సోయగాల చెంత..వనసమారాధనలు జరుపుకొందాం
ఆహ్వానం పలుకుతున్న పార్కులు, పర్యాటక ప్రాంతాలు
కార్తీకం స్పెషల్
కార్తీక సోయగం నగరపు హృదయాన్ని తాకగా, విశాఖ అందాలు ఇప్పుడు పచ్చని వనసమారాధనలకు ముస్తాబయ్యాయి. సముద్రపు గాలి పలకరింపు.. కొండల నడుమ ప్రకృతి ఆలింగనం.. దశాబ్దాలుగా మనకు పరిచయమైన కైలాసగిరి నుంచి కంబాలకొండ.. ముడసర్లోవ నుంచి తెన్నేటి తీరం వరకూ.. ప్రతి పార్కు ఈ మాసంలో ఆనందాల వేదికగా మారింది.
రుచికరమైన వనబోజనాలు, పిల్లల కేరింతలు, ప్రకృతి సోయగాల నడుమ సేదదీరాలనుకునే నగరవాసుల కోసం.. ఈ పర్యాటక ప్రాంతాలు ఆహ్వానం పలుకుతున్నాయి. వాటి ప్రవేశ రుసుములు, చేరుకునే మార్గాలు, అక్కడ దాగున్న ప్రత్యేక ఆకర్షణల వివరాలను తెలుసుకుందాం. –ఆరిలోవ
కార్తీక మాసం ప్రారంభం కావడంతో విశాఖ నగర వాసులు వన భోజనాలకు సిద్ధమవుతున్నారు. నగరంలో ముఖ్యంగా తూర్పు నియోజకవర్గ పరిధిలో ఉన్న పలు పర్యాటక ప్రాంతాలు పిక్నిక్ స్పాట్‌లుగా ఆకర్షిస్తున్నాయి. దశాబ్దాలుగా ప్రసిద్ధి చెందిన కైలాసగిరి, ముడసర్లోవ పార్కు, తెన్నేటి పార్కు, వుడా పార్కు, శివాజీ పార్కు, కంబాలకొండ ఎకో టూరిజం పార్కు, ఇందిరా గాంధీ జూలాజికల్ పార్కు వంటి ప్రదేశాలు కార్తీక మాసంలో సందర్శకులతో నిత్యం కళకళలాడుతుంటాయి. ఈ స్పాట్‌లలో పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు సమావేశాలు నిర్వహించుకోడానికి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
కైలాసగిరి
శివపార్వతుల కొలువులో సముద్రపు గాలిసొగసు
నగర పర్యాటక ప్రాంతాలలో కైలాసగిరి ఆణిముత్యంగా నిలిచింది. సముద్ర తీరంలో ఎత్తయిన కొండపై వీఎంఆర్‌డీఏ ఏర్పాటు చేసిన ఈ పార్కు దశాబ్దాలుగా సందర్శకులను ఆకర్షిస్తోంది. కార్తీక మాసంలో ఎక్కువ మంది సందర్శించే ఇక్కడ ప్రశాంత వాతావరణం, సముద్రపు గాలులు ప్రత్యేకం. ఇక్కడ ఉన్న శివపార్వతుల విగ్రహాలు, తెలుగు మ్యూజియం, కొత్తగా ఏర్పాటు చేసిన 3డీ, 9డీ పిక్చర్ హాల్, సర్క్యూట్ ట్రైన్ ప్రధాన ఆకర్షణలు.
వన భోజనాలకు విశాలమైన మైదాన ప్రాంతాలు అందుబాటులో ఉన్నాయి. కైలాసగిరికి రోడ్డు మార్గం, మెట్ల మార్గం ద్వారా చేరుకోవచ్చు. అప్పూఘర్, హనుమంతవాక వద్ద మెట్లు మార్గాలున్నా యి. ఆ మార్గం ద్వారా వెళ్లడానికి రూ.5 రుసుం చెల్లించాలి. కైలాసగిరి కూడలి నుంచి రోడ్డు మార్గం ద్వారా కార్లు, బస్‌లు, ద్విచక్రవాహనాలు ద్వారా కొండపైకి చేరుకోవచ్చు. దీంతో పాటు అప్పూఘర్ వద్ద ప్రైవేట్ ఆధ్వర్యంలో నిర్వహించే రోప్‌వే కూడా అందుబాటులో ఉంది.
ముడసర్లోవ పార్కు
పచ్చని కొండల మధ్య పల్లెటూరి పలకరింపు
ముడసర్లోవ పార్కు ఆరిలోవ ప్రాంతంలో బీఆర్‌టీఎస్‌ను ఆనుకొని, పచ్చని కొండల మధ్య ముడసర్లోవ రిజర్వాయరు పక్కన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంది. సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కులో సామూహిక వనబోజనాలు చేసుకోవడానికి విశాలమైన మైదాన ప్రాంతాలు అందుబాటులో ఉన్నాయి. బ్రిటిష్ కాలం నాటి చరిత్ర ఉన్న ఈ పార్కును జీవీఎంసీ నిర్వహిస్తోంది. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పార్కులో ప్రవేశ రుసుము పెద్దలకు రూ. 10, 12 ఏళ్ల లోపు పిల్లలకు ఉచితం.
కంబాల కొండ
పచ్చని కొండల మధ్య ట్రెక్కింగ్ వినోదం
జూ పార్కు ఎదురుగా, జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న కంబాలకొండ ఎకో టూరిజం పార్కు మరో ముఖ్యమైన పిక్నిక్ స్పాట్. ఆర్టీసీ బస్ కాంప్లెక్స్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ 265 ఎకరాల విస్తీర్ణంలో గల సహజసిద్ధమైన పార్కు చుట్టూ పచ్చని కొండలతో ఆహ్లాదాన్నిస్తుంది. విశాలమైన మైదానాల కారణంగా కార్తీక మాసంలో పలు యూనియన్లు, సంస్థలు, కుటుంబాలు వనబోనాలు చేసుకోవడానికి ఇది చాలా అనుకూలం. ఇక్కడ ట్రెక్కింగ్ (2, 3, 5 కి.మీ.), పిల్లల ఆట వస్తువులు అందుబాటులో ఉన్నాయి. ఈ పార్కులో ప్రవేశానికి పెద్దలకు రూ. 50, పిల్లలకు రూ. 20 చెల్లించాలి. కారుతో లోపలకు వెళ్లడానికి రూ. 1000 రుసుము ఉంటుంది. మధురవాడ వైపు వెళ్లే సిటీ బస్సులు, ఆటోల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.
జూ పార్కు
వన్యప్రాణుల వింత ప్రపంచం
ఆర్టీసీ బస్ కాంప్లెక్స్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలో, జాతీయ రహదారిని ఆనుకొని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్కు ఉంది. ఇది సహజ సిద్ధమైన వాతావరణంలో అనేక వన్యప్రాణులు, పక్షులతో సందర్శకులను ఆకట్టుకుంటుంది. ఇక్కడ పెద్ద పులులు, సింహాలు, ఏనుగులు, జిరాఫీలతో పాటు అనేక పక్షులు కనువిందు చేస్తాయి. ఈ పార్కులో పిల్లలు ఆడుకోవడానికి మైదాన ప్రాంతాలు ఉన్నాయి.
వన్యప్రాణులను చూసేందుకు జూ లోపల బ్యాటరీ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. వీటికి పెద్దలకు రూ. 70, పిల్లలకు రూ. 30 టికెట్ చెల్లించాలి. జూ ప్రవేశ రుసుము పెద్దలకు రూ. 70, పిల్లలకు రూ. 30గా నిర్ణయించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 25, 222 నంబర్ సిటీ బస్సుల్లో లేదా ఆటోల్లో ఇక్కడికి చేరుకోవచ్చు.


