పులివెందుల పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్న ఆయేషా, బంధువులు
వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై టీడీపీ మూకల దాడులు
వినుకొండలో వైఎస్సార్‌సీపీ నేతల అక్రమ అరెస్టు
చేత్తో రివాల్వర్ పట్టుకుని సీఐ వీరంగం
నాయుడుపేటలో మద్యం బాటిళ్లు పెట్టించి అక్రమ కేసు
జమ్మలమడుగులో కార్లు ధ్వంసం
పులివెందులలో ఏజెంట్ల అక్రమ అరెస్టు
విజయనగరం ఐదవ డివిజన్ అభ్యర్థిపై బ్లేడ్లతో దాడి
హొళగుందలో టీడీపీ రెబల్ అభ్యర్థికి ఎస్‌ఐ బెదిరింపులు
వెన్నుపోటు పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న పోలీసులపై విమర్శలు
సాక్షి, అమరావతి/పులివెందుల రూరల్/విజయనగరం టౌన్ : వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు.. వేసిన నామినేషన్లను స్క్రూటీనీలో ఇష్టానుసారం ఏకపక్షంగా తీసేశారు.. ఈ అడ్డంకులు దాటుకుని బరిలో నిలిచిన వారిని కూడా ప్రచారం చేయనీయకుండా టీడీపీ గూండాలు పచ్చ ప్రతాపం చూపించారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోరుకు శుక్రవారం ప్రచారం ముగిసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం మొదలైంది. ఈ రెండు స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల బరిలో నిలిచిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు కనీసం ఓటు అడిగే అవకాశం కూడా లేకుండా అధికార పార్టీ నేతలు దారుణంగా అడ్డుకున్నారు.
వెన్నుపోటు పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన పోలీసులు అనేక సాకులు చూపి వైఎస్సార్‌సీపీ నేతలు, అభ్యర్థులను ఇబ్బందులపాలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనేందుకు ఎన్నో ఘటనలు నిదర్శనంగా నిలిచాయి. పల్నాడు జిల్లా వినుకొండలో ప్రచార వాహనాల డ్రైవర్ల మధ్య జరిగిన గొడవకు రాజకీయ రంగు పులిమిన పోలీసులు వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు పెట్టి అరెస్టుల వరకు వెళ్లడం ఉద్రిక్తతకు దారితీసింది.
వినుకొండలో టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రచార రథం డ్రైవర్‌కు, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ప్రచార ఆటో డ్రైవర్‌కు మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనను ఆసరాగా చేసుకుని వైఎస్సార్‌సీపీ నాయకులపై హత్యాయత్నం నేరం మోపేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. టీడీపీ ప్రచార వాహన డ్రైవర్‌ను హత్య చేయించేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రయత్నించారంటూ ప్రచారం చేశారు. ఈ వ్యవహారంలో వినుకొండ టౌన్ సీఐ ప్రభాకర్ వైఎస్సార్‌సీపీ నాయకులను అరెస్టు చేయడంతో పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల తీరును నిరసిస్తూ మహిళలు పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు.
డ్రైవర్ల మధ్య జరిగిన గొడవకు రాజకీయ రంగు పులిమి వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసులు నమోదు చేస్తున్నారని మహిళలు మండిపడ్డారు. ఈ క్రమంలో సీఐ ప్రభాకర్ ఒక చేతిలో రివాల్వర్, మరో చేతిలో లాఠీ పట్టుకుని నిరసనకారులను భయభ్రాంతులకు గురిచేస్తూ బెదిరింపులకు దిగడం శోచనీయం. వినుకొండలో ముస్లిం యువకులను అరెస్టు చేసిన సీఐ ప్రభాకర్.. వారిని బొల్లాపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు.
కాగా, తిరుపతి జిల్లా నాయుడుపేట అర్బన్ సీఐ వెంకటరమణ పచ్చ చొక్కాలకు దాసోహం అంటున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఆయన వైఎస్సార్‌సీపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కామిరెడ్డి రాజారెడ్డి నివాసంలో 87 మద్యం బాటిళ్లను తన సిబ్బందితో పెట్టించి, అక్రమ కేసు బనాయించారు. తన ఇంట్లో ఏం జరిగిందో సీసీటీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా ఉందని రాజారెడ్డి పేర్కొనడం.. వైఎస్సార్‌సీపీ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో సీఐ ఉడాయించారు.
జమ్మలమడుగులో దాడులు
వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్సార్‌సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని టీడీపీ గూండాలు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీ నేతల కార్లను ధ్వంసం చేశారు. ఈ దాడులకు నిరసనగా జమ్మలమడుగులోని పాతబస్టాండ్ సర్కిల్ వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టాయి. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, చైర్‌పర్సన్ అభ్యర్థి హైమావతి తదితరులు పాల్గొని ప్రభుత్వ తీరుపై, దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మలమడుగులో 8వ వార్డుకు చెందిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి ఓటెయ్యాలని ఎస్సీ కాలనీలో ప్రచారం నిర్వహిస్తుండగా కూటమి కౌన్సిలర్ అభ్యర్థితోపాటు పలువురు మూకుమ్మడి దాడి చేశారు. ఈ ఘటనలో 15 మంది గాయపడ్డారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులను అడ్డుకుని, దాడులకు పాల్పడటంపై వైఎస్సార్‌సీపీ తీవ్రంగా తప్పుబట్టింది.
అన్యాయంగా అరెస్టు చేశారు
పులివెందుల పట్టణంలోని బ్రాహ్మణపల్లె రోడ్డు శేషారెడ్డి పాఠశాల సమీపంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఇబ్రహీం, మారుతిలను శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. తన భర్తను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారని ఇబ్రహీం భార్య ఆయేషా, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏజెంట్లుగా కూర్చుంటున్నారని తెలుసుకుని టీడీపీ నాయకులు చిన్న గూగూడు, హోలీ బాబాలతోపాటు కెరికిరి బాషాలు పోలీసులను వారి ఇంటి వద్దకు పంపి అరెస్ట్ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్తను చూపించాలని ఆయేషాతోపాటు బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
కార్పొరేటర్ అభ్యర్థిపై దాడి
విజయనగరం కార్పొరేషన్ ఐదో డివిజన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న కోట మహంతి శ్రీనివాసరావుపై గుర్తు తెలియని దుండగులు శుక్రవారం రాత్రి దాడికి పాల్పడ్డారు. ఆయన కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. ఎడమ చేతిపై బ్లేడులతో కోయడంతో రక్తస్రావం అయింది. ఈ ఘటనపై కార్యకర్తలు, కుటుంబ సభ్యులు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బైక్‌పై వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వ్యాసనారాయణ మెట్ట వద్ద దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘నీ కెందుకురా పోటీ.. అవసరమా?’ అంటూ దుండగులు బ్లేడ్‌లతో దాడి చేశారని, గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు రావడం చూసి బైక్‌పై పరారయ్యారని శ్రీనివాసరావు తెలిపారు. మహారాజా ప్రభుత్వాస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.
హొళగుందలో టీడీపీ హైడ్రామా
కర్నూలు జిల్లా హొళగుందలో ఎన్నికల రాజకీయాలు ఉద్రిక్తతకు దారితీశాయి. టీడీపీ రెబల్ అభ్యర్థిగా జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేస్తున్న ఈడిగ గోవిందుగౌడ్ ఇంటి వద్ద పోలీసుల హంగామా వివాదాస్పదమైంది. గోవిందు గౌడ్ ఎన్నికల బరిలో ఉండటంతో ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని పోలీసులు బెదిరింపులకు దిగారు. తండ్రి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారనే కారణంతో ఆయన కుమారుడిని అరెస్టు చేసేందుకు ఎస్‌ఐ దిలీప్‌కుమార్ వెళ్లడం కలకలం రేపింది.
పోలీసుల తీరును నిరసిస్తూ గ్రామస్తులు వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అభ్యర్థి కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి అరెస్టు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులపై ఎస్సై లాఠీచార్జి చేసేందుకు ప్రయత్నించారు. తమ విధులకు అడ్డుపడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.


