
ఐరాసలో తనకు ఎదురైన అనుభవాలపై ట్రంప్ గరం గరం
ట్రంప్ జనరల్ అసెంబ్లీకి వెళ్తుండగా ఆగిపోయిన ఎస్కలేటర్
ప్రసంగిస్తుండగా నిలిచిపోయిన టెలిప్రాంప్టర్
తన ప్రసంగం ఆడియో కూడా ఎవరికీ వినపడలేదన్న ట్రంప్
ఈ విధ్వంసాలకు ఐరాస సిగ్గుపడాలని
ట్రూత్ సోషల్‌లో ఆగ్రహం
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తనకు ఎదురైన చేదు అనుభవాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎస్కలేటర్, టెలీప్రాంప్టర్, ప్రసంగం సమయంలో ఆడియో ఆగిపోవటం యాదృచ్ఛికంగా జరిగిన పొరపాట్లు కాదని తన సొంత సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్ సోషల్‌లో బుధవారం అసహనం వ్యక్తం చేశారు. ఈ మూడు ఘటనలను ‘మూడు విధ్వంసాలు’అని పేర్కొన్న ఆయన.. ఆ ఘటనలపై లోతుగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలకు ఐక్యరాజ్యసమితి సిగ్గుపడాలని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అసలేం జరిగింది?
మూడు రోజుల క్రితం ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించేందుకు ఆ సంస్థ ప్రధాన కార్యాలయానికి ట్రంప్ వెళ్లారు. ఆయన ప్రధాన హాలులోకి వెళ్లేందుకు తన సతీమణి మెలానియా ట్రంప్‌తో కలిసి ఎస్కలేటర్ ఎక్కగానే అది ఆగిపోయింది. దీంతో వారు ఇద్దరు మెట్లు ఎక్కుతూ జనరల్ అసెంబ్లీ హాలులోకి వెళ్లారు. అక్కడ ప్రపంచ దేశాల ప్రతినిధులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగం ప్రారంభించగానే టెలిప్రాంప్టర్ (ప్రసంగ పాఠం కనిపించే తెర) ఆగిపోయింది. దీంతో ఆయన ప్రసంగ పాఠం లేకుండానే 57 నిమిషాలు ఉపన్యాసం కొనసాగించారు. 15 నిమిషాల్లోనే టెలిప్రాంప్టర్‌ను తిరిగి పునరుద్ధరించినప్పటికీ ఆయన సొంతంగానే ప్రసంగం కొనసాగించారు. అయితే, తన మాటలు హాలులోని ఎవరికీ వినపడలేదని ఆ తర్వాత తనకు తెలిసిందని ట్రంప్ తెలిపారు.
ఐరాస సిగ్గుపడాలి
ఈ సాంకేతిక పొరపాట్లపై ఐరాసపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఈ ఘటనలపై ఐరాస సిగ్గుపడాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఐరాసలో నిన్న (అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం) నాకు నిజమైన అవమానం జరిగింది. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు దురదృష్టకరమైన ఘటనలు జరిగాయి. అసెంబ్లీ హాలుకు వెళ్లేందుకు నేను, మెలానియా ఎస్కలేటర్ ఎక్కగానే అది ఆగిపోయింది. అదృష్టంకొద్ది మేము కిందపడలేదు. ఎస్కలేటర్ మెట్ల అంచులు చాలా పదునుగా ఉన్నాయి. కిందపడి ఉంటే ముఖానికి గాయాలయ్యేవి. మేము ఎస్కలేటర్ రెయిలింగ్ పట్టుకొని తమాయించుకున్నాం. లేదంటే ఇది పెద్ద విపత్తే అయ్యేది. తర్వాత నేను జనరల్ అసెంబ్లీలో ప్రసంగించేందుకు పోడియంపై నిలుచున్నాను.
నా ప్రసంగం వినేందుకు ప్రపంచవ్యాప్తంగా కోట్లమందితోపాటు హాలులో ప్రపంచ దేశాల ప్రతినిధులంతా ఆసక్తిగా చూస్తున్నారు. అప్పుడే నా టెలిప్రాంప్టర్ ఆగిపోయింది. నాకు ఏమీ అర్థంకాలేదు. వెంటనే నేను ఆలోచించాను. మొదట ఎస్కలేటర్, ఇప్పుడు టెలిప్రాంప్టర్.. ఏంటీ ఈ ప్రదేశం ఇలా ఉంది అనిపించింది. శుభ సమాచారం ఏమిటంటే.. టెలిప్రాంప్టర్ లేకుండానే నేను చేసిన ప్రసంగానికి మంచి రివ్యూలు వచ్చాయి. ఇలా చాలా కొద్దిమంది మాత్రమే చేయగలరు. ఇక మూడో విధ్వంస ఘటన నేను ప్రసంగం ముగించిన తర్వాత తెలిసింది.
నా ప్రసంగం హాలులో ఉన్నవారిలో ఇంటర్‌ప్రెటర్స్, ఇయర్‌పీస్‌లు పెట్టుకున్నవారికి తప్ప ఎవరికీ వినపడనేలేదు. ప్రసంగం పూర్తవగానే ఎలా ఉంది అని మెలానియాను అడిగాను. ఆమె ‘నాకు ఒక్క మాట కూడా వినపడలేదు’అని చెప్పారు’అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో రాసుకొచ్చారు. ట్రంప్ ఆరోపణలపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ స్పందించారు. జరిగిన ఘటనలు దురదృష్టకరమని పేర్కొన్నారు. ఒక వీడియోగ్రాఫర్ పొరపాటు వల్లే ఎస్కలేటర్ ఆగిపోయిందని వివరణ ఇచ్చారు. కాగా, ఎస్కలేటర్ ఆగిపోయినప్పుడు ఐరాస సిబ్బంది ఎగతాళిగా మాట్లాడుకోవటం కనిపించిందని మీడియాలో వార్తలు వచ్చాయి.