భౌగోళికంగా ఎలాంటి హద్దులూ లేవు | Iran Supreme Leader warns us Israel against new attacks | Sakshi
Sakshi News home page

భౌగోళికంగా ఎలాంటి హద్దులూ లేవు

Nov 1 2026 6:21 AM | Updated on Nov 1 2026 6:21 AM

Iran Supreme Leader warns us Israel against new attacks

అమెరికాపై తక్షణమే దాడులు జరపండి

సైన్యానికి ఇరాన్‌ సుప్రీం నేత మొజ్తాబా ఆదేశం

టెహ్రాన్‌: శత్రువు నుంచి ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా తక్షణమే ధీటుగా తిప్పికొట్టాలని, ఈ విషయంలో భౌగోళికంగా ఎలాంటి హద్దులు లేవని ఇరాన్‌ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ శనివారం తమ సాయుధ బలగాలకు పిలుపునిచ్చారు. శనివారం ఆయన టెలిగ్రామ్‌లో ఈ విషయం స్పష్టం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్‌లకు చెందిన అన్ని రకాల ఆస్తులను దాడుల పరిధిలోకి తెచ్చేలా లక్ష్యాల జాబితాను అప్‌డేట్‌ చేయాలని ఆయన మిలటరీని ఆదేశించారు. 

శత్రువు తిరిగి సైనిక, ఉగ్ర దాడులను ప్రారంభించిన పక్షంలో ముగించే విషయం ఇక ఇరాన్‌ చేతుల్లోనే ఉంటుందని ఖమేనీ వ్యాఖ్యానించారు. మళ్లీ యుద్ధానికి అవసరమయ్యే ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉత్పత్తిని పెంచాలని, సైనిక నిఘాను బలోపేతం చేయాలని, స్వదేశీ రక్షణ సామర్థ్యాలను మరింతగా అభివృద్ధి చేయాలని సాయుధ దళాలకు ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్‌పై త్వరలోనే తీవ్ర స్థాయిలో దాడులు తప్పవంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదేపదే హెచ్చరికలు చేస్తున్న వేళ ఇరాన్‌ నాయకత్వం ఈ మేరకు స్పందించింది. 

ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్‌ల మధ్య ఉద్రిక్తతలు, సౌదీ అరేబియాపై యెమెన్‌లోని హౌతీ రెబెల్స్‌ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడులకు పాల్పడుతున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. శాంతియుత వాతావరణం నెలకొల్పే క్రమంలో ఇటీవల టెహ్రాన్‌లో సౌదీ, తుర్కియే, పాక్‌ ప్రతినిధులు ఇరాన్‌ నాయకత్వంతో చర్చలు జరిపారు. సయోధ్య కుదిర్చేందుకు శుక్రవారం ఖతార్‌ ప్రతినిధి బృందం సైతం టెహ్రాన్‌కు చేరుకుంది. అయితే, అణు కార్యక్రమం, హార్మూజ్‌ దిగ్బంధనం వంటి అంశాలపై ఇరాన్‌ పట్టువీడలేదని సమాచారం. మరోసారి యుద్ధమే జరిగితే తీవ్ర వినాశనం తప్పదని, ఎవరూ దాని నుంచి తప్పించుకోలేరని ఈజిప్టు విదేశాంగ మంత్రి బదర్‌ అబ్దెలట్టీ ఈ పరిస్థితుల్లో హెచ్చరికలు చేయడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement