క్లిక్ చేయకూడదు. మోసాల భారి నుంచి బయటపడటానికి ఉత్తమ మార్గం అపరిచిత లింకులపై క్లిక్ చేయకుండా ఉండటమే.
🚨Just click on the link & share your personal info to get ₹46,715 from the Govt 💸
Sounds too good to be true? Think again!
A #WhatsApp message claims that the Ministry of Finance is offering financial aid of ₹46,715 to the poor. #PIBFactCheck
🚫 This is a SCAM!
🚫… pic.twitter.com/FcmmBU56LS— PIB Fact Check (@PIBFactCheck) January 5, 2026


