
మానవ చరిత్రలోనే ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు
యుద్ధాలను ఆపటంలో అంతర్జాతీయ సంస్థలు విఫలం
ప్రస్తుతం ఎవరు బతకాలో ఆయుధాలే నిర్ణయిస్తున్నాయి
ఐక్యరాజ్య సమితిలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ
యునైటెడ్ నేషన్స్: ప్రపంచ దేశాలన్నీ మానవ చరిత్రలో గతంలో ఎన్నడూ చూడనంతగా విధ్వంసకర ఆయుధాల రేసులో పరుగులు పెడుతున్నాయని ఉక్రెయిన్(Ukraine) అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ( Volodymyr Zelensky) విమర్శించారు. ప్రస్తుతం ప్రపంచంలో ఎవరు బతికి బట్టకట్టాలన్నది ఆయుధాలే నిర్ణయిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin).. ఉక్రెయిన్‌పై సాగిస్తున్న యుద్ధాన్ని యూరప్ ఖండం అంతటికీ విస్తరించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పుతిన్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం మొత్తం ఏకం కావాలని పిలుపునిచ్చారు. యుద్ధాలు ఆపటంలో ఐరాస విఫలం ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలను ఆపటంలో ఐక్యరాజ్య సమితితోపాటు అంతర్జాతీయ సంస్థలన్నీ విఫలమయ్యాయని జెలెన్‌స్కీ ఆరోపించారు.
ఉక్రెయిన్, గాజా(Gaza), సూడాన్.. ఇలా ఏ ఒక్క యుద్ధాన్ని ఆపలేకపోయాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశాలు మనుగడ సాగించటానికి అంతర్జాతీయ చట్టాలు ఏమాత్రం ఉపయోగపడటం లేదని మండిపడ్డారు. ‘స్నేహితులు, ఆయుధాలు ఉన్నవారికి తప్ప. ఇతరుల భద్రతకు ఎలాంటి హామీ లేదు’అని పేర్కొన్నారు. కలసి ఉంటే ఎంతో మార్పు తీసుకురాగలమని అన్నారు. రష్యాతో దాదాపు మూడేళ్లుగా సాగుతున్న యుద్ధంలో తమకు మద్దతుగా నిలిచిన అమెరికా, యూరప్ దేశాలకు జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలిపారు. యుద్ధాన్ని ఇంకా కొనసాగిస్తూ వెళ్తన్న రష్యా తీరును ఐరాస సభ్యదేశాలన్నీ ఖండించాలని కోరారు.
ఇది కూడా చదవండి: ఆ మూడు విధ్వంసాలపై దర్యాప్తు జరగాల్సిందే..
‘రష్యా వెంటనే యుద్ధాన్ని ఆపకపోతే.. మేము కూడా దీనిని మరింత విస్తరిస్తాం. మరింత విధ్వంసకరంగా మారుస్తాం. మొదట ఉక్రెయిన్‌పై దాడిచేసిన రష్యా.. ఇప్పుడు యూరప్ అంతటా తన డ్రోన్లను తిప్పుతోంది. రష్యా కార్యకలాపాలు ఎప్పుడు ఎల్లలు దాటాయి. జార్జియా, బెలారస్‌లాగా కాకుండా రష్యాకు జోక్యం నుంచి మాల్దోవా తనను తాను కాపాడుకుంటోంది. యూరప్ ఖండం మాల్దోవాను కూడా కోల్పోకూడదు. ఆ దేశానికి ఇప్పుడు కావాల్సింది రాజకీయపరమైన సానుభూతి కాదు. నిధులు, ఇంధన మద్దతు కావాలి’అని పేర్కొన్నారు.
డ్రోన్లతోనే వేలమంది హత్య
ప్రస్తుత యుద్ధాల్లో డ్రోన్లతోనే వేలమందిని ఎలా చంపాలో చూపిస్తున్నారని జెలెన్‌స్కీ అన్నారు. ‘ఇటీవల డ్రోన్ల కారణంగానే యూరప్‌లో విమానాశ్రయాలు మూసివేయాల్సి వచ్చింది. టాక్టికల్ డ్రోన్‌ను పరీక్షించినట్లు గత వారమే ఉత్తరకొరియా ప్రకటించింది. అతి తక్కువ వనరులు ఉన్న దేశాలు కూడా ప్రమాదకరమైన డ్రోన్లను తయారుచేస్తున్నాయి. ప్రస్తుతం మనం మానవ చరిత్రలోనే అత్యంత విధ్వంసకరమైన ఆయుధాల రేసు యుగంలో నివసిస్తున్నాం’అని పేర్కొన్నారు.