దాని పేరు స్పాట్.. బరువు దాదాపు ఒక జర్మన్ షెపర్డ్ కుక్కతో సమానం. అయితే ఇది కేవలం డాన్స్ వీడియోలతో వైరలైన రోబో శునకం కాదుసుమా.. ప్రస్తుతం ఇది అమెరికా, కెనడాలోని 60కి పైగా పోలీసు విభాగాలలో, అత్యంత ప్రమాదకరమైన మిషన్లలోకి దూసుకుపోతోంది. దీనిధర వింటే కళ్లు బైర్లు కమ్ముతాయి: ప్రాథమిక యూనిట్ ధర దాదాపు రూ.90 లక్షలు (100,000 డాలర్లు). అధునాతన అదనపు పరికరాలతో కలిపి ఇది రూ.2.2 కోట్లు (250,000 డాలర్లు) దాటిపోతుంది.
ప్రాణాపాయ మిషన్లలోకి ప్రవేశం
అయిదేళ్ల క్రితం ఆవిష్కరించిన ఈ నాలుగు కాళ్ల రోబో, ఇప్పుడు పోలీసుల అత్యవసర ఆపరేషన్లలో కీలకంగా మారింది. మానవ ప్రాణాలను పణంగా పెట్టాల్సిన చోట, స్పాట్ ముందుంటుంది. ప్రమాదకరమైన వస్తువులను తనిఖీ చేయడానికి, సాయుధ గ్యాంగ్‌స్టర్‌ల మధ్య చిక్కుకున్న బందీల రక్షణలో, రసాయనాలు చిందటం లేదా ప్రమాదకరమైన ప్రదేశాల సర్వేల్లో దీని సేవలు అపారం. ఒక హోస్టేజ్ రెస్క్యూ మిషన్ గురించి మసాచుసెట్స్ స్టేట్ పోలీస్‌కు చెందిన ట్రూపర్ జాన్ రగోసా చెబుతూ, ‘స్పాట్ ఒక ఆ దుండగుడిని ఎదుర్కొన్నప్పుడు, ’ఏంటీ కుక్క?’ అంటూ అవాక్కయ్యాడు’.. అని తెలిపారు.
‘స్పాట్’ ఏం చేయగలదంటే..
‘స్పాట్’ను ఒక టాబ్లెట్ కన్సోల్ ద్వారా నియంత్రించవచ్చు. ఈ రోబో సామర్థ్యాలు సంప్రదాయ చక్రాల రోబోల కంటే ఎంతో మెరుగ్గా ఉన్నాయి. ఎగిరి దూకడం, మెట్లు ఎక్కడం, జారే ఉపరితలాలపై నడవడం. మలి్టపుల్ కెమెరాల నుండి లైవ్ వీడియో స్ట్రీమ్ పంపడం, ఆటోమేటిక్‌గా అడ్డంకులను గుర్తించి, దారి మళ్లడం లాంటి సవాళ్లను అవలీలగా ఎదుర్కొంటుంది. తాళం వేసిన తలుపులను కూడా తెరవగలుగుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,000 స్పాట్ రోబోలు పనిచేస్తుండగా, భద్రతా ఏజెన్సీల నుండి డిమాండ్ అనూహ్యంగా పెరిగిందని బోస్టన్ డైనమిక్స్ వైస్ ప్రెసిడెంట్ బ్రెండన్ షుల్మాన్ తెలిపారు.
పోలీసు ప్రపంచానికి పెద్ద అండ
చివరికి, డ్యాన్స్ వీడియోలతో ప్రపంచాన్ని నవ్వించిన ఈ రోబో, ఇప్పుడు ఆధునిక పోలీసు వ్యవస్థ సంక్లిష్ట ప్రపంచంలోకి దూసుకుపోతూ, ఆవి ష్కరణకు, వివాదా నికి మధ్య నిలుస్తోంది. రూ.90 లక్షల ఈ ’రోబో డాగ్’ భవి ష్యత్తు పోలీసు ప్రపంచాన్ని పూర్తిగా మార్చబోతోందనేది మాత్రం నిస్సందేహం.
అంతులేని ప్రశ్నలు.. ఆందోళనలు
స్పాట్ ప్రవేశంతో సాంకేతికత ఎంత ఆశ కలిగిస్తోందో, అంతకు మించిన ప్రశ్నలు, భయాలు రేకెత్తుతున్నాయి. ఇది కేవలం సాంకేతిక ఆవిష్కరణ మాత్రమే కాదు, పోలీసు వ్యవస్థలో ఒక కొత్త శకానికి సంకేతం. న్యూయార్క్ పోలీసులు 2021లో స్పాట్‌ను ఉపయోగించడంపై నిరసనలు వెల్లువెత్తాయి. దాని అధిక ధర, నిఘా పాత్రపై ప్రజలు ఆందోళన చెందారు. నిరసనల కారణంగా తాత్కాలికంగా ఆపినా, తర్వాత కొత్తగా రెండు యూనిట్లు కొనుగోలు చేశారు. టెక్సాస్ ఏ అండ్ ఎం ప్రొఫెసర్ రాబిన్ మర్ఫీ మాట్లాడుతూ.. స్పాట్ చురుకుదనం గొప్పదే అయినా, రోబోటిక్ సాధనాల వాడకం పెరిగితే పోలీసులు ప్రజల నుండి మరింత దూరం అవుతారన్నారు. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ప్రొఫెసర్ ర్యాన్ కాలో మాట్లాడుతూ.. ‘అధికారులు ప్రాణాలను పణంగా పెట్టకూడదు, కానీ మనం రోబోటిక్ పోలీసు రాజ్యంగా మారకూడదు’.. అని హెచ్చరించారు.
– సాక్షి, నేషనల్ డెస్క్


