
అలా చేయడమే మా పని
వ్యాపారవేత్త కావాలని చాలామంది మహిళలు కలలు కంటారు. అయితే చాలామందికి ఆ కలను ఎలా సాకారం చేసుకోవాలో తెలియదు. మహిళల కోసం ఎన్నో అవకాశాలు ఉన్నాయి. పేపర్‌పై ఉన్న ఆ అవకాశాల గురించి చాలామందికి తెలియదు. వారికి తెలిసేలా చేయడమే మా పని. ఇప్పటికే ఉన్న ప్లాట్‌ఫామ్‌లకు పోటీదారుగా కాకుండా అవసరంలో ఉన్నవారికి సహాయకురాలి పాత్ర పోషిస్తోంది మా ఫౌండేషన్. మహిళ వ్యాపారవేత్తలు, వివిధ ప్లాట్‌ఫామ్‌లకు మధ్య అంతరం లేకుండా చేస్తున్నాం. – రచన రంగనాథ్
‘మైక్రోఫైనాన్స్ రంగానికి మహిళలే వెన్నెముక’ అంటున్న రచన రంగరాజన్ వ్యాపారంలో ఓనమాలు తెలియని మహిళల నుంచి వ్యాపారంలో రెండడుగులు వేసిన మహిళల వరకు తన ఫౌండేషన్ ‘46 డబుల్ ఎక్స్’ ద్వారా దేశవ్యాప్తంగా ఎంతోమంది మహిళలకు స్ఫూర్తినిచ్చి ముందుకు నడిపిస్తోంది.ఆ సమావేశానికి పట్టణం, పల్లె అనే తేడా లేకుండా ఎక్కడెక్కడి నుంచో మహిళలు వచ్చారు. వారిలో ఎంటర్‌ప్రెన్యూర్‌గా తమ కలను నిజం చేసుకోవాలనుకుంటున్న మహిళలు, ఎంటర్‌ప్రెన్యూర్‌గా తొలి అడుగు వేసి విజయబావుటా ఎగరేయాలని కలలు కంటున్న మహిళలూ ఉన్నారు. వీరికి మాజీ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ రచన రంగరాజన్ మార్గనిర్దేశం చేసింది.
2020లో రచన ‘46 డబుల్ ఎక్స్’ ఫౌండేషన్ స్థాపించి ఎంటర్‌ప్రెన్యూర్ కావాలనుకునే ఎంతోమంది మహిళల కలలను నిజం చేసింది. 46 ఫౌండేషన్ మహిళల కోసం ఉచిత ఆన్‌లైన్ బిజినెస్ క్లాస్‌లు నిర్వహిస్తోంది. అంతేకాకుండా వారి వ్యాపార కల పట్టాలెక్కడానికి అవసరమైన సహకారాన్ని అందిస్తోంది.‘మన దేశంలోనే అతి పెద్ద డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయాలనే నా కలను 46 ఫౌండేషన్ ద్వారా సాకారం చేసుకున్నాను. మా లక్ష్యం ఒక్కటే... ఔత్సాహిక వ్యాపారవేత్తలు, ఎంటర్ ప్రెన్యూర్ కావాలనుకునే మహిళలకు తగిన సమాచారాన్ని అందించి అవసరమైన సహకారం అందించడం’ అంటుంది రచన. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌లో కెరీర్ మొదలుపెట్టిన రచన చిన్నా,పెద్దా తేడా లేకుండా ఎంతోమంది ఎంటర్‌ప్రెన్యూర్‌లతో కలిసి పనిచేసింది.
‘మనం తీసుకునే నిర్ణయాల మీదే ఒక వ్యాపారం విజయవంతం కావడమా, కాకపోవడమా అనేది ఉంటుంది. సరిౖయెన మార్గనిర్దేశకత్వంలో ఎన్నో వ్యాపారాలు విజయవంతం కావడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఆ స్ఫూర్తిని ఇతరులతో పంచుకోవాలనుకున్నాను’ అంటుంది రచన. అత్యంత విజయవంతమైన నమూనాలలో ఒకటిగా మైక్రోఫైనాన్స్ రంగం గురించి చెబుతారు. ఈ రంగాన్ని దగ్గరగా పరిశీలించిన రచన మైక్రోఫైనాన్స్ రంగం విజయవంతం కావడానికి కారణం మహిళలే అంటుంది.
‘బాధ్యతతో డబ్బులు తీసుకుంటారు. అదే బాధ్యతతో తిరిగి చెల్లిస్తారు. తమ కుటుంబాలను ఆర్థికంగా నిలబెట్టడానికి చిన్న చిన్న వ్యాపారాలు చేసి విజయం సాధించారు’ అంటుంది రచన. పంజాబ్ నుంచి అరుణాచల్‌ప్రదేశ్ వరకు మన దేశంలో ఎంతోమంది మహిళలకు స్ఫూర్తినిచ్చి దారి చూపించింది . 46ఫౌండేషన్.రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా 4000 వేలమంది మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌లకు చేరువ కావాలని ఫౌండేషన్ లక్ష్యంగా నిర్ణయించుకుంది.