అప్రమత్తతే అసలైన రక్షణ..! | Health Tips: How to Reduce High Blood Pressure in Pregnancy | Sakshi
Sakshi News home page

అప్రమత్తతే అసలైన రక్షణ..!

Nov 1 2026 12:06 PM | Updated on Nov 1 2026 12:06 PM

Health Tips: How to Reduce High Blood Pressure in Pregnancy

ఓ గర్భిణి ఏడో నెలలో సాధారణ పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చారు. ఆమెకు కాళ్ల వాపులతోపాటు ఉదయం లేవగానే ముఖం కూడా కొద్దిగా ఉబ్బినట్లు అనిపించింది. ఈ విషయాన్ని సాధారణంగా భావించి నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం ముంచుకు రావచ్చు. అదే సమయంలో అప్రమత్తమై వైద్యులను సంప్రదిస్తే పెను ప్రమాదం నుంచి బయటపడొచ్చు. అందుకే గర్భిణులకు బీపీ పెరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

బీపీ పెరిగితే ఏం చేయాలి?
గర్భధారణలో కాళ్ల వాపులు, ముఖం ఉబ్బడం సాధారణమే అయినప్పటికీ, అలాగే తేలిగ్గా తీసుకుని వదిలేస్తే ప్రమాదమే! ఎందుకంటే వీటితోపాటు రక్తపోటు కూడా పెరిగితే తల్లీబిడ్డల ఆరోగ్యంపై ప్రభావం పడవచ్చు. ముఖ్యంగా ఏడో నెలలో బీపీ పెరిగినప్పుడు రక్తపోటును పదేపదే పరీక్షిస్తూ పరిస్థితిని అంచనా వేయాలి. 

అవసరమైతే ఆసుపత్రిలో చేర్పించి పర్యవేక్షించాలి. బీపీ నియంత్రణలో లేకపోతే వైద్యులు తగిన మందులను సూచిస్తారు. ఇంటి వద్ద పర్యవేక్షించాలని వైద్యులు సూచిస్తే, వారి సలహా మేరకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి బీపీని కొలిచి నమోదు చేసుకోవాలి.

ఈ లక్షణాలుంటే వెంటనే ఆసుపత్రికి!
చూపు మసకబారడం, తీవ్రమైన తలనొప్పి, మూత్రం తగ్గడం, వాపులు పెరగడం, కడుపులో తీవ్రమైన నొప్పి, బిడ్డ కదలికలు తగ్గడం, రక్తస్రావం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. వీటిలో ఏ లక్షణం కనిపించినా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. కొన్ని సందర్భాల్లో తక్షణ చికిత్స అవసరమవుతుంది.

తల్లీబిడ్డలకు ఎలాంటి పరీక్షలు?
బీపీ పెరిగిన గర్భిణులకు ప్రీ ఎక్లాంప్సియా ఉందేమో తెలుసుకోవడానికి వైద్యులు అవసరమైన పరీక్షలు నిర్వహిస్తారు. హిమోగ్లోబిన్, ప్లేట్‌లెట్‌ కౌంట్, కాలేయం, మూత్రపిండాల పనితీరును తెలిపే పరీక్షలతోపాటు మూత్రంలో ఆల్బుమిన్, ఎల్‌డీహెచ్‌ వంటి పరీక్షలు చేస్తారు. 

వీటి ద్వారా ఇతర అవయవాలపై ప్రభావం పడిందా అనేది అంచనా వేస్తారు. బిడ్డకు రక్తప్రసరణ తగ్గితే ఎదుగుదల మందగించడం, ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అందుకే స్కానింగ్, డాప్లర్‌ పరీక్షల ద్వారా బిడ్డ ఎదుగుదల, రక్తప్రవాహాన్ని పర్యవేక్షిస్తారు.

డెలివరీ ఎప్పుడు చేస్తారు?
ప్రసవ సమయం తల్లి, బిడ్డ ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. బీపీ తీవ్రంగా పెరగడం, ఫిట్స్‌ రావడం (ఎక్లాంప్సియా), కాలేయ పనితీరు దెబ్బతినడం, మావి గర్భాశయం నుంచి విడిపోయి రక్తస్రావం జరగడం లేదా బిడ్డకు ప్రమాదం ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తితే అత్యవసరంగా ప్రసవం చేయాల్సి రావచ్చు. 

తల్లీబిడ్డల పరిస్థితి స్థిరంగా ఉండి, బీపీ నియంత్రణలో ఉంటే వైద్యుల పర్యవేక్షణలో గర్భధారణను కొనసాగించవచ్చు. గర్భధారణలో బీపీ పెరిగిన ప్రతి ఒక్కరికీ ఒకే సమయంలో ప్రసవం చేయరు. పరిస్థితి తీవ్రతను బట్టి వైద్యులు సరైన సమయాన్ని నిర్ణయిస్తారు. కొన్ని సందర్భాల్లో 37 వారాలకు ప్రసవాన్ని ప్రణాళిక చేయవచ్చు.

హైరిస్క్‌ ఆసుపత్రి ఎందుకు?
ప్రసవ సమయంలో లేదా ఆ తర్వాత బీపీ అకస్మాత్తుగా పెరగడం, అధిక రక్తస్రావం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అందుకే అత్యవసర చికిత్స, రక్తనిధి, నిపుణుల బృందం అందుబాటులో ఉన్న హైరిస్క్‌ ప్రసూతి విభాగంలో ప్రసవం చేయించుకోవడం మంచిది.

తదుపరి గర్భధారణలో జాగ్రత్తలు
గత గర్భధారణలో బీపీ పెరిగినవారు తదుపరి గర్భధారణలోనే కాకుండా, గర్భం దాల్చే ముందే వైద్యులను సంప్రదించడం మంచిది. గత వైద్య చరిత్ర, ఇతర ప్రమాద కారకాలను బట్టి వైద్యులు తక్కువ మోతాదులో ఆస్పిరిన్‌  తీసుకోవాలని సూచించవచ్చు. 

అయితే వైద్యుల సలహా లేకుండా ఈ మందును వాడకూడదు. చివరగా, బీపీ పెరిగిందని భయపడాల్సిన అవసరం లేదు. కానీ నిర్లక్ష్యం మాత్రం చేయకూడదు. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం, వైద్యుల సూచనలు పాటించడం, ప్రమాద సంకేతాలను గుర్తించడం తల్లీబిడ్డల ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. 
డా. కప్పగంతుల అపర్ణ 
సీనియర్‌ గైనకాలజిస్ట్, అబ్‌స్టెట్రీషియన్, ల్యాపరోస్కోపిక్‌ సర్జన్, సికింద్రాబాద్‌

ఇదీ చదవండి: పెట్రోల్‌తో హెయిర్‌ వాష్‌!

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement