స్థానిక ఎన్నికల్లో హింసపై తక్షణమే జోక్యం చేసుకోండి | Complaint to NHRC regarding incidents that took place during the nomination process for local body elections | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికల్లో హింసపై తక్షణమే జోక్యం చేసుకోండి

Oct 31 2026 4:33 AM | Updated on Oct 31 2026 4:33 AM

Complaint to NHRC regarding incidents that took place during the nomination process for local body elections

ఏపీలో దారుణంగా మానవ హక్కుల ఉల్లంఘన..

క్షేత్రస్థాయిలో విచారించాలని మాడభూషి శ్రీధర్‌ ఆచార్యులు, మహమ్మద్‌ సాదిక్‌ అలీ ఫిర్యాదు

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో చోటు చేసుకున్న దారుణ హింస.. యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘనలు.. పోలీసుల పక్షపాత వైఖరి, నిర్లక్ష్యంపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కి శుక్రవారం ఫిర్యాదు అందింది. మునిసిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా అధికార పక్షం బరి తెగించి దాడులకు పాల్పడటం, విపక్ష అభ్యర్థులను అడ్డుకోవడం, నామినేషన్‌ పత్రాలను చించివేయడం తదితర ఘటనలపై తక్షణమే జోక్యం చేసుకోవాలని తెలంగాణకు చెందిన మాడభూషి శ్రీధర్‌ ఆచార్యులు, న్యాయవాది మహమ్మద్‌ సాదిక్‌ అలీ ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్‌ పర్సన్, రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేశారు. 

ఈ ఫిర్యాదును స్వీకరించిన కమిషన్‌ 25292/ఐఎన్‌/2026 డైరీ నంబర్‌  కేటాయించింది. నవంబర్‌ 1న పురపాలక సంఘాలకు, నవంబర్‌ 5న ఎంపీటీసీ, జడ్పీటీసీలకు పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో దీనిపై అత్యవసర విచారణ జరపాలని ఫిర్యాదులో అభ్యర్థించారు. స్థానిక ఎన్నికల్లో విచ్చలవిడిగా దౌర్జన్యాలు జరుగుతున్నా పోలీసులు ఏమాత్రం అడ్డుకోలేకపోయారని నివేదించారు.

హింసను డీజీపీ లెక్కలే వెల్లడిస్తున్నాయి..
రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో నామినేషన్ల ప్రక్రియలో ఏకంగా 31 ఎన్నికల సంబంధిత హింసాత్మక ఘటనలు జరిగినట్లు స్వయంగా డీజీపీ నివేదించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 16 చోట్ల విపక్ష అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను లాక్కోవడం, చించివేయడం లేదా ధ్వంసం చేయడం లాంటి ఘటనలు నమోదయ్యాయి. రాయచోటిలో జరిగిన ఘర్షణల్లో 15 కార్లు ధ్వంసం కాగా నాలుగు కార్లను తగలబెట్టారు. ఇతర చోట్ల నాలుగు వాహనాలు దగ్ధం కాగా రెండు ఇళ్లపై దాడులు జరిగాయి. 

అల్లర్లను అదుపు చేసే క్రమంలో ఓ పోలీసు కానిస్టేబుల్‌ తలకు తీవ్ర గాయమైంది. ఇద్దరు వ్యక్తులు అత్యంత విషమ స్థితిలోకి వెళ్లారు. పోలీసులు మూడుసార్లు లాఠీచార్జి, ఒకసారి టియర్‌గ్యాస్‌ ప్రయోగించడంతో పాటు ఒకచోట గాల్లోకి కాల్పులు జరిపారు. హింసాత్మక ఘటనలకు సంబంధించి 16 కేసులు నమోదు చేసి 54 మందిని నిందితులుగా చేర్చారు. ఏకంగా రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లోనే నామినేషన్‌ పత్రాలు చించివేసినా పోలీసులు అడ్డుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని ఫిర్యాదుదారులు వివరించారు.

మహిళా అభ్యర్థులపై దౌర్జన్యాలు...
మహిళా అభ్యర్థులపై పలుచోట్ల అమానుష ఘటనలు చోటు చేసుకున్నాయి. మహిళలకు రిజర్వ్‌ అయిన పులివెందుల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్థానానికి పోటీ చేయాల్సిన ఓ మహిళా అభ్యర్థిని నామినేషన్‌ కేంద్రానికి వెళ్లకుండా అక్టోబర్‌ 18న పోలీసులు రోజంతా నిరోధించారు. కడప మేయర్‌ స్థానానికి పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థి ఇంటిపై అక్టోబర్‌ 19 రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, గాజు సీసాలతో దాడికి తెగబడ్డారు. చిలకలూరిపేటలో జడ్పీటీసీ నామినేషన్‌ ఫారం కోసం వచ్చిన వ్యక్తిని అడ్డుకునే క్రమంలో గృహ నిర్బంధంలో ఉన్న మాజీ మహిళా మంత్రిని స్థానిక సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నెట్టివేశారు. తిరుపతి జిల్లా కలువోయలో నామినేషన్లు వేయడానికి వచ్చేవారి కాళ్లు విరగ్గొట్టాలని ఓ శాసనసభ్యుడు తన అనుచరులను బహిరంగంగానే రెచ్చగొడుతున్న వీడియో బయటకు రావటాన్ని ఫిర్యాదులో ప్రస్తావించారు. 

బెదిరించి బలవంతపు ఏకగ్రీవాలు..
పట్టణ స్థానిక సంస్థల్లో దౌర్జన్యాలు, కిడ్నాప్‌లు, బెదిరింపులు, ఫోర్జరీ సంతకాలతో ఉపసంహరణల ద్వారా భారీగా ఏకగ్రీవాలు జరిగాయని ఫిర్యాదుదారులు నివేదించారు. అధికార కూటమికి చెందిన 726 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, ప్రధాన ప్రతిపక్షం నుంచి 19 మంది, సీపీఐ నుంచి ఒకరు, ఐదుగురు స్వతంత్రులు మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 21.08 శాతం వార్డులు, 12.58 శాతం డివిజన్లు, 17 చైర్‌పర్సన్‌ పోస్టులు పోటీ లేకుండానే ఖరారయ్యాయన్నారు. ఒక్క పులివెందులలోనే 40 మున్సిపల్‌ వార్డులకు గాను 20 వార్డులు, 64 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని పేర్కొన్నారు. హింస, దాడులు చెలరేగిన చోటే అత్యధికంగా ఏకగ్రీవాలు నమోదు కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, వీటిపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని ఫిర్యాదుదారులు నివేదించారు.

తక్షణమే విచారించండి..
ఈ వ్యవహారంపై సెక్షన్‌ 12 (ఏ) కింద తక్షణమే విచారణ చేపట్టాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఫిర్యాదుదారులు కోరారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ నుంచి నివేదికలు తెప్పించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పులివెందుల, మైదుకూరు, చిలకలూరిపేట, ములకలచెరువు ఘటనలపై కమిషన్‌ దర్యాప్తు బృందంతో క్షేత్రస్థాయి విచారణ జరిపించాలని కోరారు. నామినేషన్‌ కేంద్రాల్లోని సీసీటీవీ ఫుటేజీలను భద్రపరచాలని, మహిళా అభ్యర్థులకు పటిష్ట భద్రత కల్పించాలని, ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నమోదు కాని కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని ఫిర్యాదులో అభ్యర్థించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement