ఒకప్పుడు థియేటర్‌లో చప్పట్లు కొట్టించాలంటే భారీ ఫైట్లు, పంచ్ డైలాగులు, చెవులు పగిలేలా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, రక్తపాతమే చాలు అనుకునేవారు. కానీ ఇప్పుడు అదే ఫార్ములా మొదలైతే చాలు… “ఆపండ్రోయ్!” అని తలలు పట్టుకుంటున్నాడు ప్రేక్షకుడు. అతిమితి హింస, శబ్దం, ఎలివేషన్లతో విసిగిపోతున్నాడు. వీలైతే థియేటర్ తలుపులు బద్దలు కొట్టుకుని బయటికి పారిపోవాలనిపించేంతగా ఫీలైపోతున్నాడు. కథ కంటే గోల ఎక్కువైతే, ఇప్పుడు ఆడియన్స్ ఇచ్చే తీర్పు ఒక్కటే.. రిజెక్ట్.
ప్రేక్షకుడికి యాక్షన్ కొత్తది కాదు. దశాబ్దాలుగా తెలుగు సినిమాల్లో ఫైట్లు, మాస్ సీన్లు ఆదరణ పొందుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు సమస్య హింస ఉండటంలో కాదు… ప్రతి సన్నివేశాన్నీ రక్తంతో నింపేయడంలో ఉంది. కత్తి, గొడ్డలి, తుపాకీ, శరీరాలు ఎగిరిపడే విజువల్స్.. ఇవన్నీ కథలో భాగం కాకుండా స్టైల్‌గా మారిపోయాయి. ఒకప్పుడు షాక్ ఇచ్చిన విజువల్ ఇప్పుడు రొటీన్‌గా మారింది. అందుకే ప్రేక్షకుడు ఆశ్చర్యపడటం మానేసి, అలసిపోతున్నాడు.
భావోద్వేగం తగ్గి..
ఇటీవలి సినిమాల్లో మరో కామన్ కంప్లైంట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. హీరో నడిచినా డ్రమ్స్, విలన్ చూసినా బాస్, డైలాగ్ చెప్పినా వందమంది వాయిద్యకారులు ఒకేసారి మోగుతున్నట్టు శబ్దం. సన్నివేశం ఏం చెబుతోందన్న దానికంటే, స్పీకర్లు ఎంత గట్టిగా అరుస్తున్నాయన్నదే ఎక్కువగా వినిపిస్తోంది. ప్రేక్షకుడు ఇప్పుడు థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఆ రణగొణ ధ్వనులు… గుండెల్లో మిగిలే సీన్ కావాలనుకుంటున్నాడు.
ఓవర్ హైప్ కూడా బూమరాంగే
సోషల్ మీడియా వచ్చిన తర్వాత సినిమా ప్రమోషన్ పూర్తిగా మారిపోయింది. రిలీజ్‌కు నెలల ముందే “ఇండస్ట్రీ హిట్”, “హాలీవుడ్ లెవెల్”, “గేమ్ ఛేంజర్” అనే ట్యాగ్‌లు వైరల్ అవుతున్నాయి. టీజర్ కంటే ఫ్యాన్ ఎడిట్లు ఎక్కువ, సినిమా కంటే ఎక్స్‌పెక్టేషన్లు పెద్దవైపోతున్నాయి. దీంతో మొదటి రోజు ఓపెనింగ్స్ వస్తున్నాయి. కానీ కంటెంట్ అంచనాలకు తగ్గట్టుగా లేకపోతే రెండో రోజు నుంచే సోషల్ మీడియాలో అదే ప్రేక్షకుడు ట్రోల్ చేయడం మొదలుపెడుతున్నాడు. హైప్ ఇప్పుడు ఆశీర్వాదం మాత్రమే కాదు… ప్రమాదం కూడా.
ఓటీటీ ప్రేక్షకుడు మారిపోయాడు
ఒకప్పుడు ప్రేక్షకుడికి ఎంపికలు తక్కువ. ఇప్పుడు ఇంట్లోనే ప్రపంచ సినిమా చూస్తున్నాడు. కొరియన్ థ్రిల్లర్, మలయాళ డ్రామా, స్పానిష్ క్రైమ్, జపాన్ యానిమేషన్.. అన్నీ ఒకే స్క్రీన్‌పై ఉన్నాయి. అందుకే అతని అభిరుచి కూడా మారింది. ఇప్పుడు అతను అడిగేది ఒక్కటే: “ఈ సీన్ కథకు అవసరమా?” అవసరం లేకపోతే ఎంత ఖర్చు పెట్టినా, ఎంత స్టార్ ఉన్నా క్షమించడం లేదు.
ఫ్యామిలీ ఆడియన్స్‌ను కోల్పోతున్నామా?
అతిమితి హింస, బూతులు, అవసరంలేని శృంగారం వల్ల మరో వర్గం నెమ్మదిగా థియేటర్లకు దూరమవుతోంది.. కుటుంబ ప్రేక్షకులే. ఆదివారమో, పండుగలొస్తే మొత్తం కుటుంబం వెళ్లే సినిమా, ఇప్పుడు “పిల్లలతో చూడొచ్చా?” అనే ప్రశ్న దగ్గరే ఆగిపోతోంది. ఈ మార్పు బాక్సాఫీస్‌పైనా ప్రభావం చూపుతోంది.
కొత్త ట్రెండ్‌కు నాంది ఇదేనా?
ప్రేక్షకుడు మాస్‌ను తిరస్కరించడం లేదు. యాక్షన్‌ను ద్వేషించడం లేదు. కానీ అర్థం లేని అరుపులను, కారణం లేని రక్తపాతాన్ని, కథను మింగేసే ఎలివేషన్లను మాత్రం తిరస్కరిస్తున్నాడు. సినిమా ఎంత పెద్దదన్నది కాదు… కథ ఎంత బలంగా ఉందన్నదే ఇప్పుడు అసలైన పాన్ ఇండియా ఫార్ములాగా మారుతోంది. అదే ‘2026 ప్రేక్షకుడు’ ఇండస్ట్రీకి ఇస్తున్న స్పష్టమైన సందేశం.
:::సాక్షి వెబ్ ప్రత్యేకం


