
ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు(Benjamin Netanyahu) చేసిన పని ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ(UNGA) సమావేశాలకు హాజరయ్యేందుకు ఆయన న్యూయార్క్ వెళ్లారు. అయితే ప్రయాణంలో ఆయన యూరప్ గగనగలం కాకుండా.. సుదీర్ఘ మార్గంలో ప్రయాణించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
గాజా యుద్ధ నేపథ్యంతో.. అంతర్జాతీయ న్యాయస్థానం(International Court Of Justice) నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. యుద్ధ నేరాలకు పాల్పడ్డ ఆయన్ను అవకాశం దొరికితే అరెస్ట్ చేయొచ్చని అందులో సభ్యత్వం ఉన్న 125 దేశాలకు ఇంటర్నేషనల్ కోర్టు సూచించింది. దీంతో ఐక్యరాజ్య సమితి సమావేశాలకు హాజరు కావాల్సిన ఆయన యూరప్ దేశాల మీదుగా కాకుండా.. మరో మార్గంలో వెళ్లారనే చర్చ నడుస్తోంది.
ఫ్లైట్ ట్రాకింగ్ డాటా ప్రకారం.. ఆయన అధికారిక విమానం ‘వింగ్స్ ఆఫ్ జియాన్’ మధ్యధరా సముద్రం, జిబ్రాల్టార్ ద్వారం.. అట్లాంటిక్ మీదుగా న్యూయార్క్‌కు చేరుకుంది. ఈ క్రమంలో.. ఫ్రాన్స్, ఇటలీ, గ్రీస్ ఎయిర్‌స్పేస్‌ను తప్పించుకున్నట్లైంది. అయితే ఈ రూట్‌లో వెళ్లడం ద్వారా ఆయన అదనంగా 600 కిలోమీటర్లు ప్రయాణించారని సమాచారం.
ఇదిలా ఉంటే కిందటి ఏడాది కూడా ఆయన ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీకి హాజరయ్యారు. అయితే అప్పటికి నెతన్యాహుపై వారెంట్ జారీ కాలేదు. కానీ, ఆయన ప్రసంగిస్తున్న సమయంలో పలు దేశాల ప్రతినిధులు లేచి వెళ్లిపోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక అంతర్జాతీయ న్యాయస్థానం కిందటి ఏడాది నవంబర్‌లో నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలంట్‌లను యుద్ధనేరస్తులుగా పేర్కొంటూ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే ఈ అభియోగాలను ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది.
ఇదీ చదవండి: ఎవరు బతకాలో ఆయుధాలే నిర్ణయిస్తాయి!