
ఆధ్యాత్మికథ
అదొక పల్లెటూరు. ఊరి వెనుక ఒక పెద్ద గుట్ట ఉంది. ఊర్లోని ఒక భక్తుడికి ఆ గుట్టపైన గుడి కట్టాలనిపించింది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి గుడి నిర్మాణం పూర్తి చేశాడు.గుడి పక్కనే ఒక చిన్న పెంకుటిల్లు కట్టుకుని తల్లితో పాటు అక్కడే నివాసం ఉండే వాడు. గుడి, ఊరికి దూరంగా ఉండటంతోను, కష్టపడి గుట్ట ఎక్కాల్సి రావడంతోనూ గ్రామస్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చేవారు కాదు.
ఆ భక్తుడిలో బాధ, భయం మొదలయ్యాయి. కొండంత భారం మోయలేకపోతున్నానని తల్లితో చెప్పుకుని ఏడ్చాడు. అతడి బాధ చూసి ఆమె ‘కష్టాలు కలకాలం కాపురముండవు. మనకూ మంచి రోజులు వస్తాయి. నమ్మినవాళ్ళని భగవంతుడు ఎన్నటికీ విడిచి పెట్టడు’ అని ధైర్యం చెప్పేది.
పైకి గంభీరంగా ఉన్నా ఆమెలో కూడా బాధ లేకపోలేదు. హారతిపళ్ళెంలో పడే పైసలు చమురు ఖర్చులకే రావడం లేదని లోలోపలే ఆందోళన చెందేది. ‘అయినా ఇది దైవసేవ. దేవుడే మనకు దారి చూపుతాడు’ అని గట్టిగా నమ్మేది.
ఒకరోజు ఆమె గుడిపూజ సామానులు శుభ్రంగా కడిగి ఎత్తి పెడుతున్న సమయంలో హారతి పళ్ళెం గుట్ట బండరాయి మీద పడింది. పళ్ళెం పడిన చోట ఒక వీనుల విందైన రాగం ఆమెకు వినిపించింది. ‘ఇంతలో అయ్యో... పళ్ళెం సొట్టబోయిందే..’ అని బాధపడుతూ వచ్చాడు కొడుకు. కానీ ఆమె అలాగే బండరాయి మీద కూర్చుని చిన్న రాయి తీసుకుని కొట్టసాగింది. ఉన్న పళ్ళెం సొట్టపోయిందని బాధపడుతూ ఉంటే నువ్వేమి చేస్తున్నావని అడిగాడు. ఆమె చిన్నగా నవ్వింది. గుడి చుట్టూ ఉన్న బండరాళ్ళను రాతితో కొట్టి చూడసాగింది. తల్లి చేష్టలను వింతగా చూడసాగాడు కొడుకు. ఆమె గట్టిగా ‘‘మన కష్టాలు తీరిపోయాయి. గుడి పోషణ ఇక సులభం’’ అని చెప్పింది. ఆశ్చర్యపోతూ ఆమె దగ్గరికి వెళ్ళి ‘ఎలా?’’ అని అడిగాడు. ‘‘ఈ బండ రాళ్ళను కొట్టి చూస్తే, సరిగమపదనిసలు పలుకుతున్నాయి. వెంటనే శిల్పకళ గురువు స్థపతిని పిలిపించు. సప్తస్వరాల్లోని ఒక్కో రాగం పలికే బండను ఎంపిక చేసి వరుసగా పెట్టించాలి. ఆ రాగాలను పలికించడానికి ఒక రాయిని అందుబాటులో ఉంచాలి. వచ్చిన భక్తులు ఆసక్తిగా వీటిని కొట్టి సంతోష పడతారు’’ అని చెప్పింది. మారుమాట్లాడకుండా తల్లి చెప్పినట్లే చేశాడు.
ఆ విషయం ఆ నోటా ఈ నోటా పాకి చుట్టూ ఉన్న గ్రామాలకు చేరింది. మొదట పిల్లలు, ఆ తర్వాత యువకులు, చిన్నగా ఊరిజనం, చుట్టుపక్కల గ్రామస్తులూ గుట్ట ఎక్కడం ప్రారంభించారు. దైవ దర్శనం చేసుకుని సరిగమలు పలికిస్తూ సంతోషపడసాగారు. గుడి ఆదాయం చిన్నచిన్నగా పెరగసాగింది. తల్లీకొడుకు దేవుడికి నమస్కరిస్తూ ‘నమ్మినోల్లకు నమ్మినంత’ అనుకున్నారు.
– ఆర్.సి.కృష్ణస్వామి రాజు