
కేరళ చరిత్రలో చెరామాన్ పెరుమాళ్ ఒక పాలకుడు మాత్రమే కాదు; ఆధ్యాత్మిక అన్వేషణలో తన రాజ్యాన్నే త్యాగం చేసి చరిత్రలో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించుకున్న అరుదైన వ్యక్తి. ప్రాచీన చరిత్ర ప్రకారం, చెరామాన్ పెరుమాళ్ సుమారు 7 వ శతాబ్దం చివరి నుండి 8వ శతాబ్దం ప్రారంభకాలంలో కొడుంగల్లూరు రాజ్యాన్ని పాలించాడు. ఆ కాలంలో అరబ్ వ్యాపారులు మురిసిస్ తీరానికి తరచు వచ్చేవారు.
ఆ మార్గంలో మొదట అడుగు పెట్టిన వారు మాలిక్ బిన్ దీనార్ . ముహమ్మద్ ప్రవక్త (స) కాలంలో జీవించిన అరబ్బు సూఫీ పండితుడు. ఈయనే ఇస్లాం ధర్మాన్ని భారత తీరానికి తీసుకువచ్చిన తొలి సందేశ ప్రచారకుడిగా గుర్తించబడ్డాడు. అరేబియా ద్వీపకల్పంలోని మదీనా, బస్రా ప్రాంతాల్లో ఆయన ప్రముఖ మతబోధకుడిగా, ధార్మిక చింతనా పరుడిగా పేరు పొందాడు.
ఆయన కృషి ఫలితంగా కేరళలో ఇస్లాం సుగంధం పరిమళించింది. శాంతి సందేశం విస్తరించింది. భాష, సంస్కతి, ప్రేమ, సహజీవనం నలుదిక్కులా భాసించాయి. అందుకే ఆయన పేరు మలబార్ తీర్ర ప్రాంత గాలిలో ఇప్పటికీ వలయాలు వలయాలుగా తేలియాడుతూ ఉంటుంది. భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రను మార్చిన ఇస్లాం ధర్మ సందేశ ప్రచారకుల్లో ఆయన మొదటివారు. ఆయన ద్వారానే కేరళలో ఇస్లాం పరిచయం ప్రారంభమైందని చరిత్రకారులు భావిస్తారు.
షఖ్ఖుల్ ఖమర్: ఒకనాటి రాత్రి రాజు తన రాజ ప్రాసాదం నుండి చంద్రుడు రెండుగా చీలి మళ్ళీ కలిసిపోడం చూసాడు. ఆ దృశ్యం ఆయనను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. రాజు తరచుగా దాన్ని గురించి ఆలోచించేవాడు. తన దర్బారులోని పండితులను సంప్రదించినా సంతప్తికరమైన సమాధానం లభించలేదు. కొద్ది రోజులకు అరేబియా నుండి వచ్చిన వ్యాపారులు ఆయనను కలుసుకున్నారు. అప్పుడు రాజు ఆ సంఘటన గురించి వారిని అడిగాడు. దానికి వారు ఆ సంఘటన అరేబియాలో జరిగిందని, ముహమ్మద్ ప్రవక్త (స) తన వేలి సైగతో చంద్రుణ్ణి రెండుగా చీల్చిన అద్భుత ఉదంతాన్ని వినిపించారు. అది వినగానే చెరామాన్ పెరుమాళ్‌లో ఒక విధమైన ఆధ్యాత్మిక తపన మొదలైంది. తన రాజ్యాన్ని నమ్మకస్తులైన తన వారికి అప్పగించి, అరబ్ ధార్మిక పండితుడు మాలిక్ బిన్ దినార్, ఆయన సమూహంలోని ఇతర వ్యాపారులతో కలిసి అరేబియాకు ప్రయాణం ప్రారంభించి, సముద్ర మార్గాన మక్కానగరానికి చేరుకున్నాడు. ముహమ్మద్ ప్రవక్త (స) వారిని ప్రత్యక్షంగా కలుసుకొని ఆయన చేతుల మీదుగా ఇస్లాం స్వీకరించాడు. తరువాత తన పేరును ’తాజుద్దీన్’ గా మార్చుకున్నట్లు కేరళ, అరేబియా కథనాలు చెబుతున్నాయి. తిరుగు ప్రయాణంలో ఆయన ఓమాన్ లేదా యెమన్ ప్రాంతంలో అనారోగ్యం సంభవించి అక్కడే మరణించినట్లు చరిత్రకారుల అంచనా.
ఇదీ చదవండి: కేరళలో పెళ్లి వైరల్ : ఎన్‌ఆర్‌ఐలకు పండగే!
మరణానికి ముందు తన కొత్త విశ్వాసానికి సంబంధించిన రుజువుగా ఒక లేఖ రాశాడు. దాన్ని తీసుకొని మాలిక్ బిన్ దినార్ సహా పన్నెండు మంది అరబ్బు సహచరులు కేరళకు తీసుకువచ్చారు. ఆ లేఖను చేరరాజు వంశీకులైన అప్పటి కొడుంగల్లూరు పాలకులు గౌరవంతో స్వీకరించి, రాజ్యంలో మసీదులు నిర్మించడానికి, ఇస్లాం సందేశాన్ని ప్రచారం చేసుకోడానికీ అనుమతినిచ్చారు. ఆవిధంగా నిర్మించిన చేరమాన్ జుమా మస్జిదే భారత దేశంలో మొట్టమొదటి మస్జిద్ గా ప్రసిధ్ధి చెందింది. మాలిక్ బిన్ దినార్ కేవలం ఆ ఒక్క మసీదు మాత్రమే కట్టించలేదు. తర్వాత మలబార్ తీరమంతా తిరిగి, అనేక ప్రాంతాల్లో ధార్మిక కేంద్రాలను నెలకొల్పాడు. కోజికోడ్ నుంచి కన్యాకుమారి దాకా అనేక చిన్న పెద్ద మసీదులు, ఇస్లామీయ విద్యాకేంద్రాలు స్థాపించాడు. అవన్నీ ఆయన వారసత్వ చిహ్నాలుగా నేటికీ సజీవ సాక్ష్యంగా ఉన్నాయి.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్