రిగ్గింగ్‌కు కుట్ర! | Threats by TDP goons after knowing the names of agents | Sakshi
Sakshi News home page

రిగ్గింగ్‌కు కుట్ర!

Oct 31 2026 4:28 AM | Updated on Oct 31 2026 4:28 AM

Threats by TDP goons after knowing the names of agents

గెలవలేమనే భయంతో బూత్‌ ఆక్రమణలకు స్కెచ్‌.. ఆపై టీడీపీ మూకతో దొంగ ఓట్లు వేయించుకునేలా కుతంత్రం

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల తరఫున ఏజెంట్లు లేకుండా వేధింపులు.. నిబంధనల్లో లేకున్నా ఏజెంట్ల పేర్లు అడుగుతున్న ఆర్వోలు

పోలీస్‌ వెరిఫికేషన్‌ పేరుతో అడ్డంకులు

ఈ నిబంధనేదీ లేదని ఎస్‌ఈసీ ప్రకటించినా ససేమిరా.. ఏజెంట్ల పేర్లు తెలుసుకుని టీడీపీ గూండాల ద్వారా బెదిరింపులు

పోలింగ్‌ ముగిసే వరకు ఏజెంట్లను ఎప్పుడైనా సరే మార్చుకునే వీలు

సాక్షి, అమరావతి : పోలింగ్‌ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు లేకుండా చేసి, అధికార పార్టీ గూండాలు బూత్‌లను పూర్తిగా అక్రమించుకొని ఎన్నికలను ఏకపక్షంగా జరిపేందుకు ప్రభుత్వ పెద్దలు కొత్త దుర్మార్గాలకు తెరతీశారు. పోలీసులు, ఎన్నికల అధికారులను అడ్డుపెట్టుకుని పోలింగ్‌ ఏజెంట్ల నియామక నిబంధనలను సైతం ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారు. పోలింగ్‌ బూత్‌లో పార్టీ తరుఫున ఉండే ఏజెంట్లకు పోలీసు క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ ఉండాలనే నిబంధన లేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసినా, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను మాత్రం ఆ సర్టిఫికెట్లు కావాలని ఒత్తిడి తెస్తున్నారు. 

మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ఏజెంట్ల నియామకంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సెప్టెంబర్‌ 18న జారీ చేసిన మార్గదర్శకాలను పూర్తిగా పక్కన పెట్టి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నియమించుకునే పోలింగ్‌ ఏజెంట్ల పేర్లను తమకు ముందే ఇవ్వాలంటూ పలుచోట్ల వేధిస్తున్నారు. బూత్‌ ఏజెంట్ల పేర్లను ఆర్వోల ద్వారా తెలుసుకుని వారి మీద పోలీసుల ద్వారా తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్న దుస్థితి నెలకొంది. కొన్ని చోట్ల టీడీపీ గూండాలు పోలీసులను అడ్డంపెట్టుకొని ఆయా పోలింగ్‌ ఏజెంట్లను కిడ్నాప్‌ చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వాపోతున్నారు. మొత్తంగా పోలింగ్‌ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను లేకుండా చేయడం ద్వారా రిగ్గింగ్‌ చేసుకోవాలన్నదే ప్రభుత్వ పెద్దల ఎత్తుగడ అని స్పష్టమవుతోంది.   

అక్రమాలనే నమ్ముకున్న ప్రభుత్వ పెద్దలు 
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్‌ సిక్స్, తదితర హామీలేవీ నెరవేర్చక పోవడంతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితిలో స్థానిక ఎన్నికల్లో గట్టెక్కడానికి పూర్తిగా అక్రమాలనే నమ్ముకుంది. ప్రతిపక్ష  వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు కూడా వేయకుండా అల్లరి మూకల ద్వారా అడ్డుకుని చింపివేసిన ఘటనలు కోకొల్లలుగా వెలుగు చూడటం తెలిసిందే. ఈ అవాంతరాలను దాటుకుని పోటీలో నిలిచిన చోట్ల పోలింగ్‌ రోజున బూత్‌ ఆక్రమణలు, రిగ్గింగ్‌ దురాగతాలకు పాల్పడేలా కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. 

కాగా, మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీలో ఉండే రాజకీయ పార్టీ అభ్యర్థులు రిటర్నింగ్‌ అధికారులకు ముందుగా ఇచ్చిన పోలింగ్‌ ఏజెంట్లను.. ఆ తర్వాత వివిధ కారణాలతో పోలింగ్‌ ముగిసే వరకు ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ‘అపాయింట్‌మెంట్‌ ఆఫ్‌ పోలింగ్‌ ఏజెంట్స్‌ – డైరక్షన్స్‌’ పేరిట ఎస్‌ఈసీ జారీ చేసిన సర్క్యులర్‌లో ఏజెంట్ల నియామకానికి ముందస్తుగా పేర్లను రిటర్నింగ్‌ అధికారులకు ఇవ్వడానికి ప్రత్యేకంగా నిర్దిష్ట గడువును పేర్కొనలేదు. అభ్యర్థులు తమ ఎన్నికల ఏజెంట్‌ నియామకాన్ని రద్దు చేసి, వేరొకరిని ఎన్నికల ఏజెంట్‌గా నియమించుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. 

రిటర్నింగ్‌ అధికారికి, బూత్‌ ఎన్నికల అధికారికి నోటీసు ఇచ్చి మార్చుకోవచ్చు. పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపాలిటీలో ఏజెంట్ల ఫారాలను ఎన్నికల అధికారికి ఇచ్చేందుకు వెళ్లిన స్థానిక వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు పోలా శ్రీనివాసరావుపై టీడీపీ అల్లరి మూకలు దాడి చేసి, ఆ ఫారాలు లాక్కొని చింపేశాయి. ఒంగోలు కార్పొరేషన్‌లో ఏజెంట్లకు పోలీసు వెరిఫికేషన్‌ సర్టిఫికెట్‌ అడుగుతున్నట్లు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు చెబుతున్నారు. తాడిపత్రిలోనూ ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement