ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)
ఫండే
పిల్లల కథ
పల్లమాల గ్రామంలో చెంగయ్య, బంగారమ్మ అనే రైతు దంపతులు ఉండేవారు. చెరువు కింద ఉన్న మూడు ఎకరాల మాగాణిలో వారు ఎంతో కష్టపడి వ్యవసాయం చేసేవారు. నాగలి, కాడి, పట్ర, పార, కొడవలి వంటి వ్యవసాయ పనిముట్లను పని ముగిసిన తర్వాత శుభ్రం చేసి ఒక గదిలో భద్రంగా ఉంచేవారు.
రాత్రిళ్లు ఆ పనిముట్లన్నీ తమ యజమాని గురించి మాట్లాడుకునేవి. ‘మన రైతు కష్టానికి తగిన ఫలితం రావాలి’ అని అన్నీ కోరుకునేవి. కానీ కాడికి మాత్రం గర్వం ఎక్కువ. ‘నాగలి, ఎద్దులు ఉన్నా నేను లేకుండా పొలం దున్నలేరు. అందరిలో ముఖ్యమైనది నేనే!’ అని విర్రవీగేది.
అప్పుడు పట్ర నవ్వుతూ, ‘బంగారమ్మ నీకే పసుపు రాసి బొట్టు పెట్టి నమస్కరిస్తుంది. నీ విలువ అందరికంటే ఎక్కువ కదా!’ అని అంది.
‘అది నాకిచ్చే గౌరవం కాదు. ఎద్దుల మెడకు గాయాలు కాకూడదనే వారి జాగ్రత్త అంతే!’ అని కాడి నిర్లక్ష్యంగా జవాబిచ్చింది.
మిగతా పనిముట్లన్నీ రైతు కష్టం, పంటల గురించి మాట్లాడుతుంటే, కాడి మాత్రం, ‘ఇకపై కష్టపడను. ఎప్పటికీ ఈ గదిలో హాయిగా విశ్రాంతి తీసుకునే ఉపాయం నాకు తెలుసు, తొందరలో చేసి చూపిస్తాను’ అని చెప్పింది.
ఒక రోజు కాడి దుక్కి దున్నుతున్న సమయంలో ముందు చెప్పినట్లే చేసింది. కావాలనే రెండుగా విరిగి పోయింది. చెంగయ్య దానిని గదిలో పెట్టి, కొత్త కాడిని తయారు చేయించుకున్నాడు.
‘ఇప్పుడు నాకు శ్రమ లేదు!’ అని కాడి సంతోషపడింది. కానీ మిగతా పనిముట్లు దాని మూర్ఖత్వానికి బాధపడ్డాయి.
కొన్ని రోజుల తర్వాత భోగి పండుగ వచ్చింది. భోగి పండుగ రోజు చెంగయ్య, ‘ధనయ్యా! గదిలో ఉండే విరిగిన కాడిని తీసుకురా. భోగి మంటలో వెయ్యి, బాగా మండుతుంది’ అన్నాడు.
ధనయ్య కాడిని భోగి మంటల్లో వేశాడు. మంటలు ఎగసి పడుతుండగా, గర్వంతో పని చేయకుండా తప్పించుకోవాలని చూసిన కాడి తన తప్పు తెలుసుకుంది. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. మంటల్లో కాలిపోతున్న దాన్ని చూసి మిగిలిన పనిముట్లన్నీ మౌనంగా బాధపడ్డాయి. అలా కాడి అలిగింది. భోగిలో కాలింది.
- పేరూరు బాలసుబ్రమణ్యం
ఇదీ చదవండి: ఇంటర్వ్యూలో సెలెక్ట్.. కానీ ఉద్యోగం ఇవ్వలేదు! కారణం తెలిస్తే షాకే!


