breaking news
Hostage situation
-
కలకలం.. గదిలో చిన్నారులు, మహిళలు నిర్బంధం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఫరుఖాబాద్‌లో కలకలం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో 15 మంది చిన్నారులు, మహిళలను గుర్తుతెలియని దుండగుడు నిర్బంధించాడు. పుట్టినరోజు పార్టీ అని పిలిచి.. పిల్లల్ని గృహ నిర్బంధం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. దాదాపు ఆరుగంటలుగా వారిని రక్షించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే పోలీసులు పెద్ద మొత్తంలో అక్కడికి చేరుకోవడంతో.. దుండగుడు పోలీసులపై గ్రనేడ్ విసిరాడు. ఈ దాడిలో ముగ్గురు పోలీసులతో సహా నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇంకా ఘటనా స్థలంలో పోలీసుల ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. తాజా ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తీవ్రంగా స్పందించారు. స్థానిక కలెక్టర్, పోలీసుశాఖతో మాట్లాడి.. ఘటనపై ఆరా తీశారు. -
మెల్బోర్న్లో ఉగ్రవాది కలకలం
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ పట్టణంలో కలకలం రేగింది. ఓ అపార్ట్మెంట్లోని బ్లాక్‌లో పేలుడు సంభవించడంతో పోలీసులు, భద్రతా బలగాలు ఉలిక్కి పడ్డారు. ప్రస్తుతం ఆ భవనంలో ఎవరో ఒక దుండగుడు కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు బలగాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఆ అపార్ట్మెంట్ వద్ద పెద్ద మొత్తంలో అత్యవసర సేవల విభాగం అధికారులు మోహరించారు. కొంతమంది లోపల ఉన్న వ్యక్తితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. లోపల ఉన్న ఆ వ్యక్తి కచ్చితంగా ఒక మహిళను బందీ చేసినట్లుందని అధికారులు చెబుతున్నారు. అతడు ఉగ్రవాది అయ్యుంటాడని అనుమానిస్తున్నారు. పెద్ద మొత్తంలో పోలీసులు రావడంతో దాదాపు ఆ అపార్ట్మెంట్ ఉన్న కాలనీలోని షాపింగ్ మాల్స్ మొత్తం మూసివేశారు. వివరాలు తెలియాల్సి ఉంది. -
నైట్ క్లబ్లో నరమేధం
అమెరికాలోని ఆర్లెండో ‘గే’ క్లబ్లో ఉన్మాది కాల్పులు 50 మందికి పైగా మృతి.. 53 మందికి గాయాలు గోడను పేల్చేసి ఆపరేషన్ చేపట్టిన పోలీసులు.. 30 మంది బందీలకు విముక్తి ఉన్మాది అఫ్గాన్ సంతతికి చెందిన ఒమర్ మతీన్‌గా గుర్తింపు ఇది ఉగ్రవాద చర్యే: ఒబామా; మా పనే: ఐసిస్ ఆర్లెండో: అది అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం.. ఆర్లెండో నగరంలో గే (స్వలింగ సంపర్కులు)ల కోసం వెలిసిన పల్స్ నైట్ క్లబ్.. సమయం.. ఆదివారం తెల్లవారుజాము 2 గంటలు..! కళ్లు చెదిరే కాంతులు, అదరగొట్టే బీట్ మధ్య క్లబ్లో అంతా ఉర్రూతలూగుతున్నారు.. మరికొద్ది సేపట్లో క్లబ్ మూస్తారనగా ఒక్కసారిగా ధన్.. ధన్.. ధన్..! ఓ ఉన్మాది వచ్చి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. అప్పటిదాకా సందడిగా ఉన్న క్లబ్ రక్తసిక్తమైంది. ఉన్మాది కాల్పుల్లో 50 మందికిపైగా చనిపోయారు. మరో 53 మంది గాయపడ్డారు. కాల్పుల విషయం తెలియగానే క్లబ్‌ను చుట్టుముట్టిన పోలీసులు ఉన్మాదిని మట్టుబెట్టారు. అతడిని అఫ్గాన్ సంతతికి చెందిన ఒమర్ మతీన్‌గా గుర్తించారు. క్లబ్ నుంచి 30 మంది బందీలను రక్షించారు. ఇది ఉగ్రవాద చర్యేనని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు. కాల్పులు తమ పనేనని ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రకటించుకుంది. ఉలిక్కిపడ్డ అమెరికా..: ఆర్లెండోలోనే శనివారం జరిగిన కాల్పుల్లో యూట్యూబ్ గాయని క్రిస్టినా గ్రిమ్మీ మరణించింది. ఇది మరవకముందే మరోసారి కాల్పులు జరగడంతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద కాల్పుల దుర్ఘటనగా చెబుతున్నారు. ఉన్మాది ఉన్నట్టుంటి కాల్పులకు తెగబడడంతో అనేక మంది ప్రాణభయంతో పరుగులు పెట్టారు. కొందరు బాత్రూముల్లో బిక్కుబిక్కుమంటూ గడిపారు. కాల్పుల్లో మొదట 20 మందే మరణించారని భావించినా.. చివరికి 50 మందికిపైగా చనిపోయినట్టు తేలింది. అయితే వీరంతా ఉన్మాది కాల్పుల్లోనే మరణించారా? లేక పోలీసుల ఎదురుకాల్పుల్లో ప్రమాదవశాత్తూ ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా అన్నది తెలియాల్సి ఉంది. గోడను పేల్చేసి.. ఆపరేషన్ కాల్పుల విషయం తెలియగానే పోలీసులు క్లబ్‌ను చుట్టుముట్టినా.. ఐదు గంటల వరకూ లోపలకు వెళ్లలేకపోయారు. పదుల సంఖ్యలో పోలీసు వాహనాలతో పాటు స్వాట్(స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ టీం) బృందాల్ని రప్పించారు. ఉన్మాదిని మట్టుపెట్టేందుకు ముందుగా క్లబ్ పరిసరాల్ని పూర్తిగా ఖాళీ చేయించారు. బందీల్ని విడిపించేందుకు ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయించారు. పేలుడు పదార్థాలతో గోడను పేల్చేసి అత్యాధునిక వాహనం ‘బేర్‌క్యాట్’తో స్వాట్ బృందాలు క్లబ్‌లోకి ప్రవేశించాయి. ఉన్మాదిని మట్టుబెట్టి దాదాపు 30 మందికి విముక్తి కల్పించాయి. గాయపడ్డవారిని ఆర్లెండో రీజినల్ మెడికల్ ఆస్పత్రికి తరలించారు. గస్తీ పోలీసును తప్పించుకొని.. ఆర్లెండో పోలీసు చీఫ్ జాన్ మినా కథనం ప్రకారం... మతీన్ రైఫిల్, హ్యాండ్‌గన్‌తో క్లబ్‌లోకి వెళ్లేందుకు యత్నించాడు. అయితే అక్కడ గస్తీ ఉన్న పోలీసు అధికారి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఇద్దరి మధ్య ఎదురుకాల్పులు జరగ్గా.. మతీన్ తప్పించుకొని క్లబ్‌లోకి వెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. ఒబామా ఉన్నతస్థాయి సమీక్ష కాల్పుల నేపథ్యంలో అధ్యక్షుడు బరాక్ ఒబామా భద్రతా అధికారులతో, ఉగ్రవాద నిరోధక విభాగాలతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ ఘటనతో ఇస్లామిక్ ఉగ్రవాదానికి ఏదైనా సంబంధముందా అన్న ప్రశ్నకు ఎఫ్‌బీఐ ప్రత్యేక ప్రతినిధి రాన్ హార్పర్ స్పందిస్తూ.. అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నామని చెప్పారు. ఉన్మాది ఉగ్రవాద సిద్ధాంతాలతో ప్రభావితం అయ్యాడా అన్నది కచ్చితంగా చెప్పలేమన్నారు. విదేశీ ఉగ్రవాద కోణంతోపాటు, దుండగుడు ఒక్కడేనా.. కాదా? అన్న కోణంలోను అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ‘గే ’లపై అసహ్యంతోనే..: మతీన్ తండ్రి ‘గే’లంటే అసహ్యంతో తన కొడుకు ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని మతీన్ తండ్రి మిర్ సిద్దిఖీ ఓ న్యూస్ ఛానల్‌కు తెలిపాడు. అంతేకానీ అతడు అవ లంబిస్తున్న ఇస్లాంకు సంబంధం లేదన్నాడు. మయామీలో ఒక గే జంట కౌగిలించుకోవడం చూసిన ఒమర్ ఇటీవల తన సమక్షంలో తీవ్రంగా విమర్శించాడని సిద్దిఖీ తెలిపాడు. ఫేస్బుక్ మెసేజ్‌లతో అప్రమత్తం ఒకవైపు కాల్పులు జరుగుతుండగా క్లబ్‌లోని అందరి ఫోన్లలో ఫేస్బుక్ మెసేజ్‌లు... ‘అందరూ క్లబ్ నుంచి పారిపోండి. పరుగెత్తండి ’ అంటూ పల్స్ క్లబ్ యాజమాన్యం ఫేస్బుక్లో అందరినీ అలర్ట్ చేసింది. ఉదయం ఆరుగంటలకు తీవ్ర విషాదంతో కూడిన మరో పోస్టు.. ‘ఏదైనా సమాచారం ఉంటే ఎప్పటికప్పుడు తెలుపుతాం. ఈ ఘోర దుర్ఘటనను ఎదుర్కొనేందుకు దయచేసి అంద రూ ప్రార్థించండి. మీ ఆలోచనలు, ప్రేమకు ధన్యవాదాలు’ అంటూ... కొద్ది రోజుల క్రితమే ఆర్లెండొ ఎల్జీబీటీ కమ్యూనిటీ వార్షిక గే సంబరాలు నిర్వహించుకుంది. గేల కోసం అమెరికాలో నిర్వహించే అతిపెద్ద ఉత్సవం ఇదే. క్లబ్ వెనక్కి పరిగెట్టాం: ప్రత్యక్ష సాక్షి రికార్డో ‘కాల్పులు మొదలగానే జనం కింద పడుకున్నారు. సీలింగ్పైకి కూడా కాల్పులు జరపడంతో లైట్లన్నీ ధ్వంసమయ్యాయి. ఒక్క నిముషమే కాల్పులు జరిగినా చాలా సేపు కొనసాగినట్లు అనిపించింది. మధ్యలో కొద్ది సేపు ఆగడంతో క్లబ్ వెనక్కి పరుగెట్టాం’ అంటూ మరో ప్రత్యక్ష సాక్షి రికార్డో నెగ్రాన్ వెల్లడించాడు. తప్పించుకున్న అక్కాచెల్లెళ్లు కెన్యా మిచెల్స్.. ప్యూర్టోరికోకు చెందిన డ్రాగ్ క్వీన్(గే క్లబ్‌ల్లో ప్రత్యేక నృత్యం చేసేవారు). తన సోదరి జాస్మిన్‌తో కలిసి స్టేజ్‌పైన ప్రదర్శనలిస్తోంది. ఇంతలో ఒక్కసారిగా కాల్పులు.. అదృష్టవశాత్తూ అక్కాచెల్లెళ్లిద్దరు కాల్పుల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఎవరీ మతీన్..? క్లబ్లో కాల్పులకు తెగబడ్డ ఒమర్ మతీన్‌ను అఫ్గాన్ సంతతికి చెందిన వాడిగా గుర్తించారు. అమెరికాలో స్థిరపడిన అఫ్గాన్ దంపతులకు 1986లో జన్మించిన ఇతడు.. ఫ్లోరిడాలోని పోర్ట్ సెయింట్ లూసీలో నివసిస్తున్నాడు. ఈ ప్రాంతం ఆర్లెండోకు రెండు గంటల ప్రయాణ దూరంలో ఉంది. ఒమర్‌కు ఇంతకుముందు ఎలాంటి నేర చరిత్ర లేదని సీబీఎస్ న్యూస్ ఛానల్ పేర్కొంది. ఇతడికి ఇస్లామిక్ ఉగ్రవాదంతో ఏమైనా సంబంధాలున్నాయా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ఒమర్ మతీన్‌పై గతంలోనే అమెరికా దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టాయని ద డైలీ బీస్ట్ పత్రిక పేర్కొంది. 2013, 2014లో ఇతడి కదలికలపై ఎఫ్ఐబీ దృష్టిసారించింది. ఒక దశలో మతీన్‌పై విచారణ ప్రారంభించిన ఎఫ్‌బీఐ.. తదుపరి విచారణ కోసం ఎలాంటి ఆధారాలు సమర్పించకపోవడంతో ఆ కేసును మూసివేయాల్సి వచ్చింది. డ్రమ్ బీట్ శబ్దం అనుకున్నా ప్రత్యక్ష సాక్షి హన్సన్ ‘అందరూ కాక్టైల్స్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. మధ్యలో స్టేజ్ పైకి డాలర్లు విసురుతున్నారు. కేరింతలు, కేక పుట్టించే మ్యూజిక్‌తో క్లబ్ సందడిగా మారింది. ఇంతలో రివాల్వర్ కాల్పుల శబ్దం. డ్రమ్ బీట్ శబ్దం అనుకున్నాం... ఆగకుండా వినిపించే వరకూ అవి రివాల్వర్ శబ్దాలని తెలియలేదు. ఇంతలో మా వైపుకు కాల్పులు జరగడంతో పరుగులు పెట్టాను’ అంటూ ప్రత్యక్ష సాక్షి క్రిస్టోపర్ హన్సన్ సీఎన్ఎన్కు తెలిపారు. లాస్ ఏంజెల్స్ కౌంటీలోనూ కాల్పుల కలకలం లాస్ ఏంజెల్స్: అమెరికాలోని లాస్ ఏంజెల్స్ కౌంటీలో 24 గంటల వ్యవధిలో జరిగిన కాల్పుల్లో ఏడుగురు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం కార్సన్ ప్రాంతంలో ప్రారంభమైన కాల్పులు శాన్ గేబ్రియల్ వ్యాలీ వరకూ కొనసాగాయి. లాస్ ఏజెంల్స్ టైమ్స్ కథనం ప్రకారం... శుక్రవారం మధ్యాహ్నం ఒక వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా దుండుగుడు కాల్పులు జరపగా... తీవ్ర గాయాలతో అతను మరణించాడు. ఆరు గంటల అనంతరం బైక్ వచ్చిన దుండగులు మరో ఇద్దరిపై కాల్పులు జరిపారు. ఇద్దరిలో ఒకరు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున కారుకు మరమ్మతులు చేస్తున్న వ్యక్తిని కాల్చి చంపారు. లాస్ఏంజెల్స్ కౌంటీలో జరిగిన మరో మూడు కాల్పుల ఘటనల్లో నలుగురు మరణించారు. ఈ కాల్పుల ఘటనలకు ఒకదానికొకటి సంబంధంలేదని పోలీసులు వెల్లడించారు.