సాక్షి,అనంతపురం జిల్లా: ఉరవకొండ నియోజకవర్గ టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ఓ సీఐని పోలీసుస్టేషన్‌లోనే నానా దుర్భాషలాడారు. విశ్వసనీయ సమాచారం మేరకు... నియోజకవర్గంలోని ‘కీలక’ పోలీసుస్టేషన్‌లో ఓ కేసు విచారణ నిమిత్తం సీఐ గురువారం డోనేకల్లు గ్రామానికి చెందిన టీడీపీ నేతలు, మోపిడి గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడితో పాటు మరికొందరిని పిలిపించారు. దీన్ని జీర్ణించుకోలేని సదరు నాయకులు ఒక్కసారిగా సీఐ చాంబర్‌లోకి వెళ్లి దుర్భాషలాడారు. ‘నీకు తల తిరుగుతోందా?! మమ్మల్నే స్టేషన్‌కు పిలిపిస్తావా? లం.. కొడకా’ అంటూ రెచ్చిపోయారు.
సీఐ చాంబర్‌లో సిబ్బందితో పాటు మరికొంత మంది వ్యక్తులు ఉన్నప్పటికీ వారు ఏమాత్రమూ వెనక్కి తగ్గకుండా దూషించారు. అనంతరం స్టేషన్ బయటకు వచ్చిన నేతలు ‘రేయ్.. ప్రభుత్వం మాది. మేం చెప్పినట్లు మూసుకుని వినండి. లేదంటే మీ తోకలు కత్తిరించి పోస్టింగ్ లేకుండా చేస్తాం. నా కొడకల్లారా’ అంటూ రెచ్చిపోయారు. ఈ ఘటనతో ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులకే చంద్రబాబు ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందని స్థానికులు చర్చించుకున్నారు. సీఐని దుర్భాషలాడిన నాయకులపై కేసుల నమోదుకు పోలీసులు సిద్ధమవుతుండగా.. కొంతమంది అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకుని సర్దిచెబుతున్నట్లు తెలుస్తోంది.


