ఉన్నతాధికారులతో సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి
అధికారులంతా జవాబుదారీతనంతో పనిచేయాలి
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
అధికారుల పనితీరును ప్రతి 3 నెలలకోమారు స్వయంగా సమీక్షిస్తా..
జనవరి 31 నుంచి కాగితాల ఫైళ్లు వద్దు.. అన్నీ ఈ–ఫైలింగ్‌లోనే ఉండాలి
అప్పటికల్లా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, రెగ్యులర్ ఉద్యోగుల వివరాలివ్వాలి
అద్దె భవనాలకు చెల్లుచీటీ.. కార్యాలయాలన్నీ ప్రభుత్వ భవనాల్లోనే ఉండాలన్న సీఎం
సచివాలయంలో మూడు గంటలకు పైగా భేటీ
సాక్షి, హైదరాబాద్: అధికారులంతా జవాబుదారీతనంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రస్తుత పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. పనితీరులో మార్పురాకపోయినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని శాఖల కార్యదర్శుల పనితీరును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతినెలా సమీక్షిస్తారని, తాను ప్రతి 3 నెలలకోమారు సమీక్షిస్తానని స్పష్టం చేశారు. పది రోజులకోమారు విధిగా ఐఏఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు.
అధికారులు, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోతే ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండవని అన్నారు. మంగళవారం సచివాలయంలో సీఎస్ కె.రామకృష్ణారావుతో కలిసి అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, సీఎంవో కార్యదర్శులతో దాదాపు 3 గంటలకు పైగా ఆయన సమావేశమయ్యారు. పలు సూచనలు చేయడంతో పాటు.. ప్రభుత్వం రెండేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూనే.. రాబోయే కాలంలో మరింత ముందుకు వెళ్లేందుకు దిశానిర్దేశం చేశారు.
‘విజన్’ అమలుకు నడుం బిగించాలి
‘గడిచిన రెండేళ్లలో ప్రజా ప్రభుత్వం కొన్ని విజయాలు సాధించింది. భవిష్యత్తు కోసం మరిన్ని ప్రణాళికలు రూపొందించింది. గతంలో ఇంధన, విద్య, నీటిపారుదల, ఆరోగ్య, పర్యాటక శాఖలకు ఒక విధానం అంటూ లేకపోవడంవల్ల సమస్యలు ఉత్పన్నం అయ్యాయి. ఈ సమస్యలను గుర్తించి కీలకమైన శాఖలకు నిర్దిష్ట విధానాలను తీసుకువచ్చాం. శాఖలతో పాటు రాష్ట్రానికి ఒక దిశ, విధానం ఉండాలన్న ఉద్దేశంతో‘ ‘తెలంగాణ రైజింగ్–2047’ విజన్ డాక్యుమెంట్‌ను ఇటీవల విడుదల చేశాం.
విజన్ అంటే కేవలం ప్రచారానికే పరిమితమనే అపోహను తిప్పికొట్టేలా, విజన్‌లో ఉన్న ప్రతి అంశం అమలు చేసేందుకు అధికారులు వెంటనే నడుం బిగించాలి. ఎంత గొప్ప కార్యాచరణ తీసుకున్నా అధికారుల సహకారం ఉండాలి. వారు జవాబుదారీతనంతో పనిచేయాలి. కార్యదర్శులు సీఎస్‌కు ప్రతి నెలా రిపోర్ట్ సమర్పించాలి. వాటిపై సీఎస్ శాఖల వారీగా సమీక్షలు చేస్తారు. సీఎస్ సమీక్షించి నాకు నివేదిక ఇస్తారు. మూడు నెలలకోసారి నేను సమీక్షిస్తా. సమన్వయం చేసుకుని పనిచేయడం అత్యంత కీలకం. అభివృద్ధి విషయంలో శాఖల మధ్య సమన్వయం చేసుకునేందుకు ఒక మెకానిజం ఏర్పాటు చేసుకోవాలి..’ అని సీఎం చెప్పారు.
ఉద్యోగుల పూర్తి వివరాలివ్వాలి
‘వివిధ ప్రభుత్వ విభాగాల్లో రెగ్యులర్, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు, పార్ట్‌టైమ్ ఉద్యోగులు 10 లక్షల మంది పనిచేస్తున్నారు. వారికి సంబంధించిన పూర్తి వివరాలు జనవరి 26వ తేదీలోగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కార్యదర్శులు ఇవ్వాలి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు, ఉద్యోగుల భవిష్య నిధికి జమ అయ్యే నిధులు, ఈఎస్‌ఐ సదుపాయం అందుతున్నాయో లేదో సంబంధిత శాఖల అధిపతులు క్షుణ్ణంగా పరిశీలించాలి. ఈ ప్రక్రియను జనవరి 26 లోగా పూర్తి చేయాలి. ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండడానికి వీల్లేదు. జనవరి 26వ తేదీలోగా అద్దె భవనాలు ఖాళీ చేసి ప్రభుత్వ భవనాల్లోకి మారాలి. ఖాళీ భవనాలు అందుబాటులో లేకపోతే, అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించాలి.
ఖాళీ స్థలాల్లో సొంత భవనాల నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలి. నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. రాష్ట్రంలో ఉన్న 113 మున్సిపల్ ఆఫీసులకు సొంత భవనాలున్నాయా? ఎక్కడెక్కడ అద్దె భవనాలున్నాయి.. వెంటనే గుర్తించి నివేదిక అందించాలి. ప్రజలకు సేవలందించే ఆఫీసులు పట్టణాల్లో అందరికీ అందుబాటులో ఉండేలా కొత్త భవనాలు నిర్మించాలి. ఇతర విభాగాలు, శాఖలకు చెందిన భవనాలు ఖాళీగా ఉంటే వాటిని వినియోగించుకోవాలి. ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ హాస్టళ్లు, అంగన్వాడీలు అన్నింటికీ సొంత భవనాలు ఉండేలా వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలి. అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుంది..’ అని ముఖ్యమంత్రి అన్నారు.
కేంద్ర పథకాల నిధులు సద్వినియోగం చేసుకోవాలి..
‘కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల (సీఎస్‌ఎస్) నుంచి వచ్చే నిధులను అన్ని శాఖలు సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు వాటాగా చెల్లిస్తే, కేంద్రం దాదాపు 60 శాతం ఈ పథకాలకు నిధులు ఇస్తోంది. ఈ పథకాలతో దాదాపు రూ.3 వేల కోట్లు తెచ్చుకునే వీలుంది. అందుకు వీలుగా అన్ని శాఖలు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ విభాగాలతో సంప్రదింపులు జరపాలి. సీఎస్‌ఎస్ నుంచి వచ్చే నిధులకు అవసరమైన రాష్ట్ర వాటాను ఆర్థిక శాఖ ఎప్పటికప్పుడు విడుదల చేయాలి.
కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు, వివిధ విభాగాలకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలి. వాటి పురోగతిని ప్రతి వారం సమీక్షించుకోవాలి. అన్ని ప్రభుత్వ శాఖలు జనవరి 31లోగా ఈ ఫైలింగ్ సిస్టమ్ అమలు చేయాలి. కాగితాలు, ఫైళ్లు పట్టుకొని తిరిగే పరిస్థితి ఉండకూడదు. అన్ని విభాగాలు తమ శాఖ పరిధిలోని కార్యక్రమాల అమలుకు సంబంధించి డాష్ బోర్డు సిద్ధం చేయాలి. డాష్ బోర్డును సీఎస్, సీఎంవో డాష్ బోర్డులకు అనుసంధానం చేయాలి. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గ్రౌండింగ్‌లో పురోగతిని ప్రతి నెలా సమీక్షించుకోవాలి. పరిశ్రమలకు అవసరమైన భూసేకరణ, భూ కేటాయింపులకు అవసరమైన మేరకు ప్రత్యేకంగా అధికారులను నియమించాలి..’ అని రేవంత్ సూచించారు.
పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి
‘కోర్ అర్బన్ ఏరియాలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి. కార్పొరేట్ తరహాలో సర్కారు స్కూళ్లలో హాజరు నమోదు శాతం పెంచేందుకు రవాణా సదుపాయం, బ్రేక్ ఫాస్ట్, మిడ్ డే మీల్స్ అమలు దిశగా ప్రణాళికలుండాలి. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నిట్లో టీచింగ్ ఆస్పత్రులను అద్భుతమైన వైద్యసేవలందించేలా తీర్చిదిద్దాలి. మెడికల్ కాలేజీల హాస్పిటళ్లను కూడా ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌ఎఫ్‌తో అనుసంధానం చేయాలి..’ అని సీఎం చెప్పారు.


