బాప్‌రే..! గాజాలో బయటపడ్డ అత్యంత భారీ టన్నెల్‌ | IDF Found Destroyed Biggest Tunnel Where Hadar Goldin was held | Sakshi
Sakshi News home page

బాప్‌రే..! గాజాలో బయటపడ్డ అత్యంత భారీ టన్నెల్‌

Nov 21 2025 7:26 AM | Updated on Nov 21 2025 8:49 AM

IDF Found Destroyed Biggest Tunnel Where Hadar Goldin was held

హమాస్‌ను అంతం చేసే లక్ష్యంతో గాజాలో ఇజ్రాయెల్‌ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణను ఉల్లంఘించి గాజా, లెబనాన్‌లో దాడులు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ భారీ సొరంగాన్ని ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) గుర్తించాయి. గాజాలో ఇప్పటిదాకా బయటపడ్డ అత్యంత భారీ సొరంగం ఇదే కావడం గమనార్హం. సుమారు 7 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ టన్నెల్‌లో హమాస్‌ కీలక నేతలు తలదాచుకోవడంతో పాటు ఇజ్రాయెల్‌ అమర సైనికుడు హదర్ గోల్డిన్‌ను ఇక్కడే బంధీగా ఉంచినట్లు నిర్ధారించుకున్నారు.

ఫిలడెల్ఫి కారిడార్ సమీపంలోని జనసాంద్రత గల నివాస ప్రాంతాల కిందుగా.. 25 మీటర్ల లోతుతో యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ కంపౌండ్, మసీదులు, క్లినిక్స్‌, స్కూళ్లు లాంటి సున్నితమైన ప్రాంతాల గుండా ఈ టన్నెల్‌ ఉంది. ఏకంగా ఓ నగరాన్నే నిర్మించుకున్నారని.. లోపల అత్యంతక్లిష్టమైన పరిస్థితులు ఉన్నట్లు ఇజ్రాయెల్‌ బలగాలు వెల్లడించాయి.

టన్నెల్‌ లోపల.. అందంగా గోడలను నిర్మించారు. వాటి నిర్మాణానికి టైల్స్‌ వాడారు. దాక్కోవడానికి వీలుగా సుమారు 80 గదులు, వెస్ట్రన్‌ టాయ్‌లెట్లతో కూడిన బాత్రూమ్‌లు, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లు, దీర్ఘకాలిక నివాసాలతో పాటు భారీగా ఆయుధ నిల్వలు గుర్తించారు. రఫా బ్రిగేడ్ కమాండర్ మహ్మద్ షబానె సహా హమాస్ సీనియర్ కమాండర్లు ఈ సొరంగాన్ని ఉపయోగించినట్లు నిర్ధారించుకున్నారు. అంతేకాదు.. ఈ సొరంగంలో గతంలో అపహరించబడిన ఐడీఎఫ్ అధికారి లెఫ్టినెంట్ హదర్ గోల్డిన్‌ను ఉంచినట్లు గుర్తించారు. ఆయనకు సంబంధించిన వస్తువులూ లభించినట్లు వెల్లడించారు.

యహలోమ్ యూనిట్, షయెటెట్ 13, 162వ డివిజన్, గాజా డివిజన్ బలగాలు కలిసి ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించాయి. ఈ ఆపరేషన్ ద్వారా గాజాలో హమాస్ ఉగ్రవాదుల భూగర్భ నెట్‌వర్క్ ఎంత విస్తృతంగా, ఎంత క్లిష్టంగా ఉందో మరోసారి బయటపడింది. ఆపై ఆ భారీ సొరంగాన్ని పూర్తిగా నాశనం చేసినట్లు ఐడీఎఫ్‌ ప్రకటించింది. గాజాలోని పౌరులపై ముప్పును తొలగించేందుకు సదరన్ కమాండ్ ఆధ్వర్యంలో ఆపరేషన్లు కొనసాగుతాయని ఈ సందర్భంగా ఐడీఎఫ్‌ ఉద్ఘాటించింది.  

 

హదర్ గోల్డిన్ విషాదం..

 

హదర్ గోల్డిన్(Hadar Goldin).. 1991లో సిమ్హా గోల్డిన్-డాక్టర్ లియా గోల్డిన్ దంపతులకు జన్మించారు. ఇజ్రాయెల్ రక్షణ దళాల (IDF) లెఫ్టినెంట్. 2014 గాజా యుద్ధంలో ఆపరేషన్ ప్రొటెక్టివ్ ఎడ్జ్‌లో ఆయన పాల్గొన్నారు. అమెరికా, ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన రెండు గంటలకే హమాస్ ఉగ్రవాదులు గోల్డిన్‌ను అపహరించారు. ఆపై తాజాగా బయటపడ్డ సొరంగంలో బంధించారు. అప్పటికి ఆయన వయసు 23 సంవత్సరాలు. అయితే..

సొరంగాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆయన హతమైనట్లు హమాస్‌ ప్రకటించింది(ఎప్పుడనేది స్పష్టత ఇవ్వలేదు). ఆ తర్వాత ఆయన మృతదేహాన్ని గాజాలో ఉంచారు. దాదాపు 11 ఏళ్లపాటు అతని తల్లిదండ్రులు పోరాటం చేశారు.  4,118 రోజుల తర్వాత(2025 నవంబర్ 9న) ఆయన మృతదేహం అవశేషాలు ఇజ్రాయెల్‌కు తిరిగి చేరాయి.  నవంబర్ 11న క్ఫార్ సాబా సైనిక సమాధి స్థలంలో అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి. ఇజ్రాయెల్‌ చరిత్రలో అత్యధిక కాలం బంధించబడిన సైనికాధికారిగా ఈయన పేరు చరిత్రలో నిలిచిపోయింది.  గోల్డిన్ కథ ఇజ్రాయెల్ సైనికుల త్యాగానికి ప్రతీకగా నిలిచిపోయింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement