ఒక రైతు వయసు పైబడటం వల్ల కళ్లు సరిగా కనిపించడం లేదంటూ కంటి శుక్లాల ఆపరేషన్ కోసం వెళ్లాడు. అయితే అక్కడ వైద్యులు ప్రాథమిక పరీక్షలు చేయగా..అసలు విషయం తెలిసి కంగుతిన్నారు. అసలు అవి మానవుడికి ఎలా సోకుతాయి అని అనుకున్నారంతా..!
అసలు ఏం జరిగిందంటే..దక్షిణ కొరియాకు చెందిన 71 ఏళ్ల రైతు వయసు పైబడటం వల్ల కళ్లు ఎర్రబడుతూ, మసక మసకగా కనిపిస్తున్నాయని అనుకున్నాడు. దాంతో కంటి శుక్లాల ఆపరేషన్ చేయించుకుందామని ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ వైద్యుల పరీక్షలు చేయగా ఆ రైతు కంటిలో సజీవంగా ఉన్న పరాన్నజీవి పురుగులను గుర్తించారు. అతడు దృష్టి మసకబారడం, లోపల ఏవో ఇరుక్కుపోయి ఉన్నట్లు అనిపించడం వంటి లక్షణాలను ఎదుర్కొన్నట్లు చెప్పాడు.
అయితే వైద్య పరీక్షల్లో కనురెప్పలు, కనుగుడ్ల మధ్య ఖాళీలలో చిన్న పురుగులు కదులుతున్నట్లు గుర్తించారు వైద్యులు. దాంతో స్థానిక మత్తు మందు ఇచ్చి..ఏకంగా సజీవంగా ఉన్న 11 పారదర్శకంగా ఉన్న పురుగులను తొలగించారు. అవన్నీ ఏకంగా 120 మిల్లీమీటర్లు పొడవు ఉన్నాయి. అవి జంతువులలో సాధారణంగా కనిపించే పరాన్నజీవి అయిన గుండ్రపు పురుగు జాతి 'థెలాజియా కాలిపేడా' అని గుర్తించారు.
కొన్ని ఆడ పురుగులు ఫలదీకరణ చెందిన గుడ్లను కలిగి ఉండగా, మరికొన్ని అప్పటికే లార్వాలుగా అభివృద్ధి చెందాయి. ఆ పరాన్నజీవులు ఆ వ్యక్తి కళ్ల లోపల పునరుత్పత్తి పరిపక్వతకు చేరుకున్నాయని వెల్లడించారు. అయితే ఆ పురుగులను తొలగించడం ఆ రైతు కోలుకున్నాడని చెప్పారు. ఇలా కళ్లు ఎర్రబారడం, నీళ్లు కారడం లోపల ఏదో ఉన్నట్లు అనిపించడం వంటివి కనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించడం ఉత్తమం అని సూచిస్తున్నారు నిపుణులు.
మానవులకు ఇవి ఎలా సోకుతాయంటే..
కన్నీళ్లు, ఇతర కంటి స్రావాలపై ఆహారం తీసుకునే ఈగల ద్వారా థెలాజియా పురుగులు వ్యాపిస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ ఈగలు జంతువుల నుంచి మానవులకు సంక్రమణ కలిగించే లార్వాలను బదిలీ చేయగలవన్నారు. ఆ తర్వాత ఆ లార్వాలు కంటి లోపల వయోజన పురుగులుగా అభివృద్ధి చెందుతాయని అన్నారు.
కాగా, ఆ రైతుకి తదుపరి పరీక్షలు నిర్వహించగా మళ్లీ ఆ పురుగులు వచ్చినా సంకేతాలు కనిపించలేదన్నారు. అయితే ఆ రైతు అనుకున్నట్లుగానే శుక్లాల ఆపరేషన్ కూడా చేయించుకోవాల్సి ఉందని అన్నారు. అలాగే ఇతడి కేసు దీర్ఘకాలిక కంటి పరీక్షలు చేయించుకోవడం ప్రాముఖ్యతను కూడా హైలెట్ చేసిందన్నారు వైద్యులు.
ఇదీ చదవండి: చీరకట్టుతోనే వర్కౌట్స్..! నటి సంయుక్త హెగ్డే ఫిట్‌నెస్ పాఠాలు


