గాజా: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. గాజాలోని హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులతో విరుచుకు పడింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ప్రాణనష్టం చోటు చేసుకుంది. అయితే, ఇజ్రాయెల్ ఇలాగే దాడుల్ని కొనసాగిస్తే పూర్తి స్థాయి యుద్ధం తప్పదని హమాస్ హెచ్చరికలు జారీ చేసింది.
గాజాలోని హమాస్ మిలిటెంట్ గ్రూప్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దళం దాడులు చేసింది. ఈ దాడుల్లో 24మంది పాలస్తీనీయులు మృతి చెందారు. వారిలో చిన్న పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. ఐదుగురు హమాస్ సీనియర్ సభ్యులు హతమయ్యారని ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించింది.
ఈ సందర్భంగా.. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉండగా.. తాము వైమానిక దాడులు చేయడానికి ప్రధాన కారణం హమాస్ అని ఇజ్రాయెల్ ఆరోపించింది. గాజా ప్రాంతంలో హమాస్ మిలిటెంట్లు తమ సైనికులపై కాల్పులు జరపడంతో, ఆత్మరక్షణ చర్యగా ఈ దాడులు జరిపినట్లు తెలిపింది.
తాజా సమాచారం ప్రకారం, ఇజ్రాయెల్–హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అక్టోబర్ 10, 2025న అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం దశల వారీగా కొనసాగుతుండగా.. నవంబర్ 13 నుండి 21 వరకు హమాస్ మిలిటెంట్లు కనీసం ఎనిమిది సార్లు ఉల్లంఘించినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ సైన్యం హమాస్ స్థావరాలపై దాడులు చేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.


