
బాలల కథ
అనగా అనగా ఒక అడవిలో పక్కపక్కనే రెండు రావిచెట్లు ఉండేవి. వాటి మీద పక్షులు గూళ్లు కట్టుకొని నివసిస్తున్నాయి. వాటిల్లో ఒక గుడ్లగూబ కూడా ఉండేది. అక్కడున్న పక్షుల్లో అదే పెద్ద వయసున్న పక్షి కావడంతో అప్పుడప్పుడూ మిగిలినవాటికి సలహాలు, సూచనలు ఇచ్చేది. ఆ మాటల్ని కొన్ని పక్షులు వినేవి. మరికొన్ని మాత్రం లక్ష్యపెట్టేవికావు.
రెండు రావిచెట్లు గుబురుగా పెరగడంతో ఒకదాని కొమ్మలు మరొక చెట్టుతో రాసుకుంటూ ఉండేవి. భారీ గాలివానలొచ్చినప్పుడు చెట్లు కూలిపోతాయేమో అన్నంతగా కదిలి΄ోయేవి. ఆ పరిస్థితి చూసిన గుడ్లగూబ ‘ఈ చెట్లు చాలా ఏళ్ల నాటివి. ఎప్పుడైనా ఇవి కూలి΄ోయే ప్రమాదం ఉంది. మనందరం కొత్త చెట్టు చూసుకోవాలి’ అని చెప్పేది. కొన్ని పక్షులు బద్దకంతో ‘తర్వాత చూసుకుందాం’ అన్నాయి. మరికొన్ని పక్షులు ‘నీదంతా చాదస్తం. మరో వందేళ్లయినా ఈ చెట్టుకు ఏమీ కాదు’ అని చెప్పాయి.
వానాకాలం మొదలైంది. కొద్దిగా జల్లులు కురుస్తున్న సమయంలో గుడ్లగూబ మరోసారి రెండు చెట్ల మీదున్న పక్షుల వద్దకు వెళ్లి–‘వానలు మొదలయ్యాయి. ఈ రెండు చెట్లు ఇప్పటికే బలహీనంగా తయారయ్యాయి. వాటి వేర్లు భూమిలోనుంచి బయటకు వచ్చేశాయి. వెంటనే మనమంతా మరో చెట్టు చూసుకుందాం’ అని చెప్పింది. కానీ ఎవరూ ఆ మాట లక్ష్యపెట్టలేదు. దీంతో చేసేదిలేక గుడ్లగూబ దగ్గర్లో ఉన్న మరో చెట్టు మీద కొత్తగా గూడు కట్టుకుని అక్కడికి వెళ్లిపోయింది. గుడ్లగూబ కొత్తగూడును చూసి కొన్ని పక్షులు నవ్వుకున్నాయి.
మరో నెల రోజుల తర్వాత వానలు ఉధృతంగా కురిశాయి. పక్షులు గూళ్లు వదిలి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. హోరుగాలికి రావిచెట్లు బలంగా ఊగి, వేర్లతో సహా కూలిపోయాయి. దీంతో చెట్టు మీదున్న పక్షుల గూళ్లన్నీ నీటిలో కొట్టుకుపోయాయి. ఆ కొమ్మల కిందపడి ఎన్నో పక్షులు మరణించాయి. మిగిలిన పక్షులు గూడ్లగూబ ఉన్న చెట్టు మీదకు చేరాయి. ఆ వర్షంలో గూడు కట్టుకునే వీలు లేక వానకు తడుస్తూ ఇబ్బంది పడ్డాయి. ముందే గుడ్లగూబ మాటలు విని ఉంటే తమకు ఈ అవస్థ వచ్చి ఉండేది కాదని, తమ మిత్రులు బతికేవారని అనుకొని బాధపడ్డాయి.