బీఫారాలు, ఏజెంట్‌ ఫారాల చించివేతపై వైఎస్సార్‌సీపీ వినతిని పరిగణనలోకి తీసుకోండి | High Court directive to the State Election Commissioner | Sakshi
Sakshi News home page

బీఫారాలు, ఏజెంట్‌ ఫారాల చించివేతపై వైఎస్సార్‌సీపీ వినతిని పరిగణనలోకి తీసుకోండి

Oct 31 2026 4:43 AM | Updated on Oct 31 2026 4:43 AM

High Court directive to the State Election Commissioner

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు హైకోర్టు ఆదేశం  

సాక్షి, అమరావతి: పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్‌ ఆఫీసులో తమ అభ్యర్థులు సమర్పించిన బీఫారాలను బలవంతంగా లాక్కుని చింపేసి, మహిళా అభ్యర్థులపై దాడిచేసిన తెలుగుదేశం పార్టీ నేతలపై కేసు నమోదు చేసి, సీనియర్‌ అధికారి చేత విచారణ జరిపించేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఇచ్చిన వినతిపత్రాన్ని పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను ఆదేశించింది. ఆ వినతిపై తగిన నిర్ణయం వెలువరించాలని స్పష్టం చేసింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ మండవ కిరణ్మయి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 21న మాచర్ల మున్సిపల్‌ ఆఫీసులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల బీఫారాలను సిట్టింగ్‌ ఎమ్మెల్యే బ్రహ్మరెడ్డి కుమారుడు గౌతమ్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యక్తులు లాక్కుని చించేశారు. అంతేగాక మహిళా అభ్యర్థులపై కూడా దాడులు చేశారు. దీంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు పార్టీ గుర్తు దక్కలేదు. వీరికి కప్‌బోర్డు గుర్తు లభించింది.  

మరోసారి రౌడీయిజం  
ఇదిలా ఉండగానే ఈ నెల 29న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మాచర్ల మున్సిపల్‌ ఆఫీసులో వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థులు సమర్పించిన ఏజెంట్‌ ఫారాలను కూడా తెలుగుదేశం పార్టీ నేతలు చించేశారు. అంతేకాక కర్రలతో దాడిచేసేందుకు వచ్చి బెదిరించి వెళ్లారు. ఈ ఘటనపై సీనియర్‌ అధికారి ద్వారా తక్షణ విచారణ జరిపించి, బాధ్యులపై కేసులు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి షేక్‌ ఆషా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజీని భద్రపరిచి, విచారణ నిమిత్తం దాన్ని పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. 

అలాగే అక్టోబర్‌ 21 నాటి సీసీటీవీ రికార్డులను, కెమెరాలు ఎవరు ఆపారనే దానిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. మున్సిపల్‌ ఆఫీసు వద్ద తగినంత పోలీసు భద్రతను ఏర్పాటు చేసి, అనధికార వ్యక్తులు గుమికూడకుండా చూడాలని కోరారు. అంతేగాక అభ్యర్థులకు, ముఖ్యంగా మహిళా అభ్యర్థులు, వారి ఏజెంట్లు, మద్దతుదారులకు తగిన భద్రత కల్పించాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు. అయితే యథాతథంగా కమిషన్‌ స్పందించలేదు. దీంతో షేక్‌ ఆషా హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం జస్టిస్‌ కిరణ్మయి విచారణ జరిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్‌ సమర్పించిన వినతిపత్రాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఎన్నికల కమిషనర్‌ను ఆదేశించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement