- విజేతలకు అవార్డులు అందించనున్న రాష్ట్రపతి
- ఈసారి... గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో
- ఇకపై ఏటా ఒక్కో రాష్ట్రంలో ప్రదానోత్సవం
గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవానికి సర్వం సిద్ధమైంది. మంగళవారం జరుగుతున్న ఈ సినీ తారా సందోహ కార్యక్రమానికి ఏక్తానగర్ (ఒకప్పటి పేరు కేవడియా) సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. 2024వ సంవత్సరానికిగానూ ఇస్తున్న ఈ అవార్డులను ముఖ్య అతిథి భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా విజేతలు అందుకోనున్నారు.
మంగళవారం సాయంత్రం 4 గంటలకు కేవడియాలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ-సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద బస్ బే ఏరియాలో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర రజనీకాంత్ పటేల్, కేంద్ర సమాచార-ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర సమాచార-ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ గౌరవ అతిథులుగా ఈ ప్రదానోత్సవంలో పాల్గొననున్నారు.
ఆనవాయితీగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఏటా జరిగే ఈ అవార్డుల ప్రదానం దేశరాజధాని వదిలి బయట వేదికకు తరలి రావడం ఈసారి విశేషమే. ఇప్పటి వరకు జాతీయ అవార్డుల చరిత్రలో కేవలం రెండుసార్లే ఇలా ఢిల్లీకి వెలుపల వేరే నగరాల్లో (1965లో బొంబాయిలో, 1970లో మద్రాసులో) ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాల ప్రదానం జరిగింది. ఇక నుంచి ఏటా వేర్వేరు రాష్ట్రాల్లో ఈ అవార్డుల ఉత్సవం జరపనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి, గతంలో 1965లోనే నాటి ప్రభుత్వాలు ఆ తరహా ఆలోచన చేసి, ప్రకటించినా... ఆచరణలో జరగలేదు. మరి, ఈసారి తీసుకున్న ఏటేటా వేదికల మార్పు విధాన నిర్ణయం ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాలి.
నేటి 72వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో ‘కల్కి’, ‘కమిటీ కుర్రోళ్లు’, ‘35... చిన్న కథ కాదు’, ‘పుష్ప-2’, ‘లక్కీ భాస్కర్’ లాంటి తెలుగు చిత్రాలు మొత్తం 9 అవార్డులతో వేదికపై మెరిసిపోనున్నాయి. ఒకప్పటి బ్లాక్ అండ్ వైట్ నేరు తెలుగు చిత్రాలు ‘ప్రేమలేఖలు’, ‘అనుగ్రహం’ నాటి నుంచి ఇటీవలి ‘భీష్మ’, ‘కె.జి.ఎఫ్’ దాకా తెలుగు వారికి సైతం సుపరిచితుడైన ప్రసిద్ధ కన్నడ నటుడు అనంత్ నాగ్ భారతీయ సినిమాకు సంబంధించి అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఈసారి అందుకోనున్నారు.
ఉత్తమ చిత్రంగా ‘ఆర్టికల్ 370’, అదే చిత్రంలో నటించిన యామీ గౌతమ్ ఉత్తమ నటిగా యామీ, ఉత్తమ నటుడి కేటగిరీలో మమ్ముట్టి (మలయాళ చిత్రం: ‘భ్రమయుగం’), కార్తీక్ ఆర్యన్ (హిందీ చిత్రం: ‘చందు ఛాంపియన్’)లు సంయక్తంగా విజేతలయ్యారు. ఉత్తమ దర్శకుడిగా రాజ్‌కుమార్ పెరియసామి (తమిళ చిత్రం: ‘అమరన్’), ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా రణదీప్ హూడా (హిందీ చిత్రం: ‘స్వాతంత్య్ర వీర్ సావర్కర్’), ఉత్తమ సినీ గ్రంథంగా కన్నడ పుస్తకం ‘నానిరువుడే నిమగాగి... నాడిరువుడే ననగాగి’ (రచయిత కె. ప్రదీప్ కుమార్ శెట్టి), ఉత్తమ సినీ విమర్శకుడిగా సంజీవ్ శ్రీవాస్తవ (హిందీ జర్నలిస్ట్) అవార్డులు అందుకుంటున్నారు.
జాతీయ స్థాయిలో సకుటుంబ వినోదం అందించి, ప్రజాదరణ పొందిన ఉత్తమ చిత్రంగా ప్రభాస్ ‘కల్కి’, ఉత్తమ బాలల చిత్రంగా ‘35... చిన్న కథ కాదు’, ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కమిటీ కుర్రోళ్ళు’, ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా దర్శకుడు సుకుమార్ (‘పుష్ప-2’), ఉత్తమ సంభాషణల రచయితగా మరో దర్శకుడు వెంకీ అట్లూరి (‘లక్కీ భాస్కర్’) ఇవాళ రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు అందుకోనున్నారు. ఇంకా ఉత్తమ బాల నటుడు (అరుణ్‌దేవ్ పోతుల – ’35… చిన్న కథ కాదు’), ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ (నితిన్ జిహానీ చౌధరీ – ‘కల్కి’), ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ (దీపాలీ నూర్, శీతల్ శర్మ – ‘పుష్ప2’), ఉత్తమ మేకప్ (పి. రవికుమార్ – ‘కమిటీ కుర్రోళ్ళు’) కేటగిరీల్లోనూ మనవాళ్ళు తెలుగు సినిమా జెండా జాతీయస్థాయిలో ఎగరేశారు.
3 విభాగాలు... 45 అవార్డులు!
నిజానికి, దాదాసాహెబ్ ఫాల్కే తీసిన పూర్తి నిడివి దేశీయ కథాకథన చిత్రం ‘రాజా హరిశ్చంద్ర’తో 1913లో భారతీయ సినీపరిశ్రమ ప్రస్థానం ప్రారంభమైంది. మూకీల నుంచి టాకీల దాకా ఎదిగి, దేశానికి స్వాతంత్య్రం కూడా వచ్చాక 1949లో సినీ పరిశ్రమ పురోభివృద్ధికి సలహాలు కోరుతూ ‘ఫిల్మ్ ఎంక్వైరీ కమిటీ’ని నియమించారు. చలనచిత్రాలకు అవార్డులు ఇవ్వాలంటూ ఆ కమిటీ సిఫార్సు చేసింది. ఫలితంగా, 1954లో భారత ప్రభుత్వం జాతీయ అవార్డులను నెలకొల్పింది. 1953వ సంవత్సరపు సినిమాలకు గాను తొలిసారిగా అవార్డులివ్వడంతో 1954లో జాతీయ అవార్డుల ప్రదానోత్సవం ఆనవాయితీ ఆరంభమైంది. అప్పటి నుంచి భారతీయ చలనచిత్ర నిర్మాణంలోని అత్యుత్తమ సృజనాత్మక, సాంకేతిక నైపుణ్యాలను అభినందిస్తూ ప్రతి ఏటా కేంద్రప్రభుత్వం ఈ అవార్డులను ఇస్తూ వస్తోంది.
వెరసి, గత ఏడు దశాబ్దాల పైచిలుకు కాలంలో ఈ అవార్డులు ఓ ప్రత్యేక గౌరవాన్ని సంతరించుకున్నాయి. ఫీచర్ ఫిల్ములు, నాన్ – ఫీచర్ ఫిల్ములు, సినిమాపై ఉత్తమ రచన అనే మూడు ప్రధాన విభాగాల్లో ఈ జాతీయ అవార్డుల ప్రదానం జరుగుతుంది. ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పూర్తి నిడివి చిత్రాలకూ, నాన్ – ఫీచర్ ఫిల్మ్ విభాగంలో డాక్యుమెంటరీలు – షార్ట్ ఫిల్మ్‌లు – యానిమేషన్ తదితరాలకూ, సినిమాపై ఉత్తమ రచన విభాగంలో ఉత్తమ పుస్తకం, ఉత్తమ సినీ విమర్శకుడికీ అవార్డులు ఇస్తారు. ఈ మూడు ప్రధాన విభాగాలకూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిపుణుల జ్యూరీల ఛైర్‌పర్సన్లు తాజా 72వ జాతీయ అవార్డుల విజేతలను ఇటీవల జూలైలో ప్రకటించారు. ఇవాళ్టి ఉత్సవంలో రాష్ట్రపతి మొత్తం 92 మంది అవార్డు విజేతలను స్వయంగా అభినందించి, పురస్కార ప్రదానం చేయనున్నారు.
మొదటి ఏడాది కేవలం తొమ్మిదే అవార్డులతో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులు మొదలయ్యాయి. రెండో ఏడాది నుంచి ప్రాంతీయ భాషా చిత్రాలకు సైతం అవార్డులివ్వడం ప్రారంభించారు. 1967 నుంచి సినిమాల్లోని నటీనటులు, సాంకేతిక నిపుణులకు సైతం ప్రత్యేకంగా అవార్డులు నెలకొల్పారు. అప్పట్లో జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ‘భరత్’ అనీ, జాతీయ ఉత్తమ నటి అవార్డును ‘ఊర్వశి’ అనీ పేర్కొనేవారు. 1968లో ప్రముఖ తారలు ఉత్తమ్ కుమార్, నర్గీస్‌లు ఆ అవార్డులను అందుకున్న తొలి ఆర్టిస్టులయ్యారు.
కాలక్రమంలో కొత్త కేటగిరీలను సైతం చేర్చుకుంటూ రావడంతో అవార్డుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఫీచర్ ఫిల్మ్స్ విభాగంలో 26 (ప్రత్యేక ప్రశంసలు కలిపి), నాన్ – ఫీచర్ ఫిల్మ్స్ విభాగంలో 16 (ప్రత్యేక ప్రశంసలు కలిపి), సినిమాపై ఉత్తమ రచన విభాగంలో 2, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఒకటి... ఇలా మొత్తం 45 అవార్డులు ఉన్నాయి. విజేతలకు ఆ యా కేటగిరీని బట్టి స్వర్ణకమలం, రజత కమలం, నగదు బహుమతి అందజేస్తారు.
ఆ రోజుల్లోనే వివాదాలు!
ఇక, 1969 నుంచి అత్యున్నత పురస్కారంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఇవ్వడం ప్రారంభించారు. మద్రాసులో 1970 నవంబర్‌లో జరిగిన 17వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో తొలి ఫాల్కే అవార్డును నటి దేవికారాణి అందుకున్నారు. అయితే, అవార్డులపై వివాదం చెలరేగడం ఇవాళ కొత్త కాదు. ఆ రోజుల నుంచీ ఉన్నదే. తొలి ఫాల్కే అవార్డుకు సినీ పరిశ్రమ సిఫార్సు చేసిన దర్శక – నిర్మాత వి. శాంతారామ్ పేరు పక్కనబెట్టి, నటి దేవికా రాణిని ప్రతిష్ఠాత్మక ఫాల్కే అవార్డుకు ఎంపిక చేయడంపై అప్పట్లోనే వివాదం చెలరేగింది. అప్పట్లో ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐ.ఎం.పి.పి.ఏ) అధ్యక్షుడు ఐ.ఎస్. జోహార్ “ఈ చర్య సినీ పరిశ్రమకు ఘోరమైన అవమానం” అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ప్రభుత్వ నిర్ణయానికి “నిరసనగా”, ఐ.ఎం.పి.పి.ఏ. ఆ అవార్డుల ప్రదానోత్సవాన్నే ఆ రోజుల్లో “బాయ్‌కాట్” చేసింది.
మొదట్లో చాలా ఏళ్ళు ఈ నేషనల్ అవార్డుల వ్యవహారమంతా కేంద్ర సమాచార శాఖే నిర్వహించేంది. 1973 నుంచి ‘డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్’కు ఆ బాధ్యతను అప్పగించారు. ఇక, ఇటీవల 2022లో వివిధ కేంద్ర ప్రభుత్వ వ్యవస్థల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ‘డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్’ను తీసుకువెళ్ళి ‘నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్’ (ఎన్.ఎఫ్.డి.సి)లో విలీనం చేసింది. అప్పటి నుంచి అవార్డుల ఎంపిక, నిర్వహణ తదితర బాధ్యతలన్నీ ఎన్.ఎఫ్.డి.సి. నిర్వర్తిస్తోంది.
రెండంచెల ఎంపిక... ఆ భాషలకూ గౌరవం...
అలాగే, 57వ జాతీయ అవార్డుల నుంచి ఫీచర్ ఫిల్మ్స్ విభాగంలో అవార్డు విజేతల ఎంపికకు రెండంచెల విధానాన్ని అనుసరిస్తున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన ఫీచర్ ఫిల్మ్ ఎంట్రీలన్నిటినీ ముందుగా 5 ప్రాంతీయ ప్యానెల్స్ చూసి, అందులో నుంచి కొన్నింటిని మొదటి వడపోతలో ఎంపిక చేస్తాయి. ఆ తర్వాత ఓ సెంట్రల్ ప్యానెల్ ఆ తొలి వడపోతలో నిగ్గు తేలిన సినిమాలను పరిశీలించి, విజేతలను నిర్ణయిస్తుంది. నాన్ ఫీచర్ ఫిల్మ్, సినిమాపై ఉత్తమ రచన విభాగాలకు ప్రత్యేక జ్యూరీలు ఉంటాయి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు మాత్రం ఎంట్రీలను ఆహ్వానించడం ఉండదు. ప్రత్యేకంగా నియమించిన సినీ దిగ్గజాల కమిటీ ఫాల్కే అవార్డు విజేత పేరును సిఫార్సు చేస్తుంది.
రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో గుర్తింపు పొందిన ప్రతి భారతీయ భాషలోనూ ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు అందజేస్తారు. ఎనిమిదో షెడ్యూల్‌లో లేని భాషల చిత్రాలకు ప్రత్యేక అవార్డులు ఇస్తుంటారు. దాని కింద ఈ 72వ జాతీయ అవార్డుల్లో గఢ్వాలీ భాషలోని ‘ఢోలీ’ చిత్రం, తుళు భాషలోని ‘ఇంబు’ చిత్రం గుర్తింపు పొందాయి. అలాగే, ఈసారి అవార్డుల్లో నాన్ – ఫీచర్ ఫిల్మ్ విభాగంలో తొలిసారిగా ఓ సంథాలీ భాషా చిత్రం గౌరవం అందుకోవడం మరో విశేషం.
ఇక, ఈసారి నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఉత్తమ దర్శకుడి అవార్డు ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ – ఏక్తా కా ప్రతీక్’ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆనంద్ ఎల్. రాయ్‌కు దక్కింది. ఇప్పుడు సరిగ్గా అదే ప్రాంతంలో నర్మదా నదీ తీరంలోని 2018లో ఏర్పాటైన 597 అడుగుల వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహం (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) సాక్షిగా జాతీయ అవార్డుల ప్రదానం జరగడం, అక్కడే ఆనంద్ రాయ్ అవార్డు అందుకోవడం గమనార్హం. -గుజరాత్‌లోని ఏక్తా నగర్ నుంచి ఆర్.జయ


