దేశంలో పోస్టాఫీసులు అనేక రకాల పొదుపు పథకాలను అందిస్తున్నాయి. తమ భవిష్యత్తును భద్రపరచుకోవడానికి చాలా మంది ఈ పథకాలలో పెట్టుబడులు పెడుతుంటారు. పోస్టాఫీసు స్కీముల్లో పొదుపు చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే, స్థిరమైన, కచ్చితమైన రాబడిని పొందుతారు. ఈ పథకాలకు ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో వడ్డీ రేట్లను ప్రకటిస్తుంది. అలాగే జనవరి-మార్చి త్రైమాసికానికి చిన్న పొదుపు పథకాలకు వడ్డీ రేట్లను ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
ఇండియా పోస్ట్ దేశంలోనే అత్యధిక స్థాయిలో చిన్న పొదుపు పథకాలను నిర్వహిస్తుంది. పోస్టాఫీసులో ప్రతి వర్గానికి పథకాలు ఉన్నాయి. మహిళలు, పిల్లలు, సీనియర్ సిటిజన్ల కోసం వివిధ పోస్టాఫీసు స్కీములు ఉన్నాయి. 2026 సంవత్సరానికి గానూ అందుబాటులో ఉన్న ఉత్తమ పోస్టాఫీస్ పొదుపు పథకాలు.. వాటికి లభించే వడ్డీ రాబడి గురించి తెలుసుకుందాం..
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) అనేది సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న చిన్న పొదుపు పథకం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి అన్ని అగ్రశ్రేణి బ్యాంకులు అందించే ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్ల కంటే ఈ పథకంపై అధిక వడ్డీ లభిస్తుంది. ప్రస్తుతం 8.2 శాతం వడ్డీ రేటును ఈ పథకం అందిస్తోంది.
సుకన్య సమృద్ధి యోజన
సుకన్య సమృద్ధి యోజన (SSY) ఖాతా అనేది బాలికల కోసం ప్రత్యేక పొదుపు పథకం. బాలికల చదువు, భవిష్యత్తుకు భద్రత కల్పించడం కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. అప్పుడే పుట్టిన బాలిక దగ్గర నుంచి 10 ఏళ్ల వయస్సు వరకు అమ్మాయి పేరు మీద ఎస్ఎస్ వై ఖాతాను తెరవవచ్చు. ఈ పథకానికి ప్రస్తుత వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంది.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ (MSSC) అనేది మహిళలు, బాలికలు సురక్షితంగా పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించడానికి ఉద్దేశించిన పొదుపు కార్యక్రమం. పోస్టాఫీసులు, కొన్ని బ్యాంకుల్లో లభ్యమయ్యే ఈ పథకం స్థిర వడ్డీ ఆదాయంతోపాటు మూలధన సంరక్షణను అందిస్తుంది. రెండేళ్ల గరిష్ట కాల పరిమితితో ఉండే ఈ పథకాన్ని ప్రభుత్వం 2025 మార్చి 31తో నిలిపేసింది. అంతకుముందు ఖాతా తెరిచినవారికి ప్రస్తుతం 7.5 శాతం వడ్డీ లభిస్తోంది.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) అనేది దేశంలో మంచి ఆదరణ పొందిన, స్థిర-ఆదాయ పొదుపు పథకం. ఇది ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సి కింద కచ్చితమైన రాబడి, పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. ప్రభుత్వం నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లపై వడ్డీ రేటును 7.7 శాతంగా ఉంచింది.
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్ (POMIS) అనేది ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా గుర్తింపు పొందిన, ఆమోదించబడిన పెట్టుబడి పథకం. 7.4% వడ్డీ రేటుతో, ఇది అత్యధిక రాబడినిచ్చే పథకాలలో ఒకటి. ఈ పథకంలో వడ్డీ ఆదాయం నెలవారీగా చేతికొస్తుంది.


